- సజీవ దహనానికి యువకుడి యత్నం
- ఎంపీవోకు గాయాలు..తప్పించుకున్న ఎస్సై, తహసీల్దార్
జగిత్యాల,ప్రజాతంత్ర, మే 10 : రహదారి విషయంలో కొంతకాలంగా జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు కలెక్టర్ రవి ఆదేశాల మేరకు వెళ్లిన అధికారులపై పెట్రోల్ స్ప్రే చేసి సజీవదహనం చేసేందుకు ఓ భూ బాధితుడు యత్నించడం జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో మంగళవారం జరిగిన ఈ సంఘటన జిల్లాలో అధికారులను కలవరపాటుకు గురిచేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలోని ఓ వీధిలో చుక్క గంగాధర్ అనే వ్యక్తి ఇంటి ముందు నుండి వెళ్లే రహదారి విషయంలో కొంత కాలంగా ఆ కాలనీ వాసులతో గొడవ పడుతున్నాడు. ఈ విషయమై ఆ వార్డులోని ప్రజలు పలుమార్లు అధికారులకు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వొస్తున్నారు. ఈ క్రమంలో పలుమార్లు అధికారులు రహదారి సమస్య పరిష్కారానికి చుక్క గంగాధర్‌కు నచ్చజెప్పేందుకు యత్నించారు. దీంతో గతంలో ఒకసారి గంగాధర్ సెల్ టవర్ ఎక్కి దూకుతానని బెదిరించాడు. అప్పుడు బ్రతిమాలి కిందకు దించారు.
మంగళవారం రహదారి సమస్య పరిష్కారానికి ఎస్సై గౌతం, తహసీల్దార్ ఫరీదుద్దీన్, ఎంపిఓ రామకృష్ణ రాజు కలిసి రహదారిలో అడ్డుగా పెట్టిన బండ రాళ్లు, కట్టెలను తొలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో చుక్క గంగాధర్ అనే యువకుడు పంటలకు పిచికారి చేసే పవర్ స్ప్రేయర్‌తో అక్కడకు చేరుకొని అధికారులపై పెట్రోల్ స్ప్రే చేస్తూ లైటర్‌తో ముట్టించాడు. దీంతో ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు చెలరేగి ముందువున్న ఎంపిఓ రామకృష్ణం రాజుకు అంటుకున్నాయి. అక్కడ ఉన్నవారు చెల్లాచెదురయ్యారు. స్థానిక ఎస్ఐ అతడి నుండి పవర్ స్ప్రేను లాక్కుందుకు యత్నించినా యువకుడు ఎస్సై పైననే పెట్రోల్ వేదజల్లడంతో పక్కకు పరిగెత్తాడు.
దీంతో సమీపంలోని ఎంపిఓ పై గంగాధర్ స్ప్రే వెదజల్లి లైటర్‌తో ముట్టించాడు. దీంతో ఎంపిఓ రామకృష్ణం రాజు చేతులకు మంటలు అంటుకుని చేతులకు గాయాలయ్యాయి. యువకుడిపై పలువురు దాడి చేసి పవర్ స్ప్రేయర్‌ను లాక్కున్నారు. గాయపడిన అధికారులను వెంటనే జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. జగిత్యాల రూరల్ రూరల్ సిఐ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను తెలుసుకున్నారు. రహదారి విషయంలో యువకుడు అధికారులను సజీవదహనం చేసేందుకు ప్రయత్నించడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లత గాయపడిన అధికారిని హాస్పిటల్లో పరామర్శించారు.