ప్రపంచంలోనే ఖైరతాబాద్‌ ‌గణపతి ప్రసిద్ధి

  • ఇక్కడి వినాయకుడి దర్శనం పూర్వజన్మ సుకృతం
  • నిర్వాహకుల కృషి గొప్పది మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌ప్రపంచంలోనే మన ఖైరతాబాద్‌ ‌వినాయకుడు ప్రసిద్ధి చెందాడని, ఒకప్పుడు వినాయక చవితి అంటే ముంబై గుర్తుకు వొచ్చేదని, కానీ ఇప్పుడు దేశమంతా ఒకటే మాట అంటున్నదని, ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌మహారాజ్‌కి జై అంటున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు. ఆదివారం ఖైరతాబాద్‌ ‌వినాయకుడికి పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసే ఘనత మన ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు దక్కిందని అన్నారు. మనం ఇంట్లో చిన్న పూజ చేయాలంటేనే ఎన్నో ఇబ్బందులు పడుతామని, కానీ 70 సంవంత్సరాల నుంచి ఇంత భారీ స్థాయిలో గణేష్‌ ‌విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారంటే ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌నిర్వాహకుల కృషి గొప్పదని కొనియాడారు.

భారతీయ సంస్కృతి చాలా గొప్పదని, భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వం ఉన్న సంస్కృతి మనదని, ఏదైనా సమస్య వస్తే అందరం ఒక్కటై కదులుతామని, అదే భారతీయ సంస్కృతి అని హరీష్‌ ‌రావు తెలిపారు. ఇక్కడి గణేష్‌ను దర్శించుకునేందుకు ఇసుకేస్తే రాలనంత జనం వొచ్చారని తెలిపారు. హైదరాబాద్‌, ‌తెలంగాణ రాష్ట్రమంతా ఇక్కడే ఉన్నట్లు ఉందన్నారు.  వినాయక చివితి అంటే డివోషన్‌ ‌మాత్రమే కాకాదని, ఎమోషన్‌ ‌కూడా ఉందని, అందరి ఐకమత్యాన్ని చాటేందుకు బాల గంగాధర్‌ ‌తిలక్‌ ‌స్వాతంత్య్రోద్యమం సమయంలో గణేష్‌ ఉత్సవాలు నిర్వహించారని గుర్తుచేశారు.

అదే స్పూర్తిని ఇంకా కొనసాగిస్తున్నామని, రాబోయే రోజుల్లో కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ఇటీవలి వర్షాలకు కొన్ని జిల్లాల్లో బీభత్సం జరిగిందని, ఆ ప్రజలందరి కష్టాలు తొలగిపోవాలని, రాష్ట్ర ప్రజందరి విఘ్నాలు తొలిగి, సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ గణపతిని రెండు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాననని హరీష్‌ ‌రావు తెలిపారు. 9 ఏండ్ల బిఆర్‌ఎస్‌ ‌పాలనలో కేసీఆర్‌ ‌నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి ఏటా గణేష్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని, ఇప్పుడు కూడా అదే పద్దతిలో నిమజ్జన కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని హరీష్‌ ‌రావు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page