రియల్ ఎస్టేట్ క్రెడాయి ప్రాపర్టీ షోలో తెలంగాణ మంత్రి కేటియార్ పక్క రాష్ట్రం రోడ్లు, కరెంట్ అంతా అద్వానం,అస్తవ్యస్తం అనడంతో చెలరేగిన దుమారం, తిట్లవర్షం తెలంగాణ సామెతలో తొవ్వలో ఏమోచేసి తిట్లు పడ్డట్లుగానే ఉన్నది.స్వరాష్ట్రం మన పాలనలో వెలిగి పోతున్నది అనడంలో తప్పులేదు కాని పక్క రాష్ట్రంలో చీకట్లో దోమలు కొట్టుకోవాల్సి వస్తుందని అనడం అవసరమా? తెలంగాణ డ్రగ్స్ కల్చర్ మా దగ్గర లేదని ఫ్యాక్షన్ కల్చర్, గన్ కల్చర్ వాళ్ళతో అనిపించుకోవడం అవసరమా? మన రోడ్లు బాగుంటే అది నితిన్ గడ్కరీ పుణ్యమే అని వేముల ప్రశాంత్ రెడ్డి, కిషన్ రెడ్డి అంటుంటే ఆంధ్రాలో ఉన్న గుంతల రోడ్ల గురించి వెటకారం మొఖం మీద కారం పోయించుకోవడానికే కదా? అమెరికా రోడ్లకు ధీటుగా ఒక్క తెలంగాణలోనే రోడ్లు వేస్తున్నట్లు గడ్కరీ అన్నదాంట్లో అర్ధం ఏమిటి? వేల కోట్లు ఆదాయం ఉన్న హైదరాబాద్ నుండి మౌళిక వసతులను ఇంకా ఎంతో అభివృద్ది చేయవలసి ఉండగా పొంతనలేని డిజైన్లు, వృధా ఖర్చుతో లక్షల కోట్లు అప్పు చేసి మేము నెంర్ వన్ అని ప్లీనరీ మొదలు గల్లీలో మీటింగ్ దాక వల్లె వేయడు కేసియార్, కేటియార్, హరీష్ రావుకు బాగా అలవాటయింది.
ఇప్పుడు ఏదో గిల్లి తప్పయిందని ట్విట్టర్‌లో ట్వీటడడం ఎందుకు కేటియార్ గారు…! రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు బాధ్యత గానే పాలించి, రాష్ట్రాల అభివృద్దికి కృషి చేసారనే రెండు రాష్ట్రాల మెజారిటీ తెలుగు ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణలో షో పీస్ ల తీరు రెసిడెన్షయల్ స్కూళ్ల ను తెలంగాణలో అద్వాన్నం చేసిండ్రనే విద్యావేత్తల వాఖ్యలకు కేటియార్ ఏమి జవాబు చెబుతాడు? ఉస్మానియా విశ్వ విద్యాలయంలో రాహుల్ గాంధీ విద్యార్ధులతో నేరుగా మాట్లాడానికి అనుమ తించమంటే రాజకీయాలతో విద్యా సంస్థలు కలుషితమవుతాయని టిఆర్‌యస్ అనుబంధ విద్యార్ధి సంఘం ఫిర్యాదు చేయడం ఏ ఉద్యమ స్ఫూర్తో కేటియార్ చెప్పగలడా? ఆంధ్రాకు తీరని అన్యాయం కాంగ్రెస్ చేసిందని అపవాదు మోస్తున్న ఆ రాష్ట్రంలో ఒక వేళ రాహుల్ గాంధీ ఏ విశ్వవిద్యాలయం పోతామన్న ఇట్లా ఆంక్షలు ఉండక పోవు! దేశానికి ప్రత్యామ్నయ ఎజెండా అని చెప్పే కేసియార్ అస్సాంలో జిగ్నేష్ మేవానీని అరెస్టు చేసి కేసుల మీద కేసులు పెట్టిన బిజెపి తీరు కంటే దిగజారి అణచివేత కొనసాగిస్తున్నది నిజం కాదా?
నకిరేకల్ శాసన సభ్యుడి తండ్రి దశదిన కర్మకు పోయినా అక్కడి ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడం ఏ ప్రత్యామ్నయ రాజకీయ వైఖరి? ఇట్లా ముందస్తు అరెస్టులు ఇంకేదయినా రాష్ట్రంలో జరుగుతున్నాయా? ఇందులో మనమే నెంబర్ వన్నా? ప్రత్యామ్నయ ఎజెండా మాట్లాడే కేసియార్‌కు ఆయన కుమారుడు, అల్లుడికి ఎంత నిజాయితీ, నిబద్దత రాజ్యాంగ హక్కుల యెడల ఉండాలనో గుర్తు చేస్తున్నాము.తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలకు భిన్నంగా, ఇక్కడి ప్రజలను, పాలకున్ని కించపరిచినా నిర్ద్యందంగా ఖండించే నిజాయితీ తెలంగాణ ఉద్యమకారుల, తెలంగాణ ఇంటి పార్టీ స్వంతం.తెలంగాణలో విద్య, వైద్యం, వ్యవసాయం మీద అందరం సమిష్టి కృషి చేయవలసి ఉండగా, నిత్యం బిజెపి, పక్క రాష్ట్రం ప్రభుత్వం, ప్రతిపక్షాలను గెలికి, కొంత పంచాయితీలు చిలికి, పాలనలో వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే ఈ పిచ్చి వాఖ్యలు అని తెలంగాణ ఇంటి పార్టీ భావిస్తున్నది.
– డా. చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు