21 నుంచి 28 వరకు ఉద్ఘాటన కార్యక్రమాలు
28న మహాకుంభ సంప్రోక్షణ..హాజరుకానున్న సిఎం కెసిఆర్
వివరాలు వెల్లడించిన ఆలయ ఇవో గీత
ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 18 : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారని ఆలయ ఈవో గీతారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె ఇక్కడ వి•డియాతో మాట్లాడుతూ ఈ నెల 28న ఉదయం 11 గంటల 55 నిమిషాలకు మహకుంభ సంప్రోక్షణ జరుగుతుందని ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. మార్చి 21వ తేదీ నుంచి 7 రోజుల పాటు బాలాలయంలో పంచకుండాత్మక యాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 108 పారాయణ దారులు, ఆలయ అర్చక బృందంతో ఈ క్రతువు జరుగుతుందన్నారు.
ఆలయ గోపురాల కలశాలన్నింటికీ సంప్రోక్షణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. 21 నుంచి 28 వరకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బాలాలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 28న సంప్రోక్షణ అనంతరం బాలాలయంలోని స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయాత్రగా ప్రధానాలయంలోకి తరలిస్తామన్నారు. అన్ని పూజలు పూర్తయిన తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తామని ఈవో గీతారెడ్డి తెలిపారు. ఇందుకు భారీగా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఇదిలావుంటే యాదాద్రి ఆలయ ఉద్ఘాటనకు ముందు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పథి ఆదేశించారు. ఈ నెల 21 నుంచి ఉద్ఘాటన కార్యక్రమాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గుట్ట ఈవో గీతారెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో పనుల ఏర్పాట్లపై సవి•క్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. ఈ నెల 21 నుంచి 28 వరకు నిర్వహించనున్న ఆలయ మహాకుంభ సంప్రోక్షణ, పంచకుండాత్మక యాగం, హోమాలపై చర్చించారు. ఉద్ఘాటన సమయంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున భక్తులు వొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ, వేసవి కాలం కావడంతో మంచినీటి వసతి, బసలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ప్రోటోకాల్, బందోబస్తుపై డీసీపీ నారాయణరెడ్డితో చర్చించారు. వైద్య శిబిరాలు, ఆర్టీసీ బస్సుల సౌకర్యం, నిరంతరం విద్యుత్ సరఫరా వాహనాల పార్కింగ్, తదితర సదుపాయాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఉద్ఘాటన, సంప్రోక్షణ తదితర కార్యక్రమాలను అధికారులకు గీతారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం కార్యక్రమాల నిర్వహణ షెడ్యూల్ను విడుదల చేసింది.