గత దశాబ్దాలుగా పుడమి తల్లినే నమ్ముకుని సాగు చేస్తున్న రైతుల వ్యధలు అన్నీ ఇన్నీ కావు.పది కాలాలపాటు నిలిచి పదిమంది ప్రాణాలను కాపాడే అన్నదాత రైతు. రైతుకు కష్టం వస్తే భరిస్తాడు తప్ప గొంతెత్తడు అనే నమ్మకం నాయక గణానికి వచ్చేసింది. ఎందుకంటే రైతులు సంఘటితం కాలేరు అనే నమ్మకం.నిజమే రైతులే సంఘటిత పోరాటాలు నడిపి ఉంటే ప్రభుత్వాలు ఎప్పుడో దిగి వచ్చేవి.రైతులకు సహనం ఎక్కువ నష్టాలను కష్టాలను భరిస్తూనే ఉంటారు.సహనం కోల్పోతే తన శక్తి ఏమిటో చూపిస్తారు రైతులు .పంజాబ్ రైతుల పోరాట పటిమ మనం చూసాం ప్రాణాలకు తెగించి రైతు ప్రయోజనాలను కాపాడుకోవడానికి చేసిన ఉద్యమం మొత్తం రైతు లోకానికి ఒక స్ఫూర్తిగా నిలిచింది.రాజకీయ పక్షాల ప్రవేశానికి అవకాసం లేకుండా అవిశ్రాంతంగా పోరాటం చేసి ప్రభుత్వ మెడలు వంచగలిగారు రైతులు.రైతు బాగుంటే దేశం బాగుంటుంది.రైతు అన్నదాత.ఈ దేశానికి రైతే వెన్నె ముక అంటూ పొగడ్తలు చేయడం తప్ప రైతాంగానికి చిత్తశుద్దితో ఏ ప్రభుత్వమూ చేయలేదనే చెప్పవచ్చు.
వ్యవసాయాన్ని రైతాంగాన్ని అడుగడుగునా నిర్లక్ష్యానికి గురి చేస్తూ పోతుంటే రానున్న రోజుల్లో ఆహార భద్రత కొరవడి ఆకలి మరణాలు సంభవించడం ఖాయం. పారిశ్రామిక వేత్తలకు వాణిజ్య వర్గాలకు ఉదారంగా రాయితీలు కల్పించే ప్రభుత్వాలు రైతుల ప్రయోజనాలు కాపాడటంలో మొహం చాటేస్తున్నాయి. వ్యవసాయం కూడా పరిశ్రమే కానీ అందులో వ్యవసాయదారులకు మాత్రం వ్యాపారవిధానాలను అనుసరించే అవకాశమే ఉండదు. పారిశ్రామిక వేత్త తాను ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు తాను ధర నిర్ణయించుకొనే స్వేచ్ఛ ఉంది.మరి రైతుకు ఆ అవకాసం లేదు.ఎరువులు క్రిమి సంహారక మందులు వ్యవసాయ కూలీల వేతనాలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి కానీ రైతు ఉత్పత్తులకు మాత్రం గిట్టు బాటు ధర లేదు.పంట చేతికి వచ్చే వరకు కూడా నమ్మకం లేదు.సాగు నీరు మురుగు నీరు పారుదల మరొక కీలక సమస్య.రుణాల మంజూరులో ఇబ్బందులు ఇలా ఎన్నో సమస్యలు భరిస్తూ ఇక సహనం కోల్పోయి కోనసీమలో 2 వ పర్యాయం రైతులు పంట విరామాన్ని ప్రకటించారు.ఈ పంట విరామం అన్నది మొదటి సారిగా దాదాపు 12 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తయ్యే అన్ని జిల్లాల్లో పొగాకు రైతులు సంయుక్తంగా క్రాప్ హాలీడే ప్రకటించారు.
ఈ నిర్ణయం పొగాకు రంగాన్ని సంక్షోభం లోనికి నెట్టేసింది. దాంతో ప్రభుత్వం, వ్యాపారులు దిగి వచ్చి రైతులు రైతు సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించుకున్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుత కోనసీమ జిల్లా లోని వరి పండించే అల్లవరం గ్రామ రైతులు 2011లో సంఘటితమై వరి పంట విరామం ప్రకటించడానికి నిర్ణయం తీసుకున్నారు.గిట్టు బాటు ధరలు లేక పోవడం.ఖరీఫ్ పంటల విషయంలో మురుగు నీటి పారుదల సక్రమంగా లేకపోవడం వలన తరచు ముంపు కు గురై నష్ట పోతూ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం మొదలైన కారణాల చేత రైతులు ఆనాడు పంట విరామ ప్రకటన చేశారు.దానికి స్పందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో చర్చలు జరిపి ప్రత్యేకించి ఈ సమస్యల పరిష్కారానికై మోహన్ కందా అధ్యక్షతన ఒక కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు.కమిటీ సిఫారసులు కానీ రైతుల డిమాండ్లు కానీ కాల గర్భంలో కలసి పోయాయి.రైతు పరిస్ధితి లో ఏ మాత్రం మార్పు గోచరించలేదు. చూసి చూసి విసుగెత్తిన రైతాంగం 11 సంవత్సరాల అనంతరం మరలా పంట విరామం అంటూ కోనసీమ రైతాంగం ఉద్యమ బాట పట్టారు.కోనసీమలో కొన్ని మండలలకే పరిమితమైన ఈ ఉద్యమం మిగిలిన మండలాలు కు వ్యాప్తి చెందటం ఆరంభం అయ్యింది.ప్రస్తుత ఉద్యమంలో రైతాంగం అంతా చెబుతున్న మాట ఒక్కటే.
సేద్యం చేస్తే 15 వేలు నష్టం సేద్యం చేయక పోతే 15 వేలు మిగులు అయినా సేద్యం చేస్తూనే ఉన్నాం. నష్టపోతూనే ఉన్నాము. ఇక మాకు సహనం కోల్పోయింది. ఇప్పటికే రుణాల ఊబిలో పూర్తిగా కూరుకు పోయాం.ఇక మా వల్ల కాదు అంటూ కోనసీమ రైతులు ఖరీఫ్ పంట విరామానికి ముందుకు వచ్చారు.ఇది మిగిలిన ప్రాంతాల వారికి ఆశ్చర్యం కలిగించే విషయంగా ఉండొచ్చు . ఎందుకంటే కోనసీమ అనగానే పచ్చని పొలాలు సేద్యపు నీరుకు కొరత లేకుండా కాలువలు ప్రశాంత వాతావరణం అని అనుకుంటూ వుంటారు.అది నిజమే కానీ ఈ ప్రాంత రైతులు సేద్యం చేసే విషయంలో రబీ విషయంలో అనుకూలత ఉంది.కానీ ఖరీఫ్ పంట విషయంలో రైతాంగం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలల్లో వర్షాలు ఎక్కువుగా ఉండటం వలన ఖరీఫ్ పంట అంతా ముంపుకు గురి అవుతూనే ఉంది ఆగస్ట్ నెల వచ్చేసరికి ఇక్కడి రైతులు పడే వత్తిడి అంతా ఇంతా కాదు.ఎందుకంటే వర్షాలు కారణంగా ఏర్పడిన వరద నీరు పంట భూములలో చేరి పంట పూర్తిగా నష్ట పోతు ఉంది. దీనికి కారణం మురుగు నీటి డ్రైన్ లు పూర్తిగా ఆక్రమణలు కు గురి కావడం.మరియు గుర్రపు డెక్కతో ప్లాస్టిక్ వృధాలతో డ్రైన్ లు అన్నీ పూడుకుని పోవడం. దాదాపు ఈ డ్రైన్ లు అన్నీ కూడా డస్ట్ బిన్ లా తయారు అయ్యాయి.
ఈ స్ధితిలో రైతులు గత కొంత కాలంగా తరచూ నష్టపోతూనే ఉన్నారు.సేద్యానికి సాగునీరు సక్రమంగా అందించడం ఎంత ముఖ్యమో మురుగు నీరు బయటకు పంపడం కూడా అంతే ముఖ్యం.ఇది ప్రభుత్వ బాధ్యత.ఎందుకంటే వర్షాకాలం సమయంలో మురుగు నీరు పారుదలలో సక్రమ నిర్వహణ లేకపోతే పండిన పంట అంతా ముంపు పాలవుతుంది. రిజర్వాయర్ లో నీటి నిల్వలు లేకపోతే సాగు నీరు సరిపడినంత అందించలేరు.దీనికి ఎవరూ బాద్యులు కాదు.అదే మురుగు నీరు సక్రమంగా బయటకు పంపడం అనేది అసాధ్యం అయిన విషయం కాదు.సాగు నీరు నిర్వహణ విషయమై ఏర్పాటు చేయబడ్డ ఇరిగేషన్ శాఖ దీనిని చూసుకుంటుంది. అయినప్పటికీ ప్రత్యేకించి కోనసీమలో మురుగు నీరు సమస్య ఏళ్ళ తరబడి పరిష్కరింప బడకుండా అలానే కొనసాగుతూ ఉంది.దీనికి ప్రధాన కారణం ఆక్రమణలు. పంట కాలువ మురుగు కాలువలను ఆక్రమించి కొబ్బరి తోటలు వేయడం పక్కా భవనాలు నిర్మించినప్పటికి అధికారులు మౌనంగా చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని స్ధితి. దీనితో పాటు సాగు నీటి మురుగు నీటి కాలువలు లోనికి మున్సిపాలిటీ పంచాయతీల డ్రైనేజి వ్యవస్ధను కలపడం. స్దానిక ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైనేజి వ్యవస్ధ ఏర్పాటు చేసుకోవాలి తప్ప పంట పొలాల మురుగు కాలువల లోనికి వీటిని పంపకూడదు అని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా అమలులో వాటిని ఏ స్దానిక ప్రభుత్వం కూడా ఆచరించిన దాఖలాలు కనిపించడం లేదు. దీనివలన అనేక గృహ వ్యర్ధాలు.ప్లాస్టిక్ వృధాలు ఈ పంట మురుగు కాలువలోనికి చేరి పూడిక పెరిగి పోయి రైతులకు తీరని వ్యధలను మిగులుస్తుంది.
జీ ఓ నంబర్ 188 ప్రకారం పంట మరియు మురుగు కాలువలపై ఆక్రమణలు లేకుండా చూడవలసిన బాధ్యత ఉమ్మడిగా నీటి పారుదల శాఖ మరియు రెవెన్యూ శాఖపై ఉంది.ఎప్పటి కప్పుడు ఆక్రమణలు గుర్తించి వీటిని తొలగించవలసిన బాధ్యత ఈ రెండు శాఖలది.చాలా సందర్భాల్లో న్యాయ స్ధానం ఈ జీ.ఓ ను పటిష్టంగా అమలు చేయమని ఆదేశాలు ఇచ్చినా అవి అమలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.ఆక్రమణలు లో ఉన్న వాళ్లు అధికార ప్రతి పక్షాలుకు చెందిన వర్గాలు వారు ఉండటంతో రాజకీయ వత్తిడులు నడుమ నీటి పారుదల శాఖ మరియు రెవెన్యూ శాఖ నిస్సహాయ స్ధితిలో ఉండి పోయాయి. కాలువల సక్రమ నిర్వహణకు రైతుల నుండి నీటి తీరువా వసూలు చేస్తుంది.అయితే ఈ మొత్తాన్ని తిరిగి కాలువల నిర్వహణకై ఎప్పటి కప్పుడు ఖర్చు చేస్తూ ఉండాలి.దీనినే శీఎఅ నిధి అంటారు.రెవెన్యూ వారి అధీనంలో ఉండే ఈ నిధి నుండి చేసే ఖర్చులలో ఏ మాత్రం పారదర్శకత లేదని రైతులు వాపోతున్నారు. మేము చెల్లించే సొమ్ము మా సాగు అవసరాల కోసం కూడా ఖర్చు చేయడంలో ఎందుకు ఇంతా జాగురుకత అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
సాధారణంగా కాలువల పూడిక తీత పనులు వేసవి కాలంలో చేపడతారు ఆ సమయంలో కాలువలో నీరు ఉండదు కనుక పనులు సక్రమంగా జరుగుతాయి అని ప్రభుత్వఉద్దేశ్యం.అయితే ఏవైనా చిన్నా చితక పనులు ఆరంభిస్తే మాత్రం కాలువలకు నీరు వదిలే సమయంలో మొదలు పెట్టి మమ అనిపించడం ఆనవాయితీ అయిపోయింది.బిల్లులు మంజూరు అయిపోతాయి.పనుల పరిశీలనకు అవకాశం ఉండదు.ఇది కేవలం ఉద్దేశ్య పూర్వకంగా జరిగే తంతుగా రైతులు విమర్శిస్తున్నారు.అయితే రాష్ట్ర ప్రభుత్వం ముంపు విషయం పక్కన పెట్టి రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే కాలువలు ఎప్పుడూ లేని విధంగా జూన్ 1 వ తేదీనే సాగుకు అనుకూలంగా ఏర్పాటు చేసాం అని చెబుతున్నారు.సాగు నీరు రావడం ఎంత ముఖ్యమో మురుగు నీరు పోవడం కూడా అంతే ముఖ్యం అనే విషయాన్ని మాత్రం ప్రభుత్వ పెద్దలు గుర్తించక పోవడం శోచనీయం.పైగా వ్యవసాయ అధికారులు హడావిడిగా సమావేశాలు ఏర్పాటు చేసి పంట విరామం ప్రకటించడం వలన భూమిలో లవణీకరణ చేరి భూములు చవుడు బారి పోతాయని దీని ప్రభావం భవిష్యత్ లో పంట దిగుబడిపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు కానీ సమస్య పరిష్కారం దిశగా చిత్త శుద్ధి కనపరచడం లేదు అనేది మాత్రం సుస్పష్టం.