- సాగునీటి ప్రాజెక్టులపై చర్చిద్దాం
- రైతులకు ఎవరు ద్రోహం చేశారో ప్రజల్లోనే తేలుద్దాం
- సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ
ప్రజాతంత్ర , హైదరాబాద్ : వెనుకబడిన పాలమూరు జిల్లాలో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్న ఉద్దేశ్యంతోనే ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాకు వస్తే రైతులకు ఎవరు ద్రోహం చేశారో ప్రజా సమక్షంలోనే తేలుద్దామని సవాల్ విసిరారు. ఈమేరకు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు ప్రజా సంగ్రామ పాదయాత్ర నుంచి బహిరంగ లేఖ రాశారు. 2009లో మహబూబ్‌నగర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకుని సాగునీటి సమస్య లేకుండా చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. గడచిన 8 ఏళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని విమర్శించారు.
గత ప్రభుత్వాలు పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులను మీ ఖాతాలో వేసుకుని అంతా తామే చేశామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నదని ఎద్దేవా చేశారు. పాలమూరుజిల్లా నుంచి వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయనీ, పొట్ట చేత పట్టుకుని వేలాది మంది నిరుపేదలు దేశం నలుమూలలకు వలస పోతున్న విషయాన్ని మరచిపోయారా అని ప్రశ్నించారు. బొంబాయి వెళ్లే ఆర్టీసీ బస్సు రద్దు చేసి పాలమూరులో వలసలు ఆగిపోయాయయని నమ్మ బలికే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీకి సహాయం చేసేందుకు ఉద్దేశ్యపూర్వకంగా అపెక్స్ సమావేశాన్ని వాయిదా వేయించడం పరోక్షంగా ఏపీకి సాయం చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
ఏపీ సీఎంతో కుమ్మక్కై తద్వారా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మీరు పణంగా పెడుతున్నారనీ, ఇప్పుడు ప్రజలకు స్పష్టమైందని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి సాగునీటి ప్రాజెక్టులు విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్న మాట వాస్తవం కాదా అని ఈ సందర్భంగా బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో ప్రశ్నించారు.