- స్వామివారికి ఘనంగా వసంతోత్సవం, డోలోత్సవం
- కల్యాణంకు 20 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు
భద్రాచలం, మార్చి 18 (ప్రజాతంత్ర ప్రతినిధి) : ఏప్రియల్ 10 ఆదివారం నాడు జరగనున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి వివాహ వేడుకకు సంబంధించిన పెండ్లి పనులు శుక్రవారం ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. దీంతో రామాలయంలో పెళ్లి సందడి నెలకొంది. ఉదయం స్వామివారికి ఆలయంలో డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. కల్యాణ ఉత్సవమూర్తులకు అభిషేకం, పూర్ణాహుతి చేశారు. అనంతరం రామయ్యకు కంకణ ధారణ చేశారు. శ్రీరామున్ని పెళ్లి కుమారునిగా అలంకరించారు.
బుగ్గన కస్తూరి దిద్ది స్వామిని ఊరేగింపుగా భద్రుని మండపానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి ఆరాధన చేశారు. ఊయలలో కూర్చుండబెట్టి జోలపాటలు పాడారు. అనంతరం స్వామివారికి వసంతోత్సవం జరిగింది. భక్తులు ఆనందోత్సవాలతో వసంతోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకులు డోల పౌర్ణమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
పెళ్లి కొడుకైన రామయ్య…
సిగ్గులొలక పోస్తూ సీతమ్మ ఆయన చెంత కూర్చోగా ఆ వేడుకను తిలకించిన భక్త జనం పులకించి పోయారు. తొలుత శ్రీరాముని, సీతాదేవికి విశేషస్నపనం నిర్వహించారు. హోమం, పూర్ణాహుతి జరిపించారు. అనంతరం సీతారామచంద్రులను ఊయలలో కూర్చుండబెట్టి కీర్తనలు ఆలపించారు. మూలవరులకు, లక్ష్మీతాయారమ్మ వారికి యాగరాముని, సీతారాములకల్యాణం నిర్వహించే ఉత్సవమూర్తులకు వసంతోత్సవం జరిగింది. వంజీర పసుపు ముద్దలను స్వామివారు, అమ్మవారిపై ఉంచారు. వసంతోత్సవం నిర్వహించి 108 వత్తుల హారతి నిర్వహించారు. అనంతరం నివేదన జరిగింది. వైభవంగా సాగిన కార్యక్రమాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తిలకించారు. ముందుగా దేవస్థానం అధికారులు, సిబ్బంది, భక్తులు వసంతోత్సవం అడారు.
పెళ్లికి 20 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు…
ఏప్రియల్ 10న జరిగే శ్రీ సీతారాముల పెళ్లికి 20 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్ధం చేసారు. బియ్యంలో సుగంధద్రవ్యాలు, అత్తరు, పసుపు కుంకుమలతో కలగలిపి తలంబ్రాలను సిద్ధం చేసారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో సాగింది. స్వామివారి తలంబ్రాలు భక్తులు ఎంతో పవిత్రంగా భావించి తీసుకుంటారు. అనేక మంది భక్తులు, భక్త బృందాలు స్వామివారి తలంబ్రాలు కలిపారు. కాబట్టి వాటికున్న పవిత్రత ఎక్కడా దెబ్బతినకుండా ఆలయాధికారులు కార్యచరణ రూపొందించారు. 20 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్ధం చేసారు. కాగా మణుగూరు సమితి సింగారం గ్రామంకు చెందిన కోదండరామాలయం భక్త బృదం గోటితో ఒలిసిన కోటి తలంబ్రాలు స్వామివారికి అందచేసారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా స్వామివారికి గోటి తలంబ్రాలు అందచేసారు. స్వామివారిని పెండ్లి కుమారుడుగా సిద్ధం చేసే తంతును కనులారా తిలకించేందుకు అనేక ప్రాంతాల నుండి భారీగా భక్తులు కాలి నడకన భద్రాచలం చేరుకున్నారు. మణుగూరు మండలం సమితి సింగారం నుండి భక్తులు కాలినడకన శుక్రవారంనాడు భద్రాచలం చేరుకుని గోటి తలంబ్రాలు ఆలయ అధికారులను అందచేసారు. అలాగే వివిధ ప్రాంతాల నుండి కూడ గోటి తలంబ్రాలను భక్తులు కాలినడకన తీసుకుని వొచ్చి శుక్రవారం జరిగిన తలంబ్రాలు కలిపిన కార్యక్రమంలో గొటి తలంబ్రాలను కూడ కలిపి మిశ్రమం చేసారు.