- పార్లమెంటులో వాయిదా తీర్మానంపై చర్చకు టిఆర్ఎస్ పట్టు
- అనుమతించక పోవడానికి నిరసనగా ఎంపిల వాకౌట్
- గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులతో నిరసన
- తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యంపై మండిపడ్డ ఎంపి నామా
న్యూ దిల్లీ, మార్చి 25 : తెలంగాణ బిడ్డలు భారతీయులు కాదా? ఎందుకీ వివక్ష? అని కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు నిలదీశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నవోదయ విద్యాలయాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యపూరిత వైఖరికి నిరసనగా శుక్రవారం పార్లమెంటు ఉభయ సభల నుంచి టిఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చిన టిఆర్ఎస్ చర్చకు పట్టుబట్టింది. అయితే వీటిని ఉభయసభల్లోనూ తిరస్కరించారు. దీంతో వాకౌట్ చేసిన ఎంపిలు పార్లమెంట్ గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అంతకుముందు రాజ్యసభలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే. కేశవరావు, లోకసభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ఈ వాయిదా తీర్మానాలను ఉభయ సభలు తిరస్కరించాయి.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం విడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ నామా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. రాష్టాన్రికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్ వేదికగా పలుమార్లు చెప్పినప్పటికీ, కేంద్రం పెడచెవిన పెడుతుందని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, ఎస్టీ రిజర్వేషన్లు, నిరుద్యోగం, నవోదయ విద్యాలయాల ఏర్పాటు వంటి అంశాలను లేవనెత్తామని తెలిపారు. శుక్రవారం నవోదయ విద్యాలయాల అంశంపై రాజ్యసభ, లోక్ సభల్లో వాయిదా తీర్మానం ఇచ్చాము. వాయిదా తీర్మానం పై చర్చించాలి.. తెలంగాణకు అన్యాయ జరుగుతుందిని చెప్పాము. కానీ కేంద్రం పట్టించుకోలేదు.
రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఉభయ సభల నుంచి వాకౌట్ చేశామని ఎంపీ తెలిపారు. జిల్లాకొక నవోదయ విద్యాలయం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఎంపీ నామా నాగేశ్వర్ రావు గుర్తు చేశారు. ప్రస్తుతం 9 నవోదయ విద్యాలయాలు మాత్రమే ఇచ్చారు.. ఇంకా 23 ఇవ్వాల్సి ఉంది. 8 ఏండ్ల నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాము. ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.. కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. 33 జిల్లాలకు 33 నవోదయ విద్యాలయాలు ఇవ్వాల్సిందేనని ఎంపీ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా 7 ఐఐఎం లు.. 4 ఎంఐటీలు.. 16 ఐఐటీలు, 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు.. ఇందులో తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదని గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ పట్ల కేంద్రం ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలుస్తుందన్నారు. మా కంటే చిన్న రాష్టాల్రైన అసోంలో 27, గుజరాత్ లో 31, హర్యానాలో 21, హిమాచల్ ప్రదేశ్లో 17, మణిపూర్లో 11, త్రిపురలో 7 నవోదయ విద్యాలయాలు ఉన్నాయని నామా నాగేశ్వర్ రావు గుర్తు చేశారు.
ఇదిలావుంటే పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసిన ఎంపిలు గగాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లకు నవోదయ విద్యాలయాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, నేతకాని వెంకటేశ్, రాములు, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీబీ పాటిల్ పాల్గొన్నారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చినపట్టికీ చర్చకు తిరస్కరించడంతో వాకౌట్ చేశారు.