‘‘అమ్మ అనే పదం అత్యంత మధురమైనది. అమ్మ అంటే సహనానికి, బాధ్యతకు, మమకారానికి నిలువెత్తు నిదర్శనం. మాతృత్వం స్త్రీకి ఒక వరం. బిడ్డలను కని,వారిని అపురూపంగా పెంచి, పెద్దచేసే క్రమంలో స్త్రీ జీవితం దాదాపుగా కరిగిపోతుంది.’’
అమ్మకు శత సహస్రకోటి ప్రణామాలు
అమ్మ అనే పదం అత్యంత మధురమైనది. అమ్మ అంటే సహనానికి, బాధ్యతకు, మమకారానికి నిలువెత్తు నిదర్శనం. మాతృత్వం స్త్రీకి ఒక వరం. బిడ్డలను కని,వారిని అపురూపంగా పెంచి, పెద్దచేసే క్రమంలో స్త్రీ జీవితం దాదాపుగా కరిగిపోతుంది. తమ బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేసి, సృష్టికి అందం సమకూర్చిన ‘‘అమ్మ’’ ను దేవతగా పూజించాలనే నర్మగర్భిత సందేశంతో అంతర్జాతీయ మాతృదినోత్సవం జరగడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. గ్రీస్ దేశంలో రియా అనే దేవతను ‘‘మదర్ ఆఫ్ గాడ్స్ ‘‘గా పిలుస్తారు. ఆమెను పూజించే క్రమంలో గ్రీస్ దేశంలో మొట్టమొదటి సారిగా ‘‘మాతృదినోత్సవం’’ జరిగింది. తర్వాత కాలంలో జూలియావర్డ్ హోవే,మేరీ జెర్విస్ లు తల్లి ప్రాధాన్యత చాటిచెప్పేందుకు విభిన్న పద్ధతుల్లో మాతృ దినోత్సవాలను జరపడం జరిగింది. గ్రీస్ దేశంలో ప్రారంభమై, అమెరికా లాంటి దేశాలకు పాకి ,కాల క్రమంలో ప్రపంచమంతటికీ విస్తరించిన మాతృ దినోత్సవ వేడుకలు అంతర్జాతీయ శోభను సంతరించుకున్నాయి.
ప్రతీ ఏటా మే నెలలో రెండవ ఆదివారం జరిగే అంతర్జాతీయ మాతృదినోత్సవం కేవలం ప్రచారానికే పరిమితం కారాదు. విలువలు,వలువలు వదిలేసి, బాధ్యతారహితంగా ప్రవర్తించే నేటి తరం యువతకు మాతృదినోత్సవం ద్వారా నిజమైన సందేశం అందించాలి.
అమ్మంటే ఆప్యాయతకు నిజమైన అర్ధం. అమ్మంటే అవనిలో వెలసిన దైవం. అమ్మ ఒక ఆలంబన.అమ్మ సృష్టికి వరం. అమ్మ లేనిదే జగతికి నిండుదనం లేదు. బిడ్డల జీవితాలకు వెలుగు లేదు. ఎక్కడ అమ్మ పూజింపబడుతుందో, అక్కడ దైవం కొలువై ఉంటుంది.దురదృష్టవశాత్తూ నేటి ప్రపంచంలో అమ్మ స్థానం అథః పాతాళానికి దిగజారింది.తన రెక్కలు ముక్కలు చేసుకుని, బిడ్డలకు రెక్కలొచ్చే వరకు సంరక్షిస్తే, రెక్కలొచ్చాయని ఎగిరి పోతూ ముదిమి వయసులో ఉన్న పెద్దలను రోడ్లపై వదిలేయడమో, వృద్దాశ్రమాలకు తరలించి, తృణమో పణమో చెల్లించి వదిలించుకునే ప్రబుద్ధులను చూస్తున్నాం.ఉడుకు రక్తంతో,కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తే భవిష్యత్తులో వారికి కూడా అదే దుర్గతి ప్రాప్తిస్తుందని తెలుసు కోలేక పోవడం ఒక మూర్ఖత్వం. అదొక మానసిక వైపరీత్యం.
అమ్మల్లో చెడ్డవారు, మంచి వారు అనే తారతమ్యాలుండవు. ‘‘అమ్మ’’ అంటేనే మంచి,అమ్మ అంటేనే ఇలలో ఇలవేల్పు. మంచితనం కోల్పోయి బిడ్డలను అనాథలుగా వదిలేసిన వారు అమ్మ స్దానానికి అనర్హులు. పక్షపాత బుద్దులతో కుటుంబంలోని బిడ్డల పట్ల సమధర్మం పాటించకుండా ఒక వైపే మొగ్గుచూపి, మదికొందరిని నిర్దాక్షిణ్యంగా ప్రేమాప్యాయతలకు దూరంగా పెంచడంలో అమ్మదనం లేదు. కన్నవారి కంటే పెంచి పెద్ద చేసి, ప్రయోజకులుగా తీర్చిదిద్ది, సమాజంలో తమ కంటూ ఒక గుర్తింపు తీసుకు వచ్చిన వారు ఈ ప్రపంచంలో తల్లి దండ్రులు అనిపించుకోలేక పోయినా, అలా పెంచిన వారు తల్లి దండ్రులకంటే గొప్పవారు.వారే నిజమైన ఆరాధ్యులు.అలాంటి వారిని విస్మరించడం అత్యంత హేయం.
ఈ ప్రపంచంలో అమ్మ స్థానం వెలకట్టలేనిది.అమ్మ రూపంలో దైవం సర్వత్రా కొలువై ఉన్నదని అందరూ అంటారు. కనిపెంచిన దైవాన్ని అనాథలా వదిలేసి, కనిపించని దైవాల కోసం ప్రాకులాడడాన్ని దైవం మెచ్చునా? మానవ సేవే మాధవ సేవ అంటారు. మానవ సేవ మాట అటుంచి,మనల్ని పెంచి,పెద్దచేసిన వారిని విస్మరించడం అత్యంత ఘోరం. వాస్తవాన్ని మరచి,ఊహల్లో జీవించి మానవత్వం మరచి, వార్ధక్యంలో తల్లిదండ్రులను అనాథలుగా వదిలేయడం క్షంతవ్యం కాదు. తమ జీవితాలను హారతి కర్పూరం లా మార్చి, బిడ్డల జీవితాల్లో వెలుగు రేఖలు పూయించిన మానవత్వమున్న ప్రతీ మనిషి మాతృ సమానమే.
విలువలు నేర్పని విద్యల వలన సమాజంలో పెద్దలకు గౌరవం లభించడం లేదు. తల్లిదండ్రులకు విలువ లభించడం లేదు. ఇకనైనా ఈ ధోరణి మారాలి. ఎగిరి గంతులేస్తున్న పాశ్చాత్య నాగరిక పోకడలకు పరాకాష్ట ‘‘మాతృదినోత్సవం’’ అని వర్ణించక తప్పదు. ఏడాదికి ఒక సారి అమ్మను స్మరించాలనే వెర్రి నాగరికత వేళ్ళూనుకు పోయింది. వృద్ధాప్యంలో నిరంతరం కంటికి రెప్పలా చూసుకోవలసిన మాతృమూర్తికి బ్రతికుండగానే జయంతి,వర్ధంతి తరహాలో మాతృదినోత్సవాలు చేయడం మన భావ దారిద్య్రానికి నిదర్శనం. సృష్టిలో ఒక అందమైన భావన ‘‘అమ్మ’’. ఒక అద్భుతమైన వరం ‘‘అమ్మ’’. కడుపున పుట్టిన అందరినీ సమాదరించి, నిష్పాక్షపాతంతో అక్కున చేర్చుకుని, అమ్మ అనే పదానికి నిజమైన అర్ధం చేకూర్చాలి. ఒకే కడుపున పుట్టిన బిడ్డలను సైతం ఒక్కో రకంగా చూస్తూ, కొందరిపట్ల ఆప్యాయత ప్రదర్శిస్తూ, కొందరిపట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం వలన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. చిన్నప్పడు బిడ్డల మనసులో ఏర్పడిన భావాలు పెద్దయ్యాక తీవ్ర రూపం ధరించి, తల్లిదండ్రులను ఈసడించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. మన జీవితం లో అమ్మ పాత్ర కీలకం. అమ్మ లేనిదే ఎవరూ సమాజంలో మంచి స్థానం పొందలేరు. అమ్మ లాలన, పాలన, పెంపకం, ఆప్యాయతలే బిడ్డల భవిష్యత్తుకు పునాది. ఎంతో శ్రమించి, పెంచి,పెద్ద చేసి సమాజంలో బిడ్డలకు ఒక గౌరవమైన స్థానం కల్పించిన మాతృ మూర్తులందరికీ వందనం…పాదాభి వందనం.
– సుంకవల్లి సత్తిరాజు, 9704903463..
సంగాయగూడెం, దేవరపల్లి మండలం.
తూ.గో.జిల్లా( ఆం.ప్ర)