రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..దిష్టిబొమ్మల దహనం
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 25 : విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో బీజేపీ సీనియర్ నేత చింతల, సిటీ బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు ధర్నాలో పాల్గొన్నారు. కాగా బీజేపీ నేతల ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
బీజేపీ నిరసనల్లో జీడిమెట్ల ఎస్ఐ అడ్డుకున్నారు. కుత్బుల్లాపూర్ చౌరస్తాలో కరెంట్ చార్జీలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా..జీడిమెట్ల ఎస్ఐ ఆంజనేయులు వొచ్చి కాలితో దిష్టిబొమ్మను తన్నడంతో అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలపై మంటలు పడ్డాయి. దీంతో పోలీసులకు బీజేపీ నాయకులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేయడం ఏంటని ఈ సందర్భంగా బీజేపీ నేతలు ప్రశ్నించారు. ఎస్ఐ ఆంజనేయులును వెంటనే సస్పెండ్ చేయాలని కుత్బుల్లాపూర్ సిగ్నల్ వద్ద బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు.
అనంతరం ర్యాలీ చేపట్టారు. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని చేనేత విగ్రహం నుండి సెస్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు బీజేపీ కార్యకర్తలు. నల్గొండలో బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కొండేటి సరిత చేతికి గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లాలో కరెంట్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోనీ విద్యుత్ భవన్‌ను బీజేపీ నాయకులు ముట్టడించారు.