చిన్నారుల టీకాకు ప్రత్యేక ప్రణాళిక : మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా, దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పనిచేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖమంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీఎస్ పార్డ్లో 33 జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు, ఉద్యోగులతో ఏర్పాటు చేసిన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ…రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్లో మందులను ఆన్ లైన్ చేస్తామన్నారు. 100 శాతం వ్యాక్సినేషన్ దిశగా కృషి చేయాలని అధికారులను అదేశించారు.
12-14 లోపు చిన్నారులకు కోవిడ్ టీకా వేసేందుకు తల్లిదండ్రులను సైతం భాగస్వామ్యం చేయాలన్నారు. అందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వారం రోజుల్లో పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా ఒకరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులతో రివ్యూ మీటింగ్ పెడతామన్నారు. ప్రతి ఒక్కరు పనిభారంగా భావించకుండా, బాధ్యతగా ప్రజాసేవ చేయాలన్నారు. ఆరోగ్య శాఖపై సిఎం సుముఖంగా ఉన్నారన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు, ఉద్యోగులకు నగదు పురస్కారాలు ఇచ్చి గౌరవిస్తామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీలు లేకుండా భర్తీ చేసుకోవాలని ఆదేశించారు. టీబీ, మలేరియాలో పురోగతి సాధించాలన్నారు. గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీలపై దృష్టి సారించాలన్నారు. దానిపై గర్భిణీ స్త్రీకి అంగన్ వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.