ప్రజా పాలన దినోత్సవం కాదు… తెలంగాణ ప్రజా వంచన దినోత్సవం..

తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తేనే భాగస్వాములమవుతాం
ప్రజలను హింసించిన రజకార్ల పార్టీతో అంటకాగుతారా?
జై పాకిస్తాన్, జై పాలస్తీనా అని నినదించిన ఒవైసీని పొగుడుతారా?
కాంగ్రెస్ దుర్మార్గాలకు ఇది పరాకాష్ట
కేంద్ర హోమ్ శాఖ‌ స‌హాయ‌ మంత్రి బండి సంజ‌య్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 15 : తెలంగాణ ప్ర‌జాపాల‌న దినోత్స‌వం కాదు.. తెలంగాణ ప్ర‌జా వంచ‌న దినోత్స‌వం జ‌రుపుకోవాల‌ని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ ధ్వ‌జ‌మెత్తారు. ఆపరేషన్ పోలోతో శస్త్రచికిత్స చేసి తెలంగాణకు విముక్తి కల్పించిన మహనీయుడు పటేల్ అని, పటేల్ కాంగ్రెసోడైతే… తెలంగాణ విమోచన దినోత్సవాలు ఎందుకు జరపడం లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు.  సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్వవం ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస పార్టీ ప్రజలను వంచించినందున ‘తెలంగాణ ప్రజా వంచన దినోత్సవాన్ని’ నిర్వహించుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిన రజకార్ల పార్టీ వారసులకు కాంగ్రెస్ వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. అంతకుముందు మాట్లాడిన రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ విమోచన పోరాటాలను పాఠ్యంశంగా పొందుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ నిర్వహిస్తోందని తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవాల నేపథ్యంలో సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగారు. కేంద్రం ఇచ్చిన మాట ప్ర‌కారం.. వరుసగా తెలంగాణ విమోచ‌న‌ ఉత్సవాలు నిర్వహిస్తోంద‌ని అన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మోదీ ఆదేశాలు, అమిత్ షా సూచనల మేరకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక‌ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ భాగమై ఈ ఉత్సవాలు నిర్వహిస్తోంద‌న్నారు. ఫోటో ఎగ్జిబిషన్ ను చూడగటానే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణకు విముక్తి కోసం చేసిన పోరాటాలు…సమర యోధుల త్యాగాలను కళ్లకు కట్టినట్లుగా చూపారని కొనియాడారు. ఎన్నో ఏళ్లపాటు తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని యువకులు జాతీయ జెండాలు పట్టుకుని ఉద్యమించారు. లాఠీదెబ్బలు తిన్నారు. ఎందుకంటే నాడు తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలు మామూలు విషయం కాదు. రజాకార్ల పాలనలో దారుణాలు అన్నీ ఇన్నీ కావు. బైరాన్ పల్లి, గుండ్రాంపల్లి, పరకాల, వెయ్యి ఊడల మర్రి సంఘటనలు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయి. నగ్నంగా మహిళలను బతుకమ్మ ఆడించిన దురాగతాలు మరవలేం.

 

నిజాం నిరంకుశ పాలనపై కొమరం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్ధ, బూర్గుల రామక్రిష్ణారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటాలను, హిందూ మహాసభ, ఆర్య సమాజ్ పోరాటాలను గుర్తుచేసేందుకు, రాబోయే తరాలకు ఈ చరిత్రను అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహిస్తున్నాం అని తెలిపారు. ఆప‌రేషన్ పోలోతో తెలంగాణకు విముక్తి కల్పించిన మహనీయుడు సర్దార్ వల్లభాయి పటేల్ అని కొనియాడారు. తెలంగాణ విమోచన దినోత్సవాలు జరిపే అర్హత బీజేపీకి లేదన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై…. మరి కాంగ్రెస్ కు మాత్రమే ఆ అర్హత ఉంటే ఇప్పటి వరకు తెలంగాణ విమోచన దినోత్సవాలను ఎందుకు నిర్వహించడం లేదు? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల తీరు తెలంగాణ విమోచన దినోత్సవాలపై అధికారంలో లేనప్పుడు ఒకమాట… వచ్చాక మరోమాట అని ఎద్దేవాచేశారు.

ఒక పార్టీ ’సెప్టెంబర్‌ 17న సమైక్యత దినోత్సవం’ అంటది.. ఇఫ్పుడున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ‘ప్రజాపాలనా దినోత్సవం’ నిర్వహిస్తుందట. మరి దాదాపు 50 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలారు కదా… ఇన్నాళ్లు మీరు చేసింది ప్రజా వంచనా? ప్రజా వంచన దినోత్సవంగా నిర్వహించుకోండి. అని అన్నారు.  తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా జరిపితే… మేమంతా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. ర‌జాకార్ల‌ పార్టీ వారసుడైన ఒవైసీని సీఎం పొగడడం వెనుక ఉద్దేశమేంది? జై పాలస్తీనా, జై పాకిస్తాన్ అనేటోళ్లకు వత్తాసు పలకడమంటే కాంగ్రెస్ దుర్మార్గాలకు పరాకాష్ట ఇది.. ఒకవైపు రాహుల్ గాంధీ అమెరికాకు పోయి భారతదేశాన్ని కించపరుస్తున్నడు. ఇక్కడ ఒవైసీకి వత్తాసు పలికి తెలంగాణను సీఎం కించపరుస్తున్నడు. యధా రాజా తథ ప్రజ. కాంగ్రెస్ ఆలోచన అంతా దేశాన్ని ముక్కలు చేయాలనే విధంగా మాట్లాడుతున్నట్లుంది అని బండి సంజ‌య్  విమ‌ర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page