కన్నులపండువగా నాలుగో రోజు ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు
ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 24 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నాలుగో రోజు ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. మహాకుంభ సంప్రోక్షణ పర్వాల్లో భాగంగా పంచకుండాత్మక మహాయాగం నిర్వహిస్తున్నారు. పంచకుండాత్మక మహాయాగం ముగిశాక, మహాకుంభ సంప్రోక్షణ పర్వం నిర్వహించే సోమవారం నాడు కొండపైన బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు ప్రతిష్ఠామూర్తుల శోభాయాత్ర ఉంటుందని ఆలయ ఈవో గీత తెలిపారు.
కార్యక్రమాల్లో భాగంగా బాలాలయంలో శాంతి పాఠం, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనం చేశారు. ప్రధానాలయంలో పంచవింశతి కలశ స్నపనం, నిత్యలఘు పూర్ణాహుతి చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు బాలాలయంలో సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, యగశాలలో ద్వార తోరణ ధ్వజ కుంభ ఆరాధనలు, మూల మంత్ర హవనం నిర్వహించారు. ప్రధానాలయంలో చతుఃస్థానార్చన గావించి ప్రతిష్ఠామూర్తులకు జలాధి వాసం చేపట్టి నిత్య లఘు పూర్ణాహుతితో ముగించారు.