నిమ్మకు నీరెత్తినట్లుగా పార్టీ నాయకత్వం
లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శ
న్యూ దిల్లీ, సెప్టెంబర్ 12 : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నా ఆ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని లోక్‌సభ పక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో ట్రైనీ ఆర్మీ మహిళపై జరిగిన అత్యాచార ఘటనను ఉద్దేశిస్తూ ఆయన ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో…ట్రైనీ ఆర్మీ అధికారులపై దాడి, వారి స్నేహితురాలిపై అత్యాచారం సమాజాన్ని సిగ్గుపడేలా చేసిందని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో శాంతిభద్రలు కరవయ్యాయని విమర్శించారు.
మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న నేరాల పట్ల బీజేపీ ప్రదర్శిస్తున్న ప్రతికూల వైఖరి ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. అధికార యంత్రాంగం వైఫల్యం వల్లే నేరస్థులు ఇలాంటి పనులకు పూనుకుంటున్నారని, ఈ నేరాలు అమ్మాయిల స్వేచ్ఛ, ఆకాంక్షలకు అడ్డంకిగా మారతాయని అన్నారు. దేశ జనాభాలో సగ భాగమైన ఆడపిల్లలపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నా..ఇంకా ఎంతకాలం కళ్లు మూసుకుని ఉంటారని రాహుల్ ప్రశ్నించారు.