ధాన్యం సేకరణ జరిపే వరకూ కేంద్ర ప్రభుత్వాన్ని వదలం
- ఉగాది తరువాత దిల్లీలో ధర్నా, నేనూ పాల్గొంటా
- ధాన్యం సేకరణలో ఒకే దేశం-ఒకే సేకరణ విధానం ఉండాలి
- తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు సమస్యలపై పోరాటం
- ఈడీ, బోడీ కేసులకు కేసీఆర్ భయపడడు
‘ముందస్తు’ ప్రసక్తే లేదు.. - త్వరలో దేశంలో కొత్త రాజకీయ పార్టీ
బీజేపీ బలం తగ్గుతుందని గతంలోనే చెప్పా - కేంద్రం కశ్మీర్ ఫైల్స్ వదిలి ప్రజా సమస్యలు పరిష్కరించాలి
- పీకే సలహాలు తీసుకుంటే తప్పేంటి ?
- పంజాబ్ తరహాలో ధాన్యం సేకరణ జరపాలని ఏకగ్రీవ తీర్మానం
- మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్
ప్రజాతంత్ర , హైదరాబాద్ : తెలంగాణలో యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి కనీస మద్దతు ధర బియ్యానికి కాదు, ధాన్యానికి ఇవ్వాలి, కనీస మద్దతు ధర ప్రకారమే పంజాబ్‌లో ధాన్యాన్ని సేకరిస్తున్నారు. అదే విధంగా తెలంగాణలోనూ కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. యాసంగిలో వచ్చే ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే విషయంలో ఎంత వరకైనా వెళతామనీ, అప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు, రైతు సమితి జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఈసారి యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం వస్తుందనీ, 3 లక్షల ఎకరాలు విత్తనాల కోసం వాడుకుంటారని చెప్పారు. దేశంలో ఒకే దేశం ఒకే సేకరణ విధానం ఉండాలని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు సమస్యలపై పోరాడాలని పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు పిలుపునిచ్చారు. కేంద్రం తమ మాట వినకపోతే యాక్షన్ ఓరియంటెడ్‌గా తమ పోరాటం ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో గ్రామ స్థాయి నుంచి దిల్లీ వరకు ఉద్యమం సాగాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కదారి పడుతున్నదనీ, కశ్మీర్ ఫైల్స్ వదిలపెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం తనపై ఈడీ దాడులకు దిగనుందని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ కేసీఆర్ ఈడీ, బోడీ బెదిరింపులకు భయపడడు. అలాంటి వాడినైతే 15 ఏళ్లు ఉద్యమం నడిపిస్తానా అని వ్యాఖ్యానించారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందనీ, అందుకే తన ప్రయత్నాలని చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందనీ, ప్రస్తుతం జాతీయ రాజకీయాలలో శూన్యత బాగా ఉందనీ, అందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు తెలిపారు.
ప్రశాంత్ కిషోర్ తనతో కలసి పనిచేస్తే తప్పేంటనీ, త్వరలోనే దేశంలో కొత్త రాజకీయ పార్టీ వచ్చే అవకాశం ఉందన్నారు. చెప్పారు.స్పష్టం చేశారు. గత 8 ఏళ్లుగా ప్రశాంత్ కిషోర్‌తో తనకు స్నేహం ఉందన్నారు. ఎక్కువ పంట వేస్తే ప్రాసెస్ చేసి నష్టం వస్తే కేంద్రం భరించలని డిమాండ్ చేశారు. కేంద్రం మాట ప్రకారం పంట మార్పిడి కింద 25 లక్షల ఎకరాలు తగ్గిందని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు.