చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మొగిలి ఘాట్ దగ్గర బస్సు లారీలను ఢీ .. 8 మంది మృతి

చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ దగ్గర ఓ బస్సు లారీలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మంది వరకూ చనిపోయినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో 30 మంది వరకు గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్స్ కు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బస్సు పలమనేరు నుంచి చిత్తూరు వైపునకు వెళ్తుండగా మొగిలి ఘాట్ వద్ద అదుపుతప్పింది.దీంతో ఐరన్ లోడ్‌తో వొస్తున్న లారీని ఢీకొట్టింది. ఆ తర్వాత రెండు వాహనాలు మరో టెంపోపైకి దూసుకెళ్లటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అయితే స్పాట్‌లో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలుస్తోంది.

 

లారీలో ఇనుప చువ్వలు ఉండటంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది.స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆ దారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ క్లియర్ చేశారు. గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

 

మృతుల కుటుంబాల రోదనలతో హాస్పిటల్ వద్ద విషాదకర వాతావరణం ఏర్పడింది. రోడ్డు ప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page