నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌కు మరో షాక్‌

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 11 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రిక అవినీతి కేసులో మరో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతకు షాక్‌ ‌తగిలింది. ఈ కేసులో భాగంగా రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖార్గేకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు పంపించింది. సోమవారం విచారణకు హాజరు కావాలని సూచించిన నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వచ్చిన ఖర్గేను అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణలో పలు అంశాలపై స్పష్టత కోసం ఆయనను పిలిచినట్లు వెల్లడించారు. మనీల్యాండరింగ్‌ ‌నిరోధక చట్టం ప్రకారం ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.  నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో దర్యాప్తులో భాగంగా రాజ్యసభలో విపక్ష కాంగ్రెస్‌ ‌నేత మల్లికార్జున ఖర్జేను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ సోమవారంనాడు ప్రశ్నించింది. విచారణలో భాగంగా కొన్ని అంశాలపై అవగాహన కోసం ప్రివెన్షన్‌ ఆఫ్‌ ‌మనీ లాండరింగ్‌ ‌యాక్ట్  ‌కింద ఖర్గే స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేయనున్నట్టు అధికారులు చెప్పారు.

గాంధీలతో ముడిపడిన నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసు ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అసోసియేటెడ్‌ ‌జర్నల్స్ ‌లిమిటెడ్‌ (ఏజేఎల్‌)‌ను యంగ్‌ ఇం‌డియన్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ (‌వైఐ) తమ అధీనంలోకి తెచ్చుకోవడం వెనుక మోసం, కుట్ర వంటి ఆరోపణలు ఉన్నాయి. 2010లో ఏజేఎల్‌ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావడంతో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇం‌డియన్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ (‌వైఐఎల్‌) ‌కంపెనీ దానిని టేకోవర్‌ ‌చేసింది. దానికి డైరెక్టర్లుగా ఉన్న సుమన్‌ ‌డుబే, టెక్నోక్రాట్‌ ‌శామ్‌ ‌పిట్రోడాలకు గాంధీ విధేయులుగా పేరుంది. ఈ కేసుపై సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో గతంలో ఫిర్యాదు చేశారు. నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రిక కాంగ్రెస్‌ ‌పార్టీకి బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకొనే హక్కును పొందేందుకు యంగ్‌ ఇం‌డియన్‌ ‌ప్రైవేటు లిమిటెడ్‌ ‌ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు.

కేవలం రూ.50 లక్షలు చెల్లించడం ద్వారా కాంగ్రెస్‌ ‌నేతలు మోసపూరితంగా వ్యవహరించడంతో పాటు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ట్రయల్‌ ‌కోర్టులో ప్రైవేట్‌ ‌క్రిమినల్‌ ‌కంప్లైట్‌ ‌దాఖలు చేశారు. ఇందులో సోనియాగాంధీ, రాహుల్‌ ‌గాంధీ సహా ఏడుగురిని పేర్లను చేర్చారు. వీరిలో ఆస్కార్‌ ‌ఫెర్నాండెజ్‌, ‌సుమన్‌ ‌దుబే, శ్యామ్‌ ‌పిట్రోడా తదితరులు ఉన్నారు. అయితే తమపై సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణలను కాంగ్రెస్‌ ‌నేతలు ఖండించారు. ఇదిలా ఉండగా.. అగస్టా వెస్ట్‌లాండ్‌ ‌చాపర్‌ ‌కుంభకోణం కేసులో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి, మాజీ కాగ్‌ ‌శశికాంత్‌ ‌శర్మకు సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నలుగురు రిటైర్డ్ అధికారులతో పాటు అంతకుముందు సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఉన్న నిందితులందరికీ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు పంపింది. వీరంతా ఏప్రిల్‌ 28‌వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

అయితే, 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ ‌కంపెనీకి అనుకూలంగా పనిచేసేందుకు అవినీతికి పాల్పడ్డారన్న వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కాగా, కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని యూపీఏ హయాంలో ఈ ఒప్పందం చేసుకోగా.. ఎన్‌డీఏ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page