అక్కడ కొన్ని దేహాలు
మాట్లాడతాయి
కొమ్మలకు ఇప్పటికీ
వేళాడబడి వుంటాయి
అల్లంత దూరంలో
గొంతులను పేర్చబడి
చోద్యం చుస్తూ వున్న
కొన్ని రాబందులు
కుప్పల తెప్పల సంజాయిషీలు
పడి వుంటాయి
సైగలు చేసే చేతులు
కాలే కడుపులు
ఎండిన డొక్కలు
దీనంగా చూస్తుంటాయి
ఆ చూపుల తడిలో ఇప్పటికీ
వెచ్చగా కొన్ని గింజలు
మొలకెత్తుతుంటాయి
చేసిన శ్రమ దోచబడుచున్న చోట
నిందితుల్లా నిలబడాల్సిన
గత్యంతరం
కూరుస్తున్నాడు ఈ నూత్న మానవుడు
కష్టం చెల్లని నాణెంలా
అస్వీకరణకు గురైన ప్రతిసారీ
బతకడానికి దారులు
వెతుకుతూనే వున్నాడు
ఇంకా ఇంకా భరిస్తూనే
పోతున్నాడు
కాళ్ళకు కనపడని సంకెళ్ళు
లాక్కుంటూ ఈడ్చుకుంటూ…
చేసిన ఫిర్యాదులు కనీసం
చూడనూలేదు
అవి మూలుగుతూ
సంవత్సరాలపాటు
గదుల్లోనే ఆ అరల్లోనే
హత్యగావించబడతాయి
ప్రతి కొన్ని సంవత్సరాలకు
కొత్త రంగులు పులుమబడి
ఉపశమనం గావించబడతాయి
కొన్ని తలలు కొన్ని నాలుకలు
పిడికిళ్ళు
నిలువునా రగిలిపోతూనే
వుంటాయ్
ఇక ఎదురు తిరిగితే
అణచివేసే కళ్ళు
ఇంకేమీ చేయలేవన్న స్పృహను
కల్పించడానికే కదలాలి
విడిపించడానికే లేవాలి
ఆ దేహాలు
ఇంత చమురు కూడగట్టుకుని
వెలిగించుకోవాలి
ఇకనైనా
స్వయం ప్రకాశాలు కావాలి
వినూత్న కాంతులివ్వాలి!
– రఘు వగ్గు, 9603245215