- పదవుల కోసం పెదాలు మూసే దద్దమ్మలు టిఆర్‌ఎస్ నేతలు
- సిద్ధిపేటలో ప్రజా సంక్షేమ పాలన సదస్సులో ఈటల రాజేందర్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్ 14: టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నమ్మదగ్గ మనిషి కాదనీ బిజెపి నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఉద్యమ కేసీఆర్‌కు ఇప్పటి కేసీఆర్‌కు చాలా తేడా ఉందన్నారు. మంగళవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో మోదీ 8ఏళ్ల ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2018లో జరిగిన ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క వాగ్ధానాన్ని, హామీని నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్రంలో సిఎం కేసీఆర్‌ను ప్రజలెవరూ నమ్మే పరిస్థితులు లేవనీ, ప్రజలు కేసీఆర్‌ను నమ్మడం లేదనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ను తెచ్చుకున్నాడన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్, ప్రశాంత్‌కిషోర్ వల్ల టిఆర్‌ఎస్ పార్టీకి ఓనగూరే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. వందల కోట్ల రూపాయలు తెచ్చి తెచ్చుకున్న ప్రశాంత్‌కిషోర్ వ్యూహాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టడం ఖాయమన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా మద్యం ఏరులై పారుతుందన్నారు.
బెల్టుషాపుల వల్ల ఎన్నో కుటుంబాలు వీధినపడుతున్నాయనీ, విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్‌లో పబ్ కల్చర్ వల్ల అత్యాచారాలు శృతి మించాయన్నారు. హైదరాబాద్‌లోని విష సంస్కృతిని టిఆర్‌ఎస్(బిఆర్‌ఎస్)ద్వారా దేశంలో కూడా పెంచుతారా?అని నిలదీశారు. నేను టిఆర్‌ఎస్ పార్టీ మారలేదనీ, టిఆర్‌ఎస్ వాళ్లే వెళ్లగొట్టారన్నారు. పదవుల కోసం పెదాలు మూసే దద్దమ్మలు టిఆర్‌ఎస్ నేతలు అని…కేసీఆర్‌కు టైంకు గోళీలు ఇచ్చే వారికి రాజ్యసభ పదవీ ఇచ్చారన్నారు. సిఎం పదవీ ఎడమ కాలి చెప్పుతో సమానం అని అనడం ప్రజలను అవమానమించడమే అవుతుందన్నారు.
రానున్న రోజుల్లో టిఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు గుణ పాఠం చెప్పడం…ప్రజా సంక్షేమ ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్న మోదీ నాయకత్వంలో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు అంబటి బాలేషంగౌడ్, తొడుపునురి వెంకటేషం, ఉడుత మల్లేశం, గంగాడి మోహన్‌రెడ్డి, విద్యాసాగర్, గుండ్ల జనార్ధన్, యెల్లు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్, దూది శ్రీకాంత్‌రెడ్డిని పార్టీ నేతలు, కార్యకర్తలు పూలదండలతో ఘనంగా సత్కరించారు.