పాడిని హౌజ్ అరెస్ట్ చేయించి దాడి
ఆ సమయంలో ఉన్న పోలీసులను సస్పెండ్ చేయాలి
అన్నివర్గాలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి
కాళ్లు పట్టుకుని ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న వైనం
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ విమర్శ
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల పక్రియపై ఇంకెంతకాలం ప్రతిష్టభంన అంటూ ప్రభుత్వానికి కెటిఆర్ సూటి ప్రశ్న
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : రాష్ట్రంలో అసమర్థుడి జీవన యాత్రలా రేవంత్ పాలన నడుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన కేటీఆర్.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ…బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి, పోలీసులే దాడి చేయించారని ఆరోపించారు. తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్రలా రేవంత్ ప్రభుత్వం కొనసాగుతుందని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి, రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి మోసం చేశారని కేటీఆర్ అన్నారు.
ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇంటికి చేరి, కాళ్లు పట్టుకొని మరీ కండువాలు కప్పుతాడని కేటీఆర్ విమర్శించారు. పదిమంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ నుంచి పోయారు, ఇంకా వొస్తారని కాంగ్రెస్ మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు మాట్లాడుతున్నారని అన్నారు. హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్‌లో భయం మొదలైందని తెలిపారు. ఫిరాయింపులపై స్పీకర్‌ను కలిసి సుప్రీమ్ కోర్టు తీర్పులను సైతం ఉటంకిస్తూ పిర్యాదు చేశామని చెప్పారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి వి•ద డిస్క్వాలిఫై పిటిషన్ వేసింది కౌశిక్ రెడ్డి అని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున హైకోర్టు జస్టిస్‌కు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి, చావు డప్పులు కొట్టండని నాడు రేవంత్ రెడ్డి మాట్లాడారని కేటీఆర్ అన్నారు. కానీ హైకోర్టు తీర్పు వొచ్చిన రోజు అరికెపూడి గాంధీని పిఎసి చైర్మన్‌గా నియమిస్తూ ప్రకటన చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తే, పోలీసుల అండతో ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగారని మండిపడ్డారు.
ఈ రకమైన గుండాగిరి పదేళ్లలో ఎప్పుడూ లేదని తెలిపారు. ఫ్యాక్షన్ సినిమాలు తలపించేలా దాడులు చేశారని అన్నారు. రేపు జరగకూడనిది జరిగితే, ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో ఇప్పటికైనా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గ్యారెంటీలు అమలు చేయాలని అడిగితే ఇలాంటి హైడ్రామాలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. పైశాచిక ఆనందం కోసం ఇదంతా రేవంత్ చేస్తున్నాడని అన్నారు. కానీ ఇవన్నీ తిరిగి రేవంత్‌కు తిరిగి చుట్టుకుంటాయని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని స్పష్టం చేశారు. పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి, పోలీసులే దాడి చేయించారని కేటీఆర్ అన్నారు. దాడి జరిగినప్పుడు ఇక్కడ విధుల్లో విఫలమైన పోలీసులను సస్పెండ్ చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి, అర్ధరాత్రి వరకు తిప్పితే, తెలంగాణ ప్రజలు మొత్తం వారి వెంట నిలిచారని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే తెలంగాణ ప్రజల పౌరుషం చాటారని అన్నారు. శుక్రవారం తమను హౌస్ అరెస్ట్ చేసి, గాంధీకి రక్షణ కల్పించారని అన్నారు. అదే గాంధీని హౌస్ అరెస్ట్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో పదేళ్లలో శాంతి భద్రతలు అద్భుతంగా నిర్వహించామని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రజలు అందరూ తమ వారే అని స్పష్టం చేశారు. ప్రాంతీయతత్వం వి•ద దాడులు గతంలో లేవు, ఇప్పుడు ఉండవని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ ప్రజలు అండగా నిలిచారని, రేవంత్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఎందుకు చేరావని అరికెపూడి గాంధీని నిలదీశారు. దిక్కుమాలిన పిఎసి పదవి కోసం ఇలాంటి మాటలు మాట్లాడేందుకు సిగ్గు ఉండాలని విమర్శించారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల పక్రియపై ఇంకెంతకాలం ప్రతిష్టభంన : ప్రభుత్వానికి మాజీమంత్రి కెటిఆర్ సూటి ప్రశ్న
రాష్ట్రంలోఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల పక్రియకు బ్రేకులు పడటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాలతో ఏమిటీ చెలగాటమని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్ల పక్రియ కొనసాగుతుంటే.. తెలంగాణలో మాత్రం ఇంకెంత కాలం ఈ సందిగ్ధమని నిలదీశారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల పక్రియకు బ్రేకులు పడటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు.
విద్యార్థులను ఆగం చేసి..ఇంకెంత కాలం దీన్ని సాగదీస్తారని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్స్గా మార్చి, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పెద్దపీట వేసే జీవో 33 అమలు కోసం కాంగ్రెస్ సర్కారు ఎందుకింత మొండిపట్టు పడుతుందని నిలదీశారు. స్థానికతను నిర్దారించే విషయాన్ని ప్రభుత్వం ఎందుకింత వివాదాస్పదం చేస్తుందని అడిగారు. రోజురోజుకూ ఇంకా ఎందుకు న్యాయపరమైన చిక్కుల్లోకి నెడుతుందని దుయ్యబట్టారు. తమ పిల్లల్ని డాక్టర్లుగా చూడాలని కలలు కంటున్న వేలాది మంది తల్లిదండ్రుల ఆకాంక్షలను దెబ్బతీసే గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలను ప్రభుత్వం ఇకనైనా వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.