- రైతులు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి..
- ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగింది
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 22 : యాసంగి ధాన్యం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో కొత్త డ్రామా ఆడుతూ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ తెలంగా అధ్యకుడు ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. తన పాలన పట్ల ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే కేసీఆర్ ఇట్లాంటి డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ‘‘కేసీఆర్…చేతనైతే బ్రోకరిజం చెయ్..కమీషన్ తీసుకో…చేతగాకుంటే ఇంట్లో పడుకో…అంతే తప్ప రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకో… లేకుంటే రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్’’ అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, ఢిల్లీలో పార్టీ రాష్ట్ర సమన్వయకర్త నూనె బాలరాజ్, పార్టీ నేత లంకల దీపక్ రెడ్డితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. యాసంగి వడ్ల కొనుగోలు, కశ్మీర్ ఫైల్స్, మోదీ పాలనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌కు వయసు మీద పడ్డది..మతి తప్పింది..గంటల కొద్దీ ఏదేదో మాట్లాడుతున్నడు..తన పాలనపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు రోజుకో కొత్త సమస్యను సృష్టించి దాని ద్వారా జల్సా చేయడమే పనిగా పెట్టుకున్నడు..ప్రజల దృష్టి మళ్లించేందుకే వడ్ల పేరిట డ్రామాలాడుతున్నడని బండి సంజయ్ అన్నారు. సోమవారం రా రైస్ కొంటామని పీయూష్ గోయల్ స్పష్టంగా చెప్పారని, దేశంలోని అన్ని రాష్ట్రాలు బియ్యం సేకరణపై స్పందించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంత వరకు స్పందించలేదని, గతంలో ఇచ్చిన బియ్యం కూడా ఇయ్యలేదని చెప్పారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంచనా లేదని, విధివిధానాల్లేవని పీయూష్ గోయల్ గతంలోనూ పార్లమెంట్ సాక్షిగా చెప్పారని ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తు చేశారు. ఇన్నాళ్లు బాయిల్డ్ రైస్ కొనాలని డ్రామాలాడిన కేసీఆర్ ఇప్పుడు మాటమార్చి వడ్లు మాత్రమే కొనాలని మళ్లీ కొత్త డ్రామా చేస్తున్నడని ఆయన మండిపడ్డారు. గతంలో ధాన్యం మొత్తం కొనేది తామే అన్నడని, కేంద్రం గింజ కూడా కొనడం లేదన్నడని తెలిపారు. కేంద్రం వద్దకు పోయి ‘భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోము’’అని సంతకం చేస్తడని, బయటకొచ్చి కేంద్రం బాయిల్డ్ రైస్ కొనాల్సిందేనని మాటమారుస్తడని బండి సంజయ్ కెసిఆర్‌పై ఫైర్ అయ్యారు.
కేంద్రం మెడమీద కత్తిపెడితే రాసిచ్చినని అబద్దాలు చెబుతడని, బాయిల్డ్ రైస్ కొనకుంటే ఇండియా గేట్ దగ్గర వడ్లు పారబోస్తానన్నడని, అంతకుముందు మళ్లీ బాయిల్డ్ రైస్ కొనకుంటే మరి ఎందుకు ఆనాడు పోయలేదని సంజయ్ ప్రశ్నించారు. ‘ఈసారి వడ్ల కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నట్లు ప్రకటించి ఇప్పుడు కేంద్రమే వడ్లు కొనాలంటున్నవు. గతంలో వరి వేస్తే ఉరే గతి అని రైతులను బెదిరించావు నువ్వు మాత్రం ఫాంహౌజ్‌లో వరి పంట వేసి కోటీశ్వరుడైతావు.. రైతులను బికారి చేస్తావు.. రైతులు ఇబ్బంది పడుతుంటే కెసిఆర్ ఆనందంలో మునిగి తేలుతున్నవు’ అని కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ‘కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉంది కదా… కెసిఆర్ ఎందుకు సహకరించడం లేదు? వడ్లు మాత్రమే కొనాలని ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదు? కేంద్రం అనేకసార్లు మీటింగ్ పెడితే ఎందుకు చెప్పలేదు? నీ మూర్ఖత్వంవల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే జల్సా చేస్తవా? రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలెందుకు… ఇట్లనే చేస్తే రైతులు తిరగబడే రోజులు వస్తయ్ జాగ్రత్త…’ అని సంజయ్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగింది. మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలే అక్రమాలకు పాల్పడ్డరని మా దగ్గర సమాచారం ఉంది. దీనిపై కెసిఆర్ ఎందుకు సమగ్ర విచారణ జరపడం లేదు? బియ్యం అక్రమాలపై గతంలో కొన్నిచోట్ల ఫిర్యాదులు వస్తే విచారణ జరిపితే నిజమేనని తేలినా ఎందుకు కెసిఆర్ చర్యలు తీసుకోలేదు…అని సంజయ్ ప్రశ్నించారు.
‘‘తెలంగాణ ప్రజలకు నీ కుప్పిగంతులన్నీ తెలిసిపోయనయ్… నీపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్. ఇగ నీ దుకాణం బందైనట్లే… ఏదో ఒక తికమక చేసి మభ్యపెట్టాలనుకుంటున్నవ్. నీ పప్పులుడకవ్. నిన్నెవరూ నమ్మరు..’’ అని బండిసంజయ్ అన్నారు. 4 రాష్ట్రల్లో బీజేపీ గెలవడంతోనే కేసీఆర్ మైండ్ దొబ్బింది. అందుకే నిన్నటిదాకా ముందస్తు ఎన్నికలని ఊదరగొట్టి…ఇప్పుడు ముందస్తు లేదంటూ పారిపోయిండు… పైగా సర్వే రిపోర్ట్‌లో 95 సీట్లు వొస్తాయని బీరాలు పలుకుతుండు… సర్వే రిపోర్ట్‌లో 95 సీట్లు వొచ్చింది బీజేపీకి… టీఆర్‌ఎస్‌కు వొచ్చేది 5 లేకుంటే… 9 సీట్లే అని బండి సంజయ్ ఎద్దే చేశారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్… నీకు వొచ్చిన ఇబ్బందేమిటి? నీకు నచ్చే సినిమాలు కేడీ నెంబర్ వన్… మోసగాళ్లకు మోసగాడు వంటివే కదా… 370 ఆర్టికల్ వల్ల కాశ్మీర్‌లో జరిగిన నష్టమేందో తెలుసుకో… కాశ్మీర్ పండిట్లపై జరిగిన ఉచకోతపై వాస్తవ విషయాలను ప్రజలకు చూపిస్తే… జనం ఆలోచనలో పడితే… దీనిని పనికిమాలిన సినిమా అంటూ పనికిమాలిన బుద్దులు చూపిస్తవా?’’ అని మండిపడ్డారు. బోధన్ లో 35 మందిపై 307 కింద కేసు పెట్టిండ్రు. సిరిసిల్లలో 25 మంది కార్యకర్తలపై 307 కేసు పెట్టి జైల్లో వెసిండ్రు. కేసీఆర్ కు….బీజేపీని ఎదుర్కునే దమ్ము లేక పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టి అడ్డుకునే కుట్ర చేస్తున్నరు..అని బండి సంజయ్ అన్నారు.
మోదీ పాలన యూపీఏ పాలన కంటే అధ్వాన్నమంటావా….యూపీఏలో నువ్వు (కేసీఆర్) మంత్రివి కదా.. నీపై వొచ్చిన సహారా, ఈఎస్‌ఐ స్కాంలు తెల్వదా? నీ లెక్క పాలన చేయడం మోదీగారికి చేతగాదు.. యూపీఏ పాలనకు, మోదీ పాలనకు లింకు పెట్టడమంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు..మోదీ అద్బుత పాలనను చూసి విదేశాలే కీర్తిస్తున్నయ్.. పక్కనున్న పాకిస్తాన్ ఫ్రధాని సైతం మోదీ విదేశాంగ విధానం భేష్.. ఆయన పాలన చూసి నేర్చుకోవాలని పొగుడుతున్న సంగతి తెల్వదా? ఆ బుద్ధి కూడా నీకు లేదా? అని ప్రశించారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ…. మనసుంటే మార్గం ఉంటుంది. కానీ ఈ సీఎంకు మనసు లేదు. లొల్లి అంతా బ్రోకెన్ రైస్ గురించే కదా… దీంతో బ్రాన్ ఆయిల్ తయారైతది. వ్యాపారులకు రూ.300 చొప్పున మిగుల్తుతుంది. దీన్ని కట్ చేసి ఆ సొమ్ము రైతులకు అందిస్తే సమస్య పరిష్కారమైతది. కానీ సీఎంకు ఆ మనసు లేదు..కోవిడ్ టైంలో 82 మంది యువకులకు వాడుకుని వదిలేసిండు. 8 ఏండ్ల నుండి ఉద్యోగాలియ్యకుండా ఇప్పుడు మళ్లీ డ్రామాలు చేస్తుండు. కేసీఆర్ ఉద్యోగాల నోటిఫికేషన్ వేసి… భర్తీ చేసే సరికి ఆయన ఉద్యోగమే ఊడిపోతది… ఇది తెలిసి ఉద్యోగాల భర్తీ పేరుతో మళ్లా డ్రామా చేస్తుండని మండిపడ్డారు.