కాంగ్రెస్ పెద్దలపై మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) గురించి నిరాధారమైన ఆరోపణలను బీజేపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారు. ఈ స్కాంపై రాజకీయ చలిమంటలు కాచుకుంటున్న బీజేపీకి కొరోనాలో మందుల కొనుగోళ్ల భాగోతం బహిర్గతం చేసిన వెంటనే దిక్కుతోచక అయోమ యంలో కొట్టమిట్టాడుతున్నారు. ఈ రెండు స్కాంలతో కర్నాటక రాష్ట్రం అట్టుడుకుతోంది. రాజకీయపార్టీలు అవినీతిలో కూరుకుని పోయి మాటలతో యుద్దాలు చేసుకుంటూ రోడ్డునపడుతున్నారు. వీరిని ప్రశ్నించే వ్యవస్థలు లేవు. శిక్షించే చట్టాలు ఉన్నా, అవి పనిచేయడం లేదు. బీజేపీ ప్రభుత్వం కొరోనా పాల్పడిన అవినీతిపై నివేదికను వొచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కోవిడ్ కొరోనా సమయంలో జాతీయ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దేశ ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంగా మారింది. పాలక, రాజకీయ వర్గం, అధికార గణాల చేతుల్లో అవినీతి విశృంఖలంగా విస్తరించింది. ఇటీవల కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న అవినీతి జాడ్యాన్ని చూస్తే ఒళ్లు గగుర్పాటుకు లోనవుతుంది. సిగ్గుతో తలవంచుకోవాలి. అవినీతిని సహించమంటూ భారీ ప్రకటనలు చేస్తారు. గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తారు. కాని ఆరోగ్య శాఖ మొదలుకుని అన్ని విభాగాల్లో లూటీలకు పాల్పడుతున్నారు. బీజేపీ హయాంలో కొరోనా సమయంలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదని మైఖేల్ డీ చున్హా కమిటీ దిగ్భ్రాంతికరమైన అంశాలను వెల్లడించింది. కొనుగోళ్లలో అవకతవకలు, దుర్వినియోగం, తప్పుడు విధానాలతో కోట్లాది రూపాయలను రాజకీయ నేతలు, బ్యూరోక్రసీ, దలారులు కొల్ల గొట్టారు. ఈ నివేదిక సంచలనం కలిగిస్తోంది. మరీ ఇలా బరితెగించి ఇంత నీచానికి పాల్పడుతారని ఎవరూ ఊహించి ఉండరు. అనేక వందల ఫైళ్లు మాయమయ్యాయి. గొలుసు పద్దతిలో కమీషన్లు పైనుంచి కింది దాకా అందరికీ ముట్టాయి. కొరోనా కాలంలో ప్రజారోగ్యానికి ఖర్చుపెట్టాల్సిన నిధులు పైరవీకారులు, అవినీతి రాజకీయనేతలు, అధికార వర్గం జేబుల్లోకి చేరింది. ఈ నివేదికలో వెలుగు చూసిన అనేక దిగ్భాంతికరమైన అంశాలు నిజంగా ముక్కుమీద వేలువేసుకోవాల్సిందే. రాజకీయ వ్యవస్థ ఇంత దిగజారి పతనమైందనిపిస్తుంది. వీరికి ప్రజలంటే, ప్రజారోగ్యమంటే కించిత్తు కూడా జాలి, దయ , బాధ్యత లేదా?. రాజ్యాంగ విధులను తుంగలోతొక్కి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.
కొరోనా కాలంలో దాదాపు 13వేల కోట్ల రూపాయలను కర్నాటక రాష్ట్రం ఖర్చుపెట్టింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను అన్ని వ్యవస్థలు కుమ్మక్కై మింగేశాయి. అవినీతిని సహించేది లేదంటూ పెద్ద ప్రకటనలు చేసిన వారందరికీ ఇందులో పాత్ర ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ నివేదికను కూలంకషంగా పరిశీలించి అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై అవినీతి ఆరోపణలను ఇష్టం వొ చ్చినట్లు చేస్తున్న బీజేపీ పెద్దలు తమ అవినీతి గురించి ప్రశ్నిస్తే భుజాలు తడుముకుంటున్నారు. కాంగ్రెస్ పెద్దలపై మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) గురించి నిరాధారమైన ఆరోపణలను బీజేపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారు. ఈ స్కాంపై రాజకీయ చలిమంటలు కాచుకుంటున్న బీజేపీకి కొరోనాలో మందుల కొనుగోళ్ల భాగోతం బహిర్గతం చేసిన వెంటనే దిక్కుతోచక అయోమ యంలో కొట్టమిట్టాడుతున్నారు. ఈ రెండు స్కాంలతో కర్నాటక రాష్ట్రం అట్టుడుకుతోంది. రాజకీయపార్టీలు అవినీతిలో కూరుకుని పోయి మాటలతోయుద్దాలు చేసుకుంటూ రోడ్డునపడుతున్నారు. వీరిని ప్రశ్నించే వ్యవస్థలు లేవు. శిక్షించే చట్టాలు ఉన్నా, అవి పనిచేయడం లేదు. బీజేపీ ప్రభుత్వం కొరోనా పాల్పడిన అవినీతిపై నివేదికను వొచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కర్నాటకలో స్కాం వర్సెన్ స్కాం అనే రీతిలో రాజకీయ పార్టీలు చెలరేగి ఆరోపణలు చేసుకుంటున్నాయి. అధికార, విపక్ష పార్టీలు కమిటీ నివేదికలను బహిర్గతం చేస్తూ నీవుదొంగంటే, నీవు దొంగ అంటూ విమర్శలకు దిగుతున్నారు. ప్రజల దృష్టిలో రాజకీయ పార్టీలు పూర్తిగా పల్చనైపోయాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాత్రం కర్నాటకలో తమ సర్కార్ గతంలో కొరోనాలో పాల్పడిన అవినీతిపై ఏమీ మాట్లాడడం లేదు. నేను స్వచ్చ శీలుడిని, అవినీతిని సహించను అనే మాటలు కోటలు దాటుతున్నాయి. ఈ తరహా డైలాగులకు కాలం చెల్లింది. అవినీతి ఆరోపణలు వొస్తే విచారణకు సిద్ధం అనకుండా, ప్రత్యర్థులపై అవినీతి ఆరోపణలు చేయడం, బురద జల్లుకోవడం ఈ రోజు రాజకీయాల్లో ఫ్యాషన్‌గా మారింది.
ఎన్నికల బాండ్లు కూడా అవినీతి స్కాంగా మారింది. ఎవరెంత చెల్లించారు. ఎలా చెల్లించారు. లబ్ధిదారులెవరు అనే దానిపై కూడా దుమారం చెలరేగింది. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఈ బాండ్ల విషయంలో ఇచ్చింది. అయినా రాజకీయ పార్టీలు ఈ అంశంపై ద్వంద్వ విధానాన్ని అవలంభిన్తూ సిగ్గు లజ్జా లేకుండా వ్యవహరిస్తున్నాయి. మన దేశంలో ప్రతిపక్ష పార్టీల నేతలు దాదాపు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక బీజేపీపై పోరాటం చేస్తే పార్టీల నేతల పరిస్థితి చెప్పనలవి కాదు. వారిని ముప్పుతిప్పులు పెట్టడంలో, బీజేపీ ముందంజలో ఉంటుంది. ఇదే బీజేపీయేతర నేతలు బీజేపీలో చేరే సరికి వారిపైన ఆరోపణలు కనుమరుగవుతాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ సంగతి చూడండి. ఆయనపై భయంకర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ పంచన చేరే సరికి ఆయన సచ్చీలుడైపోయాడు.
అవినీతి అన్ని దేశాల్లో ఉంది. ఇదేమీ భారత్‌కు మాత్రమే పరిమితమైన జాడ్యమేమీ కాదు. కాని మన దేశంలో అది ప్రమాదకరమైన జబ్బుగా, ప్రాణాంతక వ్యాధిగా పరిణమించింది. దీని వల్ల సమాజం, దేశం, అన్ని వ్యవస్థలు చచ్చుపడుతాయి. ప్రజా జీవనంకు పక్షవాతం వొచ్చినట్లుగా ఉంటుంది. దేశం, సమాజంతో పాటు అన్ని వ్యవస్థలు పతనానికి చేరువవుతున్నాయి. ఎన్నికల బాండ్ల వ్యవహారాన్ని విశ్లేషిస్తే అవినీతి ఎంత రోతగా మారిందో విదితమవుతుంది. ప్రతి రాజకీయ పార్టీ అవినీతి గురించి ఉపన్యాసం ఇస్తుంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీల గురించి అవినీతి బురద జల్లుతుంది. తనపై అదే ఆరోపణలు వొస్తే సచ్చీలురమనే ఫోజు కొడుతున్నారు. అవినీతిపై యుద్ధం ప్రకటించేదెప్పుడు. దీని భరతం పట్టే నేత పుట్టుకురావాల్సిందేనా. ప్రజా జీవితంలో అవినీతికి పాల్పడిన వారు శిక్షలు తప్పించుకుని తిరుగుతున్నారు. అధికారం ముసుగుచాటున వీరు తప్పించుకున్నారు. వీరిని సమాజంలో ధనవంతులు కాపాడుతున్నారు. ఎన్నికల బాండ్ల వల్ల రాజకీయ పార్టీలకు నిధులు సమకూరుతున్నాయి. పైగా బాండ్లు కొనుగోలు చేసే కార్పొరేట్లు సుపరిపాలనను విధ్వంనం చేస్తున్నారు. వీరు తమ ఇష్టారాజ్యంగా తమకు కావాల్సిన పనులు చేయించుకుంటున్నారు. దీని వల్ల ఆర్ధిక వనరులు ఒకే చోట కేంద్రీకృతమవుతోంది. మధ్యతరగతి వర్గం శ్రమతో కార్పోరెట్లు అవినీతి సొమ్ముతో ఇష్టానుసారం ప్రభుత్వ వ్యవస్టలను నడుపుతున్నారు.
పాలకులు, కార్పోరేట్ల మధ్య చోటుచేసుకుంటున్న అవినీతి సంబంధాలు, నిధుల స్వాహా భయంకరమైన కొత్త అవినీతి సామ్రాజ్యానికి పునాదులు పడ్డాయి. దీని వల్ల అవినీతిని సహించమనే పాలకవర్గాల మాటలను చూస్తే జనం నమ్మడం లేదు. కర్నాటకలో కొరోనాలో జరిగిన అవినీతి చూస్తే భయమేస్తుంది. ఇప్పుడు తీసుకుంటున్న అవినీతి నిరోధక చర్యలు సరిపోవు. అవినీతిని రూపుమూపుతామని జబ్బలు చరుచుకుంటున్నా, వాటిని నమ్మే స్థితిలో సమాజం లేదు. జాతీయ దర్యాప్తు ఏజన్సీలను విపక్ష పార్టీల నేతలను వేధించేందుకు, కటకటాల వెనక్కు పంపేందుకు, వారిని అప్రతిష్ట పాలు చేసేందుకు పాలక వర్గాలు ఉపయోగించుకుంటున్నాయి. అవినీతి పేరుచెప్పి అధికార, విపక్ష పార్టీలు పరస్పరం వేధించుకుంటే అవినీతి నిర్మూలన సాధ్యపడుతుందా ?