ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయటంలో.. ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ సిటీలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న క్రమంలో క్రమబద్దీకరణ చేసి వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు..వాహనాలు సాఫీగా సాగేందుకు..రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తున్నది. హైదరాబాద్ సిటీలో ఫుత్ పాత్ల అభివృద్ధి, క్లీనింగ్, పరిశుభ్రత, ట్రాఫిక్ అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎం కొన్ని సూచనలు చేస్తూ… హోమ్ గార్డస్ తరహాలో వారికి ఉపాధి అవకాశాలను కల్పించే అంశంపై పరిశీలన చేయాలని కోరారు. ట్రాఫిక్ వాలంటీర్లుగా సేవలు అందించేందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్ జెండర్ల వివరాలు సేకరించాలని..వారి అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆర్ అండ్ బీ టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దన్నారు సీఎం. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారాయన. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తిస్థాయి రిపోర్ట్ 15రోజుల్లోగా అందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తప్పుడు రిపోర్ట్లు ఇస్తే అధికారులపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.