దేశమంతా ఒకే విద్యావిధానం రావాలి!

దేశాన్ని కట్టి ఉంచడానికి, సమాజాన్ని, ప్రజలను ఒకే గొడుగు కిందకు తీసుకుని రావడానికి, ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి  కేవలం విద్య మాత్రమే దోహదం చేస్తుంది.  అయితే.. విద్యారంగాన్ని పటిష్టం చేయాలన్న ఆలోచన గానీ, జాతీయ విద్యా విధానం తీసుకుని రావాలన్న సంకల్పం కానీ మచ్చుకైనా కానరావడం లేదు.  అలాగే విద్య విషయంలో ఏకాభిప్రాయసాధనకు రావడం లేదు.   విద్యారంగానికి నిధుల కేటాయింపులు పెంచి ఏకీకృత విద్యావిధానం తీసుకుని రావాలి. మనదేశంలో అనేక విద్యావిధానాలు అమలవుతున్నాయి. ఒక్కో రాష్ట్రంలో పదిరకాల విద్యావిధానాలున్నాయి. వీటన్నింటినీ సమీక్షించి, దేశవ్యాప్తంగా ఒకే తరహా విద్యా విధానం ఉండేలా చేయాల్సిన అవసరం ఉంది. కులానికో, మతానికో విద్యావిధానం కూడా సరికాదు.  నిజానికి అక్షరాస్యతలో దేశం ఇంకా వెనకబడి ఉంది. వెనకబడిన ప్రాంతాలు, గిరిజనప్రాంతాలకు విద్య అందడం లేదు.

 

ఉన్న స్కూళ్లను మూసేయడం, క్రమబద్దీకరించడం చేస్తున్నారు. మారుమూల ప్రాంత పిల్లలకు సైతం విద్యను నేర్పాలన్న లక్ష్యంతో ఏర్పాటుచేసిన స్కూళ్లను క్రమబద్దీకరణ పేరుతో మూసేయడం పాలకుల దాష్టీకానికి నిదర్శనంగా చూడాలి. ప్రైవేట్‌ రంగంలో విద్యను ప్రోత్సహించి విద్యావ్యాపారానికి పాలకులే తోడ్పడడం దారుణం. ఒకేదేశం, ఒకే పన్ను, ఒకే చట్టం అంటున్న మోదీ  నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కూడా జాతీయ విద్యావిధానం అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నా అది కూడా సాకారం కావడం లేదు. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ప్రైవేట్‌ విద్యారంగం బలపడుతోందే తప్ప ప్రభుత్వ విద్యావిధానం పట్టాలకెక్కడం లేదు. దీనికితోడు స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరతతో పాటు, సమస్యలు తిష్టవేసుకున్నాయి. వీటిని పరిశీలించి పరిష్కరించాల్సిన పాలకులు విద్యారంగాన్ని చిన్నచూపు చూస్తున్నారు. విద్యారంగంలో మనం ముందుకు పోతున్నామని నాయకులు చెప్పింది నమ్మడానికి లేదు. గిరిజన ప్రాంతంలో ఉపాధ్యాయులు లేక అనేక స్కూళ్లు మూతపడి వున్నాయి. విద్యలో తెలుగు రాష్ట్రాలు   వెనకబడి పోవడానికి సరైన దృక్పథం, చిత్తశుద్ది లేకపోవడంగా చూడాలి. ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యం కారణంగా విద్యారంగం కుదేలవుతోంది. దేశవ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొంది.

 

దేశమంతా ఒకే విద్యావిధానం రావాలి. ఇకపోతే ప్రాంతీయ భాషల్లో బోధన జరగాల్సిందే. అలాగే దేశానికి ప్రపంచానికి అసవరమైన హిందీ, ఇంగ్లీషల్లో రాటుదేలేలా చేయాలి. ఇంగ్లీషు మాధ్యమం పెట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయొద్దనే అడుగుతున్నారు. నిజానికి మాతృభాషలోనే పిల్లలు వేగంగా అర్థం చేసుకుని విషయ పరిజ్ఞానం పెంపొందించుకోగలరని పరిశోధనలు రుజువు చేశాయి. మాధ్యమం గొడవ పక్కన పెట్టి పిల్లలందరికి విద్యను చేరువ చేసే కార్యక్రమం జరగాలి. ఏ ఒక్క పిల్లవాడు బడిబయట ఉండకుండా చూడాలి. ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, వారిని గతంలోలాగా గౌరవించే సంస్కృతిని బలోపేతం చేయాలి. అప్పుడు తెలుగా, ఇంగ్లీషా అన్న తర్కం చేయవొచ్చు. మాతృభాష ద్వారానే జాతి సంస్కృతి, సాంప్రదాయాలు నిలబడతాయని అందరి అభిప్రాయం. రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, వికాసానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత పరిశోధనలు పరిగణలోకి తీసుకోవాలి.

 

భాషా శాస్త్రవేత్తలు, సంఘాలు, రాజకీయ పార్టీలతో సంప్రదించాలి, చర్చించాలి. మన దేశంలో అన్ని రాష్ట్రాలు  వారి భాషా మాధ్యమంలో విద్యను కొనసాగిస్తున్నాయి. విద్యలో దేశంలోనే కేరళ ముందున్నది. అది కూడా మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అందిస్తున్నది. కేరళ ప్రజలే ఎక్కువగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంగ్లీషు నేర్చు కోవడంలో తప్పులేదు. మాతృభాషలో బోధన చేస్తూనే ఇంగ్లీష్‌, హిందీభాషలు నేర్పితే సరిపోతుంది. ప్రాంతీయ భాషలు ఏద్కెనా విద్య అన్నది ఒక్కతీరుగానే ఉండాలి. పాఠ్యాంశాలు ఒక్కటిగా ఉండాలి. బోధనా విధానం ఒక్కటిగానే ఉండాలి. అలాగే దేశ చరిత్ర, పరిణామాలు, సమగ్రంగా భవిష్యత్‌ తరానికి తెలియచేసేలా విద్యావిధానం ఉండాలి. వీటిని గుర్తించి ఏకీకృత విద్యావిధానం కోసం కేంద్ర,రాష్ట్రాలు సమిష్టిగా కృషిచేయాలి. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఒకే తరహా విద్య అందుబాటులో ఉంటే ప్రజల్లో ఏకత సాధించగలం.

-వడ్డే మారన్న
9000345368

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page