రాష్ట్రపతి ఎన్నిక బిజేపీయేతర కూటమికి నాంది అవుతుందా ?

దేశంలో అధికార మార్పిడి కోసం గత కొంతకాలంగా  బీజేపీయేతర శక్తులు చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్రపతి ఎన్నిక ఒక మలుపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో జరిగే లోకసభ ఎన్నికలకు ఇప్పటినుండే బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే  ఈ కూటమికి ఎవరు సారధ్యం వహిస్తారు, ఎవరెవరు ఈ కూటమిలో చేరుతారన్న విషయంలోనే ఇంకా స్పష్టత లేదు. అయినప్పటికీ కూటమి కట్టాలన్న సంకల్పం ఉన్న రాజకీయ పార్టీల మంతనాలు మాత్రం కొనసాగుతున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికలకన్నా ముందుగానే ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లోనే కూటమి శక్తిని బేరీజు వేసుకోవాలన్న అభిప్రాయంలో బిజెపిని బాగా వ్యతిరేకిస్తున్న పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రపతి పదవీకాలం ఈ జూలైతో పూర్తి కావస్తున్నది. వాస్తవంగా రాష్ట్రపతిని ఎంపికచేసుకునే బలం ఇప్పుడు భారతీయ జనతాపార్టీకైతే ఉంది. 776 మంది పార్లమెంటు సభ్యులు, వివిధ రాష్ట్రాల్లోని 4120 మంది శాసనసభ్యుల వోటింగ్‌ ‌ద్వారా ఈ ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది.

అయితే భారతీయ జనతాపార్టీకి ఇందులో సగానికన్నా ఎక్కువగానే బలముంది. దీంతో మరోసారి తమ పార్టీ అభ్యర్థిని ఎన్నిక చేయించుకోవడంలో ఆ పార్టీకి వొచ్చిన ఇబ్బంది ఏమాత్రం లేదు. అయినప్పటికీ బిజెపి అభ్యర్థికి పోటీ పెట్టడంద్వారా తమ బలాన్ని బేరీజు వేసుకోవాలన్న ఆలోచనలో ప్రతిపక్షాల కూటమి ఉన్నట్లుగా తెలుస్తున్నది. కేంద్రంతో ఇటీవల కాలంలో బాగా ఘర్షణ పడుతున్న తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ విషయంలో సుదీర్ఘ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. తమతో కలిసి వొచ్చే పార్టీల సహకారంతో సంయుక్తంగా  రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుందన్న విషయంలో ఇప్పటికే అంతర్ఘతంగా చర్చలు చేస్తున్నట్లు వినికిడి. ముఖ్యంగా తృణముల్‌ ‌కాంగ్రెస్‌, ‌డిఎంకె, శివసేన, సమాజ్‌వాది పార్టీ, కేరళ సిఎం పిన్నరయ్‌ ‌విజయన్‌ ‌తదితరులో ఈ విషయంలో మంతనాలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు త్వరలో ఆయా రాష్ట్రాల్లో పర్యటించవచ్చన వార్తలు వొస్తు న్నాయి.. అయితే అభ్యర్థి ఎవరన్నది ఇదిమిద్దంగా బయటికి రాకపోయినా బీహార్‌ ‌సిఎం, జెడియు అధినేత నితీశ్‌కుమార్‌ ‌పేరు మాత్రం వినిపిస్తున్నది. రాజకీయాల్లో వివాద రహితుడిగా పేరున్న నితీశ్‌కుమార్‌ ‌రాష్ట్రపతి అభ్యర్థిగా తగినవాడన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అయితే ఆయనకు బిజెపితో  సంబంధాలు
ఉండడంవల్ల ఇది ఎలా సాధ్యమన్నది కూడా లేకపోలేదు. బీహార్‌ ‌శాసనసభ ఎన్నికల్లో బిజెపికి ఎక్కువ స్థానాలు వొచ్చినప్పటికీ జెడియు చీఫ్‌ అయిన నితీశ్‌కుమార్‌నే సిఎంగా చేశారు. అలాంటప్పుడు ఆయన ప్రతిపక్ష కూటమి పక్షాన ఎలా పోటీ చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఒక వేళ తప్పనిసరే అవుతే ఆయన ముందుగా బిజెపితో తెగతెంపులు చేసుకోవాల్సి వొస్తుంది. వాస్తవానికి బిజెపికి ఆయనకు కొంత గ్యాప్‌ ఏర్పడిందని కూడా అంటున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్‌ ‌మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బిజెపి విజయం సాధించింది. ఈ ఎన్నికలు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు లిట్మస్‌ ‌టెస్ట్‌గా భావించారు. దీంతో ఇప్పుడు బిజెపికి పట్ట పగ్గాలు లేకుండా పోయాయి. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నది. ఇదే ఉత్సాహంతో తమను ఎదిరించే పార్టీలకు ఎలా చెక్‌ ‌పెట్టాలన్న విషయంలో మంచి ఎత్తుగడలు వేసే ఆలోచనలో ఉంది. ముఖ్యంగా తెలంగాణ సిఎం కెసిఆర్‌ను కట్టడిచేసే ఆలోచనలో అనూహ్య నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తున్నది. అందుకు ఈసారి  రాష్ట్ర పతి అభ్యర్థిని తెలుగువాడిని ఎంపిక చేయడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలను ఇరకాటకంలో పెట్టినట్లు అవుతుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఇందులో కూడా మరో తిరకాసుంది.

ఆ తెలుగు వ్యక్తి ఆంధ్ర  లేక తెలంగాణ నుండి ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసే ఆలోచన ఒకటి కాగా, తెలంగాణకు చెందిన సీనియర్‌ ‌బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ పేరుకూడా వినిపిస్తున్నది. ప్రస్తుతం హరియాన గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయకు వివాద రహితుడన్న పేరుంది. తెలంగాణ నుండి ఆయన్ను ఎంపిక చేస్తే కేంద్రంపై దూకుడుగా ఉన్న కెసిఆర్‌కు ఒక విధంగా చెక్‌ ‌పెట్టినట్లు అవుతుందన్న ఆలోచనలో బిజెపి కేంద్ర వర్గాలు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసిన ఈ రెండు రాష్ట్రాలనుండి వ్యతిరేకత వొచ్చే అవకాశాలు ఉండవన్న ఆలోచనలో బిజెపి వర్గాలున్నట్లు తెలుస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page