నువ్వు శిథిలాల్లోకి తోసినంత మాత్రాన / నేను విలపితను కాదు/ విచ్చుకునే వికసితని అని బ్రహ్మ జెముళ్ల ముళ్ల గాట్లని తట్టుకుంటూ మొక్కవోని ధీరతను స్రవంతి విముక్త కవితలో ప్రకటించారు. ఎన్నో కన్నీళ్లని దిగమింగి, ఇంకెన్నో అవమానాలను గర్భంలో దాచుకుని, ఎన్నెన్నో అనుభవాలను పునాదిగా పూర్చుకుని అంతరంగాన్ని మెలిపెట్టి పిండేసిన దుర్భర విషాదాన్ని హృదయ ద్రావకంగా ఆమె కవిత్వీకరించారు.
కఠోర పరిస్థితులను ఎదుర్కొన్నా వికసితస్థితి వైపు ధైర్యంగా సాగిన నడకను ఆమె కవితా వాక్యాలు బలపరిచాయి. మనసు నుడి, గుండెతడి ఏ మనిషినైనా కదలించకపోతుందా అన్న లక్ష్యంతో సాగిన కవయిత్రిలోని ఆలోచనల అసిధారలే ఈ కవితలు. ఎండమావుల జీవితాలను యేళ్ల తరబడి మోస్తూ, గాజు బొమ్మల జాలికళ్ళ నవ్వులు, పింగాణీ పాత్రల నగిషీలను తలపోస్తూ నిస్సహాయతను దయనీయంగా కప్పుకోవడమే తప్ప పెదాలపై నవ్వుల పులకరింతలే తెలియని అతుకుల బతుకుల జీవనపు లోతుల్ని దృశ్యమానం చేసిన గుండెమంటలివి.
గతానికి కళ్లుంటాయా? / గాయానికి సాక్ష్యాం చెప్పడానికి/ నా స్మృతుల సెగకు నిప్పంటించి పోయాడు/ గుండె కాలిన కమురు వాసన వేస్తుంది ఇప్పుడు అన్న పంక్తుల్లోని వేదనను తప్పక గమనించి తీరాలి. నా ఊపిరి ఆగిపోదని వాడికి చెప్పండి… వీళ్ళను శిఖరాలకు ఎక్కించే వరకు అనడంలో బలమైన నాయకత్వ పటిమ కనపడింది. కుటుంబాన్ని తన రెక్కల కష్టంతో ముందుకు నడిపే యజ్ఞంలో అలసి సొలసి పడుకున్న అమ్మ గుండెపై తడి ఆరని కన్నీరు ప్రవహిస్తున్నప్పటికీ ఆమె ధైర్యపు ఊపిరులు పోసే నడుస్తున్న పొద్దు అని సగర్వంగా అమ్మతనాన్ని వర్ణించారు.
స్వప్నాల రెక్కలు విప్పుకుని పక్షి సేద తీరేందుకు ఆశ్రయమిచ్చే చెట్టును కనికరం లేకుండా నరికేయవద్దన్నారు. మృత్యువు గుండెల్లో దూరే చివరి క్షణం వరకు వర్షించే మేఘం జ్ఞాపకాలను వల్లించే చల్లని లేఖను చదవాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. మేమే ఆకాశంలో సగం కాదు/ ఆకాశమంతా మేమే అని ఆధిపత్య ప్రపంచానికి సూటిగా చెప్పారు. బ్రతికున్నప్పుడు కాదు చనిపోయినాక జీవించి ఉండటం వేరు అన్నారు. మానవత్వాన్ని మరవడంలోనే నువ్వు మహాత్ముడివా అని మనిషిని తీవ్రంగా అధిక్షేపించారు. సెల్ఫీ కోరిక ప్రమాద అంచును చూపి ప్రాణాల్ని లాగేస్తుందని హెచ్చరించారు. ఆడపిల్లలు ఎదగాలంటే భ్రూణ హత్యలు ఆగాలన్నారు. ఆర్థిక బంధాలే మానవ సంబంధాలవడాన్ని చూసి ఎంతగానో నొచ్చుకున్నారు.
గువ్వపిల్లలు రెక్కలొచ్చి గూటినొదిలి ఎగిరిపోయాక హృదయోద్వేగపు జ్ఞాపకాల లావాను, ఆకురాలిన అలజడికే అల్లాడి రాలిపోయిన చిరునవ్వులను కన్నీళ్లతో మనసారా అభిషేకించారు. చట్టాలను కొందరు తమ చుట్టాలుగా మార్చుకుని ఊరేగుతుంటే మానవత్వాన్ని ఏ మార్కెట్‌లో కొనుక్కోవాలో అని ఖేదపడ్డారు. మానవ స్వార్థపు కోరల్లో చిక్కి శల్యమవుతున్న ప్రకృతిని రక్షించే నాధుడేడీ అన్నారు. జీవవైవిధ్యాన్ని కోల్పోతే మనిషికి ప్రకృతే మరణ శాసనమవుతుందన్న హెచ్చరికను చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని వదిలేసి సహజ గుణాత్మక జీవధాతువుల ప్రాకృతిక జీవితానికి ఈ నేలపై పునాదులు వేయమని కోరారు.
మనిషికి వైకల్యం ఉండొచ్చు కాని మనసుకుండకూడదన్నారు. కవిని కాలానికి అధిపతి, కలానికి ప్రతినిధి అని చెప్పారు. లోకాతీతమైన స్నేహం కోసం తృణప్రాయంగా ప్రాణాన్నే సమర్పిస్తానన్నారు. పదవులు కోరని పావనమూర్తి గురవని మ్రొక్కారు. కాల ప్రవాహానికి ఎదురీదిన శిశిరపు కోయిలను ఆత్మవిశ్వానికి ప్రతీకగా చూపారు. ఆత్మలేని ఆప్యాయతలెందుకన్నారు. నిజాన్ని రాయనందుకు తన కలం కదలనన్నదంటూ ఆ అవ్యక్త నిరసనను ప్రత్యక్ష జీవిత సమరం వైపు నేర్పుగా మళ్ళించారు. మనిషి జీవనపు భూషణమే భాష అన్నారు. జీవితానికి పరమార్థం ఉండేలా మనిషిని సాగిపొమ్మన్నారు. విధ్వంసానికి గతించిన చరిత్రనే సాక్షీభూతమని తెలిపారు. వానమ్మను అమ్మై నేలకు రమ్మని ఆహ్వానించారు. ఊహను ఒక ప్రభంజనం లాంటి అనుభూతితో పోల్చారు. బాధలలో భరోసాగా నిలిచేదే ఆత్మబంధమన్నారు.
ప్రేమ ఎట్టి పరిస్థితులలో కూడా అగాధమవకూడదని చెప్పారు. అన్ని వ్యవస్థల అవస్థలను, ప్రజాసామ్య వ్యవస్థను ఒక గాడిలో పెట్టే బ్రహ్మాయుధం ఓటేనన్నారు. కవికి కవిత్వమే ఒక అనంత యుద్ధరంగమని చెప్పారు. దేహంలోని ప్రాణంకన్నా దేశమే మిన్న అన్నారు. చిట్టచివరి జీవన మజిలీ వృద్ధాప్యమని చెప్పారు. రంగులద్దిన మాయా జీవనలోకం మిగిల్చేవి చేదు జ్ఞాపకాలేనని తెలిపారు. ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ అవతారాలకు భక్తితో సమర్పించే ఆత్మ నివేదనపు నైవేద్యమే బోనమన్నారు. అంతర్మధన యుద్ధం మనిషికి నిజాన్ని నిట్టనిలువుగా చూపి తెలివిడి తలుపులు తెరుస్తుందని తెలిపారు. మరణమంటే బాంధవ్యాల బందిఖానా నుండి విముక్తి అని చెప్పారు. ఒలికిన కన్నీరు ఇంకనిదన్న నగ్నసత్యాన్ని చెబుతూనే మనుగడ కోసం ధైర్యపు ఊపిరులూదిన ఎన్నో కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి. స్రవంతిలో కవిత్వం రక్తగతమై భావాగ్నిగా మారి సాంద్రత, గాఢతల సమ్మేళనమై ప్రగాఢంగా వర్షించింది.
– డా. తిరునగరి శ్రీనివాస్
9441464764