“దారుణమైన విషయమేమంటే, పోలీసులు సాగించే ఈ నేర ప్రవర్తనను రాజ్యం అనుమతిస్తున్నది. అందులో భాగం పంచుకుంటున్నది. దాన్ని ప్రోత్సహిస్తున్నది. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం నడుచుకోవలసిన రాజ్యం ఈ మాదిరిగా ప్రవర్తించడం అత్యంత హేయమైన విషయం. ఇదే ఇప్పుడు అన్నిటికన్న పెద్ద సమస్య.”
ఇంత బహిరంగంగా పోలీసుల అత్యాచారాల గురించి, హింసల గురించి పత్రికల్లో వస్తూ ఉంటే పోలీసుల నైతిక స్థెర్యం దెబ్బతిని పోతుంది అని పోలీసు అధికారులు వాదించడం మొదలుపెట్టారు. ఒక పోలీసు అధికారుల ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చెన్నారెడ్డి దగ్గరికి వెళ్ళి గోలచేసింది. ఇట్లా పోలీసు అధికారుల ప్రతిష్ఠ దెబ్బతిని పోతుంటే పనిచేయడం కష్టం అని వాదించింది. కనుక విచారణ వ్యవహారం బహిర్గతం కాకుండా ఆపాలని చెన్నారెడ్డి భావించాడు. ఇక నుంచి భార్గవ కమిషన్ విచారణ బహిరంగంగా, పత్రికా విలేకరుల సమక్షంలో కాకుండా రహస్యంగా జరగాలని ప్రతిపాదించాడు.
రహస్య విచారణ అంటే ఒక సమస్య ఉంది. కమిషన్ ముందుకు వచ్చే వాంగ్మూలాలు ఇచ్చే సాక్షులెవరో పోలీసులకు తెలుస్తుంది గాని ప్రజలకు తెలియదు. అందువల్ల ఆ సాక్షులను బెదిరించి, సాక్ష్యం చెప్పకుండా చేయడం పోలీసులకు సులభమవుతుంది. సాక్షులు ఎంత బహిరంగంగా కనబడితే, వాళ్ళ వాంగ్మూలాలు ఎంత పెద్ద ఎత్తున ప్రచారమయితే సాక్షులకు అంత ఎక్కువ రక్షణ దొరుకుతుంది. సాక్షులకు వచ్చే గుర్తింపే పోలీసులు వాళ్ళను ముట్టకుండా రక్షణ కవచంగా ఉంటుంది.
అందువల్ల రహస్య విచారణ జరిగితే మా సాక్షులకు రక్షణ ఉండదు అని మేం జస్టిస్ భార్గవ ముందర వాదించాం. ఒకవేళ రహస్య విచారణే జరిగితే మేం అందులో పాల్గొనబోము అని ముగ్గురం న్యాయవాదులమూ తార్కుండేతో కూడ చెప్పి జస్టిస్ భార్గవకు చెప్పాం. విచారణ నుంచి బైటికి వచ్చేశాం.
నిజానికి షా కమిషన్, భార్గవా కమిషన్ రెండూ చాలా మంచి కమిషన్లు. చాలా బాగా పనిచేశాయి. ఆ కమిషన్లు ఇచ్చే నివేదికల మీద ఆధారపడి ప్రభుత్వం మంచి పాలనా సూత్రాలను తయారు చేసే అవకాశం ఉండేది. కాని ఒక కమిషన్ సరిగా పనిచేయకుండా, మధ్యలోనే పని ఆపివేసేటట్టు ప్రభుత్వమే ప్రవర్తించింది. కేవలం పోలీసు అధికారుల కోసం ఆ పనిచేసింది. మరొక కమిషన్ నివేదిక కోర్టు ఉత్తర్వుల వల్ల పనికి రాకుండా పోయింది.
భార్గవా కమిషన్ పని చేయకుండా చేయడానికి పోలీసులు పన్నిన పన్నాగాలు ఒకటీ రెండూ కాదు. కొండయ్యను అక్రమంగా నిర్బంధించి పెట్టానని నా మీద వాళ్ళ మామ తోనే పిటిషన్ వేయించారు. నన్ను ఆ కేసులో ఆరెస్టు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. వాటిలో విజయం సాధించలేదు. కనుక అసలు విచారణనే రద్దుచేసే ప్రయత్నం చేశారు.
జస్టిస్ భార్గవా కమిషన్ విచారణలో బైట పడినదేపుంటే, ఒక మామూలు , కక్ష పూరితమైన కక్షిదారుకన్న ఎక్కువ క్రూరంగా, కక్షపూరితంగా, దుర్మార్గంగా పోలీసులు ప్రవర్తించ గలరు అని. విచారణ ఆపడానికి అన్ని రకాల కుట్రలు చేయగలరు అని. వాళ్ళు ఏదంటే అది పిటిషన్లు వేయగలరు. సాక్షులను ఎత్తుకుపోగలరు. సాక్షులు ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పకుండా అడ్డుకోగలరు. హంతక ముఠాలు ఏయే పనులు చేస్తాయని పోలీసులు ఆరోపిస్తూ ఉంటారో ఆ పనులన్నీ పోలీసులు చేయగలరు. పోలీసులే గనుక బోను ఎక్కవలసి వస్తే ఈ పనులన్నీ సాధారణ నేరస్తులకన్న పది రెట్లు ఎక్కువగా చేస్తారు.
భార్గవా కమిషన్ విచారణ ద్వారా నేను గ్రహించిన అనుభవం అది.అయితే దారుణమైన విషయమేమంటే, పోలీసులు సాగించే ఈ నేర ప్రవర్తనను రాజ్యం అనుమతిస్తున్నది. అందులో భాగం పంచుకుంటున్నది. దాన్ని ప్రోత్సహిస్తున్నది. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం నడుచుకోవలసిన రాజ్యం ఈ మాదిరిగా ప్రవర్తించడం అత్యంత హేయమైన విషయం. ఇదే ఇప్పుడు అన్నిటికన్న పెద్ద సమస్య.
పోలీసులు అర్థం చేసుకోని విషయమేమంటే, ఒక మనిషిని రోజుల తరబడి నిర్బంధించి కొట్టినప్పుడు, చిత్రహింసలు పెట్టినప్పుడు ఆ మనిషి తనను చిత్రహింసలు పెట్టినవాళ్ళను మరిచిపోలేడు. ఎప్పుడో ఒకసారి పోలీసులు ఒకరినొకరు పిలుచుకుంటారు గనుక వాళ్ళ పేర్లు కూడ గుర్తు పెట్టుకుంటాడు. బోను ఎక్కి సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు ఎవరినైనా గుర్తు పడుతున్నాడంటే, పేరు చెపుతున్నాడంటే అది కేవలం నిజం చెప్పడం కోసమే తప్ప, ఏదో కల్పించి చెప్పడం కోసం కాదు.
అట్లా నిజాలు చెపితేనే పోలీసుల మానసిక స్థయిర్యం దెబ్బతిని పోతుందంటే ఆ మానసిక స్థయిర్యం ఎంత బలహీనమయినదయి ఉండాలి! పోలీసులు అబద్ధాలు చెప్పడం, అబద్ధాల్ని నమ్మడం ఎంత అలవాటయి పోయిందంటే చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్‌లో జరిగిన ఒక లాకప్ హత్య ఉదంతం చెప్పాలి. అక్కడ ఒక వ్యక్తి లాకప్‌లో చనిపోయాడు. నేను ఒక పిటిషన్ వేయిస్తే కోర్టు ఒక కమిషనర్‌ను నియమించింది. ఆ కమిషనర్ పోలీసు స్టేషన్‌కు వెళ్ళే సమయానికి ఎస్‌ఐ లేడు. స్టేషన్‌లో సెంట్రీ మాత్రమే ఉన్నాడు. ఏం జరిగిందో చెప్పమంటే ఆ సెంట్రీ ‘ఆ వ్యక్తి మా పోలీసు స్టేషన్ ముందుకు వచ్చి రెండుసార్లు అటూ ఇటూ తిరిగినాడు. ఆ తర్వాత లోపలికొచ్చి సెల్ తలుపు తెరవమన్నాడు. నేను తెరవగానే లోపలికి వెళ్ళాడు. వెంట సైనైడ్ తెచ్చుకుని అది మింగి చనిపోయాడు’ ఆని చెప్పాడు. అటువంటి పిట్ట కథలు చెప్పాడు.ఈ దేశంలో మనుషులకు ఆత్మహత్యలు చేసుకోవడానికి పోలీస్ సేషన్లలో లాకప్పులు తప్ప వేరే స్థలాలు లేనట్టు!
భార్గవా విచారణ ఆపడానికి పోలీసులు ఎన్నెన్ని పనులు చేశారో గుర్తుకు తెచ్చుకుంటుంటే ఎంతకీ తరగడం లేదు. ఈ విచారణ వల్ల పోలీసుల మా నసిక స్థయిర్యం దెబ్బతింటుందని, ఈ ఎన్‌కౌంటర్ల మీద విచారణ జరిపే బదులు నక్సలైట్లు చేసిన హత్యల మీద విచారణ జరపాలని వందేమాతరం రామ చంద్రరావు చేత పిటిషన్ వేయించారు. ఈ విచారణ జరగగూడదు. పోలీసుల అత్యాచారాలు, హింసాకాండ బైట పడగూడదు. అంతే.
ఆదిలాబాద్ జిల్లా తపాలపూర్ భూస్వామి పీతాంబరరావును నక్సలైట్లు చంపేశారు గదా. ఆయన కొడుకు చేత జస్టిస్ భార్గవ ముందర ఒక పిటిషన్ దాఖలు చేయించారు. ఒకదశలో హైదరాబాదు చుట్టుపక్కల వరుసగా ఎన్నో బందిపోటు దొంగతనాలను పోలీసులే పనిగట్టుకుని చేయించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతల స్థితి సరిగా లేదని, పోలీసులు ఎక్కువ బలప్రయోగం చేయక తప్పదని జస్టిస్ భార్గవ నమ్మేలా చేయాలని వాళ్ళ ప్రయత్నం. ఒకరోజు విచారణలో ఈ బందిపోటు దొంగతనా ప్రస్తావన కూడ వచ్చింది. ‘‘ఈ బందిపోట్లన్నీ మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రత్యేకంగా చేయబడుతున్నాయి మిలార్డ్’’ అని స్పష్టంగా చెప్పేశాను. గిరాయిపల్లి విచారణ గురించి తలచుకుంటుంటే ఎన్నెన్ని గుర్తు చేసుకోవలసిన విషయాలున్నాయో ననిపిస్తుంది. పోలీసులు సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో లెక్కలేదు. మా సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలు తారుమారు చేయడం సరే. కమిషన్ సాక్షులను, ప్రాసిక్యూషన్ సాక్షులను కూడ మార్చడానికి ప్రయత్నించారు. కొమురయ్య సంగతి ప్రస్తావించాను గదా. ఆయన పోలీసు సాక్షి. ఆయన సాక్ష్యాన్ని తారుమారు చేయడానికి పోలీసులు చేసిన పనుల గురించి జస్టిస్ భార్గవ నియమించిన ఇనస్పెక్టరే నిండు కోర్టులో చెప్పాడు.
ఇక మా సాక్షులను బెదిరించడం మొదలయ్యాక నేను ఒకసారి గిరాయిపల్లి వెళ్ళాను. ఊళ్ళో చావడి ఉంది. నేను సిగరెట్ తాగుతూ అక్కడ కూచున్నాను. గ్రామాస్తులు అనుమానంగా చూస్తున్నారు. సాధారణంగా అంతే. వాళ్ళు నిన్ను నమ్మేదాకా మనసు విప్పి నీతో ఏమాటా చెప్పరు. నేను కూడ వాళ్ళను ప్రశ్నలు అడగకుండా మొదట మాట్లాడుతూ ఒక గుంపు పోగయ్యేదాకా చూశాను. జనార్దన్ వాళ్ళను అక్కడ ఎన్‌కౌంటర్ పేరుతో చంపకముందు నక్సలైటు దళం అక్కడ సిరిసినగండ్ల అనే గ్రామం లో దొంతుల అంతయ్య అనే వడ్డీ వ్యాపారిని చంపేశారు. ఆ వడ్డీ వ్యాపారి కర్కోటకుడని పేరు. ఆ వ్యాపారిని చంపినందుకు ప్రతిగా పోలీసులు ఈ నలుగురు యువకులను చంపేశారు. నిజానికి అంతయ్య హత్యకేసు విచారణ జరుగుతోంది. ఆ విచారణతో సంబంధం లేకుండా, ఆ హత్యతో సంబంధం ఉందని తాము అనుకున్న నలుగురిని చంపేయాలని పోలీసులు అనుకుని అది అమలు చేశారు. ఇప్పటికీ ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి.
‘మరి దొంతుల అంతయ్యను చంపినారు గదా వీళ్ళు. అంతయ్య ఎటువంటి వాడు అనేది పోనీయండి. ఆయనను వీళ్ళు చంపినారు. వాళ్ళను పోలీసులు చంపితే ఏం తప్పు?’ అని అడిగాను.ఒక చదువూ సంధ్య లేని గొల్లవాడు అక్కడ ఉన్నాడు. ఎన్నడూ బడి ముఖం కూడ చూసి ఉండడు. ఆయన ‘‘మరి కోర్టులు ఎందుకున్నయి ’’ అని ప్రశ్నించాడు.
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం