మొదలైన యాదాద్రి ఉద్ఘాటన క్రతువు

  • బాలాలయంలో మహాకుండాత్మక యాగం…కాళేశ్వరం జలాలతో యాదాద్రీశుడికి అభిషేకం
  • 28 వరకు ప్రత్యేక హోమాలు
  • 28న మహాకుంభ సంప్రోక్షణ…భక్తులకు దర్శనాలు

ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 21 : యాదాద్రి దివ్యక్షేత్రంలో స్వాతినక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి 108 కలశాలతో అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి బాలాలయంలో మహాపంచకుండాత్మక యాగం ప్రారంభమైంది. సోమవారం నుంచి ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. తర్వాత భక్తులకు గర్భగుడిలో స్వామివారిని దర్శించుకునే భాగ్యం లభించనుంది. అనంతరం స్వామి వారి నిత్య పూజా కైంకర్యాలు చేపట్టి, బాలాలయ ముఖ మండపంలో తూర్పు అభిముఖంగా సువర్ణ మూర్తులను అధిష్టింప జేశారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా స్వయంభువుల అనుమతి నిమిత్తం ఉదయం 9.35 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహామూర్తి, ఆలయ ఈవో గీత..ప్రధానాలయంలోకి వెళ్లారు. హాకుంభ సంప్రోక్షణలో భాగంగా స్వామి వారికి అభిషేకానికి కాళేశ్వరం గోదావరి జలాలను వినియోగించారు. కాళేశ్వరం 15వ ప్యాకేజీలో నిర్మించిన ఆప్టేక్‌ 2 ‌నుంచి గోదావరి జలాలు యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ‌గొంగిడి సునీతా మహేందర్‌ ‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి స్వాగతం పలికారు. గోదావరి శుద్ధ జలాలను రాగి చెంబుతో తీసుకువచ్చి బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

108 పారాయణ దారులు, ఆలయ అర్చక బృందంతో ఈ క్రతువు జరుగుతుంది. ఆలయ గోపురాల కలశాలన్నింటికీ సంప్రోక్షణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. సోమవారం నుంచి 28వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బాలాలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 28న సంప్రోక్షణ అనంతరం బాలాలయంలోని స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయాత్రగా ప్రధానాలయంలోకి తరలిస్తారు. అన్ని పూజలు పూర్తయిన తర్వాత భక్తులకు• దర్శనం కల్పించనున్నారు. యాదాద్రిలో స్వామివారి దర్శనం ఒకెత్తయితే అక్కడ కాలు పెట్టింది మొదలు, ఇంటికి తిరుగు పయనమయ్యేదాకా అడుగడుగునా పునర్‌నిర్మాణ. ఆలయ విస్తరణ పనుల శోభతో యాదాద్రి వైభవం మనసును కట్టిపడేసే తీరు మరో ఎత్తు. అబ్బురపరిచే కృష్ణరాతి శిల్పాలు..ఆకట్టుకునే సప్తరాజ గోపురాలు.. సింహరూప యాలీ పిల్లర్లు, 12 మంది ఆళ్వారుల విగ్రహాలు, రాత్రివేళ ఆలయాన్ని బంగారు రంగులో మెరిపించే విద్యుత్తు ధగధగలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

మొత్తానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి ఆలయం భక్తులకు దర్శనమిచ్చేందుకు ముస్తాబయింది. ఈ నేపథ్యంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ మహాక్రతువులో భాగంగా విశ్వక్సేనుడి తొలిపూజ స్వస్తి పుణ్యహ వాచన మంత్రాలతో స్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటన మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ చేశారు. బాలాలయంలో పంచకుండాత్మక యాగం కోసం యాగశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా వెదురు కర్రలతో యాగశాలను నిర్మించారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా స్వామి వారికి అభిషేకానికి కాళేశ్వరం గోదావరి జలాలను వినియోగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page