లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు వడ్డింపు
న్యూ దిల్లీ, మార్చి 23 : దేశవ్యాప్తంగా పెట్రో ధరలు వరుసగా రెండోరోజూ పెరిగాయి. ప్రజలందరూ ఊహించినట్లుగానే ఐదు రాష్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రో, గ్యాస్ ధరలు పెంచడం మొదలయింది. వరుసగా రెండో రోజు కూడా పెట్రో ధరలను వడ్డించాయి చమురు సంస్థలు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కొన్ని నెలలపాటు విరామం ఇచ్చిన చమురు కంపెనీలు.. మంగళవారం నుంచి ధరల పెంపును ప్రారంభించాయి. వరుసగా రెండో రోజు ధరల పెంపును కొనసాగిస్తూ లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు వడ్డించాయి. పెరిగిన ధరలతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.01 కాగా, డీజిల్ ధర రూ. 88.27కి పెరిగింది.
పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం లీటరుకు 80 పైసలు పెంచగా, దేశీయ వంట గ్యాస్ ఎల్‌పిజి ధరలు సిలిండర్‌కు రూ. 50 చొప్పున పెంచారు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ 110.01, డీజిల్ రూ.96.37కి చేరింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.112.08, డీజిల్ రూ.98.10, విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.111.88, డీజిల్ రూ.97.90గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోలు లీటరుకు రూ. 111.58, డీజిల్ లీటరుకు రూ. 95.74కి చేరింది. చమురు ధరలు పెరగుతుండడంతో వాహన దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ చమురు ధరలు ఈ సంవత్సరం మళ్లీ పెరగడంతో చమురు సంస్థలు మళ్లీ వడ్డింపులు ప్రారంభించాయి.