తెలంగాణ నేలలో జవము, జీవంగా నిలిచినది భువనగిరి ప్రాంతం. బహుజనులకు అధికార బాటలు పరిచిన సర్దార్ సర్వాయి పాపన్న నుండి మొదలుకొని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వాసనలు వెదజల్లబడి రావి నారాయణరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, భువనగిరి డిక్లరేషన్ పేరుతో ప్రొఫెసర్ జయశంకర్ సార్, జైనీ మల్లయ్య గుప్తా, గద్దర్, బెల్లి లలిత, సాంబశివుడు, చెరుకు సుధాకర్, బాల క్రిష్ణా రెడ్డి లాంటి అగ్గి బరాటాలు ఈ నేలపై ధిక్కారం చూపించారు. ఎందరో నవ యువకిశోరాలు తెలంగాణ ఉద్యమం కోసం రక్త తర్పణం చేశారు. అలాంటి తెలంగాణ ఉద్యమ చరిత్రలో తక్కువ కాలంలో ఎక్కువ ప్రభావితం చేసిన వారు జిట్టా బాల క్రిష్ణా రెడ్డి. విలక్షణమైన వ్యక్తిత్వంతో భువనగిరి భూమి పుత్రుడిగా పోరు చేసి ఆ ప్రాంత ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. సీమాంధ్ర దోపిడీ పీడనల పై కసితో ఎలా కదం తొక్కాడో జిట్టాను చూస్తే తెలుస్తుంది. తెలంగాణ ప్రజల జీవితాలను మార్చడం కోసం మేధావులందరితో కలిసి కార్యాచరణ ప్రారంభించిన ఉన్నతమైన వ్యక్తితత్వం కలిగిన ఉద్యమ శిఖరం జిట్టా.
యువతకు ఆదర్శం: భువనగిరి గడ్డ పైన పోరు సలిపిన ఎంతోమంది పోరాట యోధుల వారసత్వంగా జిట్టా బాలకృష్ణారెడ్డి 1992లోనే యువజన ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోను సైతం యువతను సామాజిక సేవా కార్యక్రమాల వైపు నడిపించాడు. యువజన సంఘాలను తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయకుండా తనకున్న సంబంధాలతో విదేశాలలో సైతం ఏర్పాటు చేశాడు. యువతే ఈ దేశానికి వెన్నెముకని, యువత సరైన మార్గంలో ప్రయాణించినప్పుడే ఆ దేశ పురోభివృద్ధి సాధ్యమవుతుందని జిట్టా నొక్కి చెప్పాడు. యువకులు రాజకీయాలలోకి రావాలని మార్పు అనేది యువతతోనే సాధ్యమని యువజన సంఘాలకు నాయకత్వం వహించి నిరూపించారు. యువ నాయకుడిగా గ్రామీణ ప్రాంతాలల్లో ఉచిత ఆరోగ్య శిబిరాలు, క్రీడా పోటీలు, రక్తదాన శిబిరాలు, ప్రభుత్వ విద్యాలయాల అభ్యున్నతికై సహకారం, పేద విద్యార్థుల కు ఫౌండేషన్ ద్వారా నోట్ పుస్తకాల పంపిణి, అనేక మంది పేద విద్యార్థుల ఉన్నత విద్యకై ఆర్థిక సహకారం, వందలాది గ్రామాల ప్రజలకం సురక్షిత మంచినీటిని అందించడానికి కోట్ల రూపాయలతో వాటర్ ప్లాంట్ల ఏర్పాటు ఇలా నిరంతరం ప్రజలతో ఉంటూ, ప్రజల సాధక బాధకాల్లో పాలుపంచుకుంటూ యువతనం తట్టి లేపుతూ భువనగిరి ప్రాంతంలో గడప గడపను తట్టిన జిట్టా సామాన్య ప్రజల గుండె గూటిలో చిరస్థాయిగా నిలిచిపోతాడు.
ఉద్యమానికి ఆయువు పట్టు : నీతి నిజాయితీతో ఉద్యమ ఆకాంక్షల సాధనకై జిట్టా పోరాటం చేసారు. స్వరాష్ట్ర ఆకాంక్ష సాధన కోసం ఉప ఎన్నికలు వొచ్చినప్పుడుల్లా ఎక్కడ బాధ్యత లు తీసుకున్నా అక్కడ నిబద్దతతో పనిచేసి ఫలితాలను నిరూపించారు. తన రాజకీయ రంగ ప్రవేశమంతా తెలంగాణ నినాదంతోనే ముడిపడి ఉందనడానికి అతని ప్రయాణమే నిదర్శనం. జిట్టాకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు అంటే అమితమైన గౌరవం. తెలంగాణలో ఉన్న భిన్న సంస్కృతులను దిల్లీ కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబించాడు. విభిన్న రకాల కళావృత్తుల ప్రదర్శనలను, కళారూపాలను దిల్లీలో ప్రదర్శింపజేసి ఆంధ్ర తెలంగాణకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని జిట్టా చాటి చెప్పాడు. తన ప్రాంత వంటకాలపై, పండుగల పై తెలంగాణ జాతరనే సృష్ఠించాడు. అనేక సందర్భాలలో తెలంగాణ ఆంధ్ర ఎందుకు విడిపోవొచ్చో అందుకు గల బలమైన కారణాలను వివిధ పోరాట రూపాలలో జిట్టా ఎత్తి చూపాడు. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే పార్టీకి జిట్టా వెలకట్టలేని త్యాగం చేశారు.
ఆ మేరకు ఆ పార్టీ నుంచి కావలసిన ప్రయోజనాన్ని జట్టా పొందలేదు. ప్రతిఫలం కూడా పొందలేక పోయారు. ఉద్యమకారుల పరిస్థితి ఎందుకు ఇంత దారుణమైనది అన్నప్పుడుల్లా, మా పరిస్థితుల గురించి మేము ఏనాడు ఆలోచన చేయలేదు. ప్రజల పరిస్థితుల గురించి, ప్రజల గురించి, ప్రజల జీవితాలల్లో మార్పులు రావాలని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విస్తృతంగా పోరాటం చేసినమని అనేకమార్లు పునరుద్ఘాటించారు. స్వరాష్ట్రం లో కూడా అభివృద్ధి కుంటుపడింది, పాలకుల జీవితాలలో వొచ్చిన మార్పు ప్రజల జీవితాలలో రాలేదని, ప్రజల జీవితాలలో భిన్నమైన మార్పుకై పోరాటాలు చేసారు. ‘ఉద్యమకారుల ఆలైబలై’ ఐక్యతకు నిదర్శనం: ఉద్యమ జ్జాపకాలను నెమరువేసుకోవడానికి ఉద్యమకారులను ఐక్యం చేయడం కోసం, ఉద్యమ కారుల మధ్య సహృధ్బావ వాతావరణాన్ని సృష్ఠించడానికి జిట్టా అలైబలై కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఉద్యమంలో పనిచేసిన రైట్ నుండి లెఫ్ట్ వరకు గల ఉద్యమకారులందరిని ఒక వేదిక మీదికి తీసుకురాగలిగాడు. ఈ విషయంలో స్వయం పాలకులే అనేక అంతరాలు కలిగించినా జిట్టా వెనక్కి తగ్గలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నేను బతికున్నంత కాలం అలై బలై కార్యక్రమం పెట్టి తీరుతానని ప్రతినబూనాడు, అలైబలై రూపంలో ఉద్యమకారుల మధ్య ఐక్యతను, ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకురాగలిగారు. ఆఖరి వరకు ఆ కార్యక్రమం నిర్వహించి తీరాడు.
ప్రజా సమస్యలే ఎజెండాగా పోరాటం: భువనగిరి ప్రాంతంలో గ్రామ గ్రామాన పర్యటిస్తూ ప్రజలను ఉద్యమం వైపు నడిపించడానికి మూసి నది ప్రక్షాళన కోసం సుమారు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సమైక్య పాలకుల గుండెల్లో గుబులు పుట్టించాడు జిట్టా. ఆనాటి పోరాట ఫలితంగా అప్పటి ముఖ్యమంత్రి సుమారు 400 కోట్లు విడుదల చేశాడు. క్రిష్ణా నది జలాలో మా వాటా మాకు ఇవ్వాలనే డిమాండ్ చేయడంతో పాటు భువనగిరి నియోజకవర్గ ప్రాంత రైతులకు కృష్ణా జలాలు అందించాలని 350 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. బునాది గాని కాలువ, పిలాయిపల్లి కాలువ కోసం అనేక రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. భువనగిరి పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రజలను కదిలించి నిమ్స్ ఏర్పాటు కోసం ఆనాడు రాజశేఖరరెడ్డి పై దశలవారీగా పోరాటాలు నిర్వహించారు. నిమ్స్ ప్రారంభించే వరకు, నిమ్స్ ని ఎయిమ్స్ గా మార్చేంతవరకు జిట్టా ఎక్కడ వెనకడుగు వేయలేదు. పాడి రైతుల కోసం ప్రగతి భవన్ సైతం ముట్టడించారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యమించారు. స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే 80% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాలపై పోరు చేశారు. చిట్యాల, చౌటుప్పల్, పోచంపల్లి బీబీనగర్ తదితర ప్రాంతాలల్లో నెలకొల్పబడిన విషపూరితమైన పదార్థాలను వెదజల్లే ఫార్మా కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం తో పాటు, వాటిని నియంత్రించాలని పోరాటం చేశారు.
మిగిలిపోయిన కోరిక: జిట్టా బాల కృష్ణారెడ్డి అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించినప్పటికీ వాటిని రాజకీయంగా మలుచుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. చట్టసభలలో ప్రజా సమస్యలే ఎజెండాగా అధ్యక్షా అని నినదించాలనే జిట్టా కోరిక సజీవంగానే మిగిలిపోయింది. తన రాజకీయ జీవిత ప్రయాణంలో ఎన్నికలల్లో పోటీ చేసి అనేకమార్లు ఓటమిపాలైనప్పటికీ కచ్చితంగా చట్టసభలలో అడుగు పెడతాననే ధీమా బలంగా ఉండేది. తన ప్రతి ఎన్నికల ఓటమిని అనుభవంగా తీసుకొని ముంధుకు సాగుతూ అనేక రకాలుగా ఆర్థిక నష్టం చేకూరినప్పటికీ మొక్కవోని ధైర్యంతో గుండెను రాయిగా చేసుకుని తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం కూడా ప్రజా సమస్యలే ఎజెండాగా తన పోరాట రూపాలను కొనసాగించాడు జిట్టా. ఈ ప్రయాణంలో తను అనేక శక్తులను వ్యక్తులను తయారు చేసుకున్నాడు. చివరికి అనారోగ్యం పాలై జిట్టా నింగికెగసినాడు. జిట్టా బాలకృష్ణారెడ్డి తన ప్రజా రాజకీయ జీవిత ప్రయాణంలో ప్రజా సమస్యలే ఎజెండాగా సర్వం ఉద్యమాల కోసమే జీవితాన్ని ధారపోశాడు. జిట్టా ఇప్పుడు ఉండాల్సిన సందర్భంలో లేకపోవడం, వారి కుటుంబానికి కాకుండా సమాజానికి, యువజన ఉద్యమాలకు తీరని నష్ఠం. ప్రజల కేంద్రంగా ప్రజా ఉద్యమాలను కొనసాగించే లక్ష్యంగా పనిచేయడమే జిట్టాకి మనం ఇచ్చే ఘనమైన నివాళి.
-పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192