- నేషనల్ మెడికల్ కౌన్సిల్ పరిశీలన నేపథ్యంలో అన్ని విధాలుగా సిద్దంగా ఉండాలి
- ఆరోగ్య, అర్ అండ్ బీ అధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి హరీశ్ రావు..
హైదరాబాద్,ప్రజాతంత్ర,మే23: గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న 8 మెడికల్ కాలేజీల పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఎంసిహెచ్ అర్దీ లోఆరోగ్య, అర్ అండ్ బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం నుండే ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన క్రమంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ ఇన్స్పెక్షన్ నేపథ్యంలో, నిబంధనల ప్రకారం అన్ని కాలేజీలు ఉండాలన్నారు. ప్రతి రోజు ముఖ్యం, రోజు వారీగా పనులు సమీక్షించాలన్నారు. ప్రభుత్వం నుండి అన్ని రకాలుగా మద్దతు ఉంటుందన్నారు. పనులు పూర్తి అయిన తర్వాత వెనువెంటనే కావాల్సిన వైద్య పరికరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమీక్షలో ఆర్ అండ్ బి ఇఎన్సి గణపతి రెడ్డి, డీ ఎం ఇ రమేష్ రెడ్డి, ఆయా కళాశాలల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్లుtsmsidc ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
కుల వృత్తులకు ప్రోత్సాహం..
గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ((MCHRD)లోరాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరియు పథకాల అమలు పై సోమవారంరాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు పశుసంవర్ధక, మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సంయుక్తంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమంది ప్రజల అభ్యున్నతి కొరకై అమలు చేస్తున్న పథకాలైన ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై గొర్రెల యూనిట్ల పంపిణీ మరియు పాడి పశువుల పంపిణీ తదితర పథకాల పై జరిగిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ పథకాలను మరింత వేగవంతంగా అమలు చేయడానికి తగిన సూచనలు సలహాలను ఈ సమావేశంలో ఇరువురు మంత్రులు అధికారులకు తెలియజేశారు. అంతేకాకుండా పశు వైద్యశాలల ఆధునీకరణ, నూతన పశు వైద్యశాలల నిర్మాణం మరియు రావిర్యాల లో నిర్మిస్తున్న మెగా డైరీ నిర్మాణ పనుల పురోగతి పై సమీక్షించారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో ఉన్న అన్ని నీటి వనరులలో చేప పిల్లలు మరియు రొయ్య పిల్లల విడుదలపై కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా,మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, డైరీ అధికారులు పాల్గొన్నారు.