ముంబై,జూన్23 : బీజేపీ ఉచ్చులో పడవద్దని, ఆ పార్టీ కుట్రకు బలికావద్దని ఏక్నాథ్ షిండే రెబల్ గ్రూప్ నుంచి తిరిగి వచ్చిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ కోరారు. పార్టీ చీఫ్, సీఎం ఉద్ధవ్ కు అన్నీ ఇచ్చారని అన్నారు. శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ బుధవారం గౌహతి నుంచి ముంబైకి తిరిగివచ్చారు. రెబల్ బృందం తనను కిడ్నాప్ చేసిందని ఆయన ఆరోపించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ, ఏక్నాథ్ షిండేను ట్రాప్ చేసిందని విమర్శించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ కుట్రకు బలికావద్దని షిండేకు సూచించారు. బాలసాహేబ్ ఠాక్రే, ఉద్ధవ్, శివసేన కు అన్ని ఇచ్చారని నితిన్ దేశ్ముఖ్ అన్నారు. మరో శివసేన ఎమ్మెల్యే కైలాష్ పటేల్ కూడా గుజరాత్ సరిహద్దు నుంచి ముంబైకు తిరిగి వచ్చారు. డియాతో మాట్లాడిన ఆయన ఏక్నాథ్ షిండేతో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు తిరిగి రావాలనుకుంటున్నారని చెప్పారు.
మరోవైపు రెబల్ శిబిరాన్ని వీడి ముంబైకి తిరిగి వచ్చిన ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేలను శివసేన గురువారం సత్కరించింది. మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. ’సహనం, సమయం’ అవసరమంటూ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది గురువారం ఒక ట్వీట్ చేశారు.