ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య
సిరిసిల్ల టౌన్, మార్చి 18(ప్రజాతంత్ర విలేఖరి) : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ వివాహిత తన ఇద్దరు కూతుళ్ళతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలో ఇద్దరు కూతుళ్ళు అబిజ్ఞ, హన్సికల మృత దేహాలు లభ్యం కాగా తల్లి రేఖ మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టడంతో రేఖ మృతదేహం లభ్యం అయింది. అయితే జరిగిన ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే… గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వర్కుటి రాజు అనే వ్యక్తికి లింగన్నపేట గ్రామానికి చెందిన రేఖతో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహమైనప్పటి నుండి భార్యా భర్తల మధ్య తగాదాలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పండుగ రోజు పసిపిల్లలు విగత జీవులుగా చెరువులో తేలియాడడం గ్రామస్తులను తీవ్రంగా కలిచివేస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న రేఖ బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అత్త, భర్త వేధింపుల వల్లనే రేఖ ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. ఆగ్రహావేశాలతో ఉన్న రేఖ బంధువులు భర్త రాజు ఇంటిలోని పర్నిచర్ని ధ్వంసం చేశారు. భర్త రాజును పోలీసులు అధుపులోకి తీసుకుని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేసన్‌కు తరలించారు. పరిస్థితి అదుపు తప్పకుండా కొత్తపల్లి గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.