సెల్ఫీ వీడియోను పోస్టు చేసి కామారెడ్డి లాడ్జిలో నిప్పటించుకున్న గంగం సంతోష్, పద్మ
స్వస్థలం రామాయంపేటలో మృతదేహాలతో నిరసన
పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవడంతో రణరంగంగా మారిన పేట
ఎస్పి హామీతో సద్దుమణిగిన ఆందోళన
ప్రజాతంత్ర, మెదక్, ఏప్రిల్ 16 : అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది. వికృత చేష్టలు, అసభ్య పదజాల దూషణలు, మానసిక వేదనలకు తల్లీకొడుకులు ఆత్మార్పణం చేసుకోవాల్సి వొచ్చింది. 18 నెలల కాలంగా వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. యువకుడిని వేధిస్తూ…దూషిస్తూ..పైశాచిక ఆనందం పొందడాన్ని పోలీసులే ప్రోత్సహించారంటూ యువకుడు ఫేస్బుక్ లైవ్ వీడియోలో తెలపడం వారి ఆగడాలకు అద్దం పట్టింది. తన చావుకు రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితెందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మాజీ సీఐ నాగార్జునగౌడ్తోపాటు మరో నలుగురు తనను వేధిస్తూ హింసిస్తున్నారంటూ వీడియోలో రోధిస్తూ యువకుడు తన మరణ వాగ్ములం చేయడం అందరిని కలిచి వేసింది.
ఈ హృదయ విషాదకర సంఘటన మెదక్ జిల్లాలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే….మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన గంగం సంతోష్ అతని తల్లి పద్మలు వైద్య చికిత్సల కోసమని కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లారు. అక్కడే ఓ ప్క్రెవేట్ లాడ్జీలో రూమ్ అద్దెకు తీసుకొని ఉన్నారు. ఈ క్రమంలో వారి మనో వేదనను, రాజకీయ నాయకుల వేధింపులు, వారికి పోలీసులు అందిస్తున్న సహకారాన్ని 4 పేజీల్లో సుదీర్ఘంగా రాసి వాటన్నంటిని శనివారం ఉదయం ఫేస్బుక్ లైవ్ వీడియో ద్వారా సమాజానికి చూపుతూ వారి మరణానికి మరణ వాగ్ములంగా తీసుకోవాలంటూ ఆడియో, వీడియోలను పోస్టు చేశారు. వెంటనే అక్కడే తల్లికొడులు నిప్పంటించుకొని ఆత్మార్పణం చేసుకున్నారు. లాడ్జీలో జరిగిన సంఘటనతో సోషల్ మీడియా, న్యూస్ ఛానళ్లలో ప్రచారం కావడంతో మెదక్, కామారెడ్డి జిల్లాలలో సంచలనం రేపింది. ఆత్మహత్యలుగా పరిగణించిన కామారెడ్డి పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి రామాయంపేటకు తరలించారు.
రణరంగంగా మారిన రామాయంపేట
తల్లికొడుల ఆత్మార్పణం అనంతరం రామాయంపేటకు వొచ్చిన వారి మృతదేహాలతో మున్సిపల్ చైర్మన్ జితెందర్‌గౌడ్ ఇంటిని వారి బంధువులు, స్నేహితులతో కలిసి ప్రజలంతా ముట్టడి చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను చైర్మన్ ఇంట్లోనే ఉంచుతామంటూ చైర్మన్ ఇంటి ఆవరణలో ఉంచారు. ఈ క్రమంలో పట్టణవాసులు, పరిసర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మృతులకు సానుభూతి చెబుతూ ఆందోళనకు దిగారు. నిందుతులందరిని వెంటనే అరెస్ట్‌చేసి శిక్షించాలంటూ చేసిన ఆందోళనలతో పట్టణమంతా రణరంగంగా మారింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ నిందితులను 24 గంటల్లో అదుపులోకి తీసుకుని శిక్షిస్తామని హామినివ్వడంతో ఆందోళన సద్దు మణిగింది. ఏడుగురిపై కేసు నమోదు
తల్లికొడుకులు పద్మ, గంగం సంతోష్ ఆత్మార్పణ సంఘటనలో నిందితులుగా పేర్కొన్న ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామాయంపేట మునిసిపల్ చైర్మన్ జితెందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, రామాయంపేట మాజీ సీఐ నాగార్జునగౌడ్, భాష్యం శ్రీను, కే.కృష్ణాగౌడ్, ఐరేని పృథ్విరాజ్, తోట కిరణ్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.