తెలంగాణ కట్టుబాటుగా ఉన్న పత్రిక ‘ప్రజాతంత్ర’

  • ప్రజాతంత్ర లాంటి నినదించే గొంతు ఎప్పుడూ మూగబోదు 
  • తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి
  • ఘనంగా ‘వర్తమాన సాహిత్య సంచిక-2024’ ఆవిష్కరణ
  • ప్రజాతంత్రతో నాది ఎమోషనల్ రిలేషన్
  • ఎంతో మందికి సహజ వేదిక ప్రజాతంత్ర
  • ఆంధ్రజ్యోతి సంపాదకులు డా.కె.శ్రీనివాస్
  • తెలంగాణలో ‘ప్రజాతంత్ర’కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం
  • ఉద్యమానికి బలమైన అండగా నిలిచిన ప్రజాతంత్ర
  • ప్రజాతంత్ర వ్యవస్థాపక సంపాదకులు దేవులపల్లి అమర్
  • ఉద్యమానికి సాహిత్యం, కళలు ఎంతో పనిచేశాయి
  • కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు(అనువాదం) గ్రహీత కె.సజయ
  • తెలంగాణ అంటేనే గుర్తుకు వచ్చేది కవిత్వం 
  • ప్రజాతంత్ర సంపాదకులు దేవులపల్లి అజయ్
  • రాబోయే పదేళ్లకు తోవ్వ చూపేలా సాహిత్య సంచిక
  • భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ
  • డిజిటల్ మీడియాలో ‘ప్రజాతంత్ర’ ప్రవేశం అభినందననీయం
  • శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత
హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 08 : తెలంగాణ కట్టుబాటుగా ఉన్న పత్రిక ‘ప్రజాతంత్ర’ అని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజాతంత్ర పుట్టుక నుంచి ప్రస్థానాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని తానని తెలిపారు. నినదించే గొంతు ఎప్పుడు మూగబోదని, దీనికి 26 ఏళ్ల ప్రజాతంత్ర ప్రస్థానమే నిదర్శనం అన్నారు. వార్తమాన సాహితీ సంచిక ఆవిష్కరణ ప్రయత్నం అభినందనీయం అన్నారు. ఈ మేరకు ఆదివారం రవీంద్రభారతి మినీ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ భావజాల వ్యాప్తిలో కవులు, కళాకారులు, రచయితలు, విద్యావంతుల ప్రముఖపాత్ర, ఆ వారసత్వాన్ని రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా కొనసాగిస్తున్న వారికి అభినందనలు తెలుపుతూ, ఈ తరం వారికి… ముందుతరాలకు కూడా వారి పాత్రను తెలియజేసే ఒక ప్రయత్నంలో భాగంగా ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన ‘వర్తమాన సాహిత్య సంచిక-2024’ను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ఆవిష్కరించారు. ప్రజాతంత్ర సంపాదకులు దేవులపల్లి అజయ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి సంపాదకులు డా.కె.శ్రీనివాస్, ప్రజాతంత్ర వ్యవస్థాపక సంపాదకులు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా మాజీ సలహాదారు, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు(అనువాదం) గ్రహీత కె.సజయ, శాతవాహన యూనివర్సిటీ(కరీంనగర్) ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, సాహిత్య సంచిక సమన్వయకర్త ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ కవులు రచయితలు, సాహితీ ప్రియులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పత్రిక నడపడం ఎంతో కష్టమైన ఆనాటి రోజుల్లోనే కష్టనష్టాలకు ఓరుస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రజాతంత్ర ప్రముఖ పాత్ర పోషించిందని అన్నారు. నాటి నుంచి నేటి వరకు ఎందరో కవులు, రచయితలు, మేధావులకు ప్రజాతంత్ర ఒక వేదిక అయ్యిందని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లిన ఘనత ప్రజాతంత్ర దక్కుతుందని అన్నారు. ఇలాంటి సాహితీ సంచికలు మరిన్ని ఆవిష్కరించి, ప్రజాతంత్ర దినపత్రిక మరింత విస్తృతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు డా.కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన దశ, దిశ, ప్రయాణంలో ప్రజాతంత్ర పాత్ర గొప్పదని అన్నారు. తెలుగు సాహిత్యంలో తమను తాము వ్యక్తం చేసుకోవాలని అనుకునే ఎంతోమంది కవులు, రచయితలకు, ప్రజాతంత్ర సహజమైన వేదిక అయ్యిందని తెలిపారు.  తాను రచించిన ‘కొత్త వంతెన సంచిక’కు ప్రజాతంత్ర అవకాశం కల్పించిందన్నారు. ప్రజాతంత్రతో తనకు ఎమోషనల్ రిలేషన్ ఉందన్నారు. ఇకముందు కూడా సాహిత్య సంచికలు తెచ్చే ప్రయత్నం చేయాలని ఆకాంక్షించారు. ప్రజాతంత్ర వ్యవస్థాపక సంపాదకులు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా మాజీ సలహాదారు, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సాగిన కాలంలో ఉద్యమానికి బలమైన అండగా ప్రజాతంత్ర నిలబడిందని అన్నారు. ప్రజాతంత్ర స్ఫూర్తితోనే తెలంగాణ నినాదాన్ని దిల్లీ కి తీసుకువెళ్లాలని డేట్ లైన్ హైదరాబాద్ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ సీఎం కెసిఆర్ కూడా గుర్తు చేశాడని పేర్కొన్నారు.
జర్నలిస్టులకు సహజంగా రాజకీయ నాయకులతో స్నేహం ఉంటుందని, కానీ దాన్ని అడ్డం పెట్టుకొని వారి అవినీతి నాయకుల బండారం బయట పెట్టకుండా జర్నలిస్టులు ఉండరని తెలిపారు. తెలంగాణలో ప్రజాతంత్రకు ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. 1998 తర్వాత ప్రధాన మీడియాల్లోంచి బయటకు వచ్చిన అనేకమంది నిరుద్యోగులకు ప్రజాతంత్ర వేదిక అయ్యిందన్నారు. గతంలో తీసుకువచ్చిన సాహితీ సంచికల్లో తమ రచనలు ప్రచురించలేదని వివాదాలు జరిగాయని, తమకు వ్యతిరేకంగా పాంప్లెట్లు కూడా పంచారని అన్నారు. ఆ తర్వాత ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి రచయితలకు సర్దిచెప్పాల్సి వచ్చిందన్నారు. కొన్ని కారణాల వల్ల 2004 ప్రజాతంత్ర నుంచి బయటకు రావాల్సి వచ్చిందని, ఆ తర్వాత తన అవసరం ప్రజాతంత్రకు రాలేదని అన్నారు. ఇకముందు కూడా మరిన్ని సాహిత్య సంచికలు ప్రజాతంత్ర నుంచి రావాలని అన్నారు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు(అనువాదం) గ్రహీత కె.సజయ మాట్లాడుతూ సాహిత్యం, కళలు తెలంగాణ ఉద్యమానికి ఎంతో పనిచేశాయని అన్నారు. తన రచనలు ప్రచురించేందుకు ప్రజాతంత్రలో తనకు సంపూర్ణ స్వేచ్చ ఉందన్నారు. తెలంగాణ ప్రాంతంలో సజీవమైన వ్యవసాయం ఉండేదన్నారు. నేడు రైతుల ఆత్మ హత్యలతో కుటుంబాలు అనాధలుగా మారుతున్నాయన్నారు. రైతుల ఆత్మహత్యలు లేని తెలంగాణగా మారాలని అన్నారు. డయాబేటిక్ హబ్ గా తెలంగాణ మారుతుందన్నారు. చిరుధాన్యాల తట్టగా తెలంగాణ మారాలని అన్నారు. తెలంగాణకు ప్రాణధారం అయిన వైవిధ్య పంటలు అంతరించి పోతున్నాయని వీటిని కాపాడుకోవడానికి సాహిత్యం విరివిగా రావాలన్నారు.
రాష్ట్రంలో హాస్పిటల్స్ అవసరం లేని వ్యవస్థ రావాలని అన్నారు. సాహితీ సంచిక తీసుకురావడం అభినందనీయం అన్నారు. ప్రజాతంత్ర సంపాదకులు దేవులపల్లి అజయ్ మాట్లాడుతూ తెలంగాణ అంటేనే గుర్తుకు వచ్చేది కవిత్వం అని, గతంలో ప్రజాతంత్రకు వనరులు లేని సమయంలోనే రెండు సాహితీ సంచికలు తీసుకువచ్చామని తెలిపారు. 1969 ఉద్యమ కాలంలో ఎలాంటి ఎలాంటి ప్రచార మాధ్యమాలు లేని రోజుల్లో కూడా తెలంగాణ ఏనాడూ ఓడిపోలేదన్నారు. పార గుర్తు మీద 10 మంది ఎమ్మెల్యేలు గెలిచిన చరిత్రను గుర్తు చేశారు. ఎవరు తెలంగాణ జెండా ఎత్తినా తెలంగాణ సమాజం వారికి అండగా నిలిచిందాన్నారు. ఓడింది పాలకులు, పార్టీల నాయకులని అన్నారు. తెలంగాణ ఏనాడూ ఓడిపోలేదన్నారు. తెలంగాణ పేరుతో ఏర్పాడిన పార్టీలు సమైక్యవాద పార్టీలతో కలవడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేదని అన్నారు. 2014లో పొత్తులు లేని తెలంగాణ పార్టీని గెలిపించారని అన్నారు. జేఏసీ అంటేనే ప్రొ.కోదండరాం అని, కోదండరాం లేనిదే జేఏసీ లేదని ఐనప్పటికి 2018లో సమైక్య వాద పార్టీలకు మద్దతు ఇచ్చిన టీజేఎస్ పార్టీని తెలంగాణ సమాజం ఆదరించలేదన్నారు. 2023లో తెలంగాణ పదాన్ని తీసేసిన ఉద్యమ పార్టీని ప్రజలు తిరస్కరించారాని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ అవతరణే ప్రామాణికంగా విశేష సంచిక ఆవిష్కరించడం అభినదనీయం అన్నారు. రాబోయే పదేళ్ల కాలానికి తోవ్వ చూపించే విధంగా ఈ సంచిక ఉందన్నారు. మానవీయ విలువలు, చైతన్య స్ఫూర్తికి నిదర్శనం అన్నారు. శాతవాహన యూనివర్సిటీ(కరీంనగర్) ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత మాట్లాడుతూ అన్ని సామాజిక అంశాలు, సమస్యల పరిష్కారానికి ప్రజాతంత్ర కృషి ఎనలేనిదని అన్నారు. డిజిటల్ మీడియాలో ప్రజాతంత్ర ప్రవేశించడం అభినందననీయం అన్నారు. సాహిత్య సంచిక సమన్వయకర్త ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ తో పాటు సాహితీ సంచికకు సహకారం అందించిన కవులు రచయితలు, సాహితీ ప్రియులు కాసుల ప్రతాప్ రెడ్డి, డి.శ్రీనివాస్, ఏలేశ్వరం వెంకటేష్, రూప్ కుమార్, కొల్లు వెంకటేశ్వర్ రెడ్డి, అయోధ్య రెడ్డి, దాసరి మోహన్, హనీఫ్, గోపగోని రవీందర్, బెల్లంకొండ సంపత్, నాసిమ్ ఖాన్, సిద్దార్థ, సీహెచ్.ఉషారాణి, హరగోపాల్, బండారి విజయ, ఎం.దేవేంద్ర, మధుకర్, సిద్దెంకి యాదగిరి, ఎన్.అరుణ, పుట్ట గిరిధర్, వి.మురళికృష్ణ, కె.కుమార స్వామి, గజ్జెల రామకృష్ణలను ఘనంగా సన్మానించి సాహితీ సంచిక, జ్ఞాపికలు అందజేశారు.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page