మావోయిస్టులు ఈ దేశ పౌరులు కాదా?

  • వారిని నిర్మూలించటం ఎంతవరకు సమంజసం?
  • కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు విచారకరం

మావోయిస్టు ఈ దేశ పౌరులు కాదా??  వారిని నిర్మూలించటం ఎంతవరకు సమంజసం అని కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.  ఆ వివరాలు ఆయన మాటల్లోనే….

 -కూనంనేని సాంబశివరావుఎమ్మెల్యే, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
-కూనంనేని సాంబశివరావు
ఎమ్మెల్యే, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

గత నెల ఆగస్టు 24న సాక్షాత్తు దేశ హోంమంత్రి అమిత్‌షా మార్చి 2026 నాటికి మావోయిస్టు కార్యకలాపాలు నిర్మూలిస్తామని, మావోయిస్టులకు వ్యతిరేకంగా నిర్దాక్షిణ్య వ్యూహాన్ని అవలంబిస్తామని రాయ్‌పూర్‌లో ప్రకటించారు. ఆ ప్రేరణతోనే ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సరిహద్దులో 2024 సెప్టెంబర్‌ 3న ఎన్‌కౌంటర్‌గా చెప్పబడుతున్న ఘటనలో తొమ్మిది మంది మావోయిస్టులను చంపారు. వెనువెంటనే సెప్టెంబర్‌ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం పరిధిలో ఆరుగురు మావోయిస్టులు పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. మొత్తంగా ఒక్క 2024లోనే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోనే 136 మంది మావోయిస్టులు చంపబడ్డారు. సేఫ్‌ జోన్‌గా భావించి అటు నుండి వచ్చి తెలంగాణలోని భద్రాద్రి ప్రాంతంలో తలదాచుకుంటున్న వారిని నిర్మూలించే కార్యక్రమంలో భాగమే కరకగూడెంలో జరిగిన ఎన్‌కౌంటర్‌. రాజ్యహింసలో భాగంగా అది ఏ ప్రభుత్వమైన గానీ 1996 నుంచి 2018 వరకు దాదాపు 15 వేల మంది మావోయిస్టులను హతం చేశారు. ఈ కాలంలో నక్సల్‌ దాడుల వలన కానీ,  పోలీసుల పొరపాట్లవల్ల కానీ దాదాపు 4000 మంది సామాన్య పౌరులు మరణించారు.  నక్సల్స్‌ అయినా, సామాన్యులైనా  మరణించిన వేలాది మంది మృతులు, హతులలో ఎక్కువ భాగం పేద, దళిత, ఆదివాసియులు ఉన్నారనే విషయం గమనార్హం.

నిరుద్యోగం, ఆకలి బాధలు, అణచివేతలు, సామాజిక అవమానాలు, పేదరికం, భూమి సమస్య, చాలీచాలని వేతనాలు, కండ్ల ముందు కనపడే దౌర్జన్యాలు, అక్రమాలపై ఆవేశంతో కూడిన వర్గ కసితోనే పేదవారు నక్సల్‌గా మారుతున్నారు. దీనిని సామాజిక సమస్యగా భావించకుండా శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరిస్తూ అణచివేత, నిర్మూలన కార్యక్రమాలకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టడం ఆటవిక రాజ్యాంగాన్ని తలపిస్తుందే గాని, ప్రజాస్వామ్యం భావన మచ్చుకైనా కలగడం లేదు. ఈ విధమైన నిర్మూలన కార్యక్రమాలు మొదలెట్టి  రాజ్యాధికారం, పోలీసు వ్యవస్థ ద్వారా మరెంతమంది నిండు ప్రాణాలు బలితీసుకుంటారు? బలైనవారి భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, వారి ఆక్రందనలు పాలకుల చెవులకు వినపడవా? వారి వేదనలు, బాధలు కనపడవా? కమ్యూనిస్టులు, మావోయిస్టులు, ప్రశ్నించేవారు దేశద్రోహులా? వారిని చంపడానికి ఏ చట్టాలు వర్తిస్తున్నాయి? దేశంలో ఈనాటి సమన్యాయం నినాదం వెనుక ఉన్నది కమ్యూనిస్టులు కాదా? భారతదేశంలోని విప్లవాలకు, సామాజిక ఉద్యమాలకు పెద్ద దిక్కుగా బాసిల్లినటువంటి చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, అలాగే కమూనిస్టు పార్టీ నాయకులు ఇంద్రజిత్‌గుప్తా, భూపేష్‌ గుప్తా, హీరేన్‌ ముఖర్జి, గురుదాస్‌ దాస్‌గుప్తా భారతదేశ పార్లమెంటులో ఉత్తమ పార్లమెంటేరియన్లుగా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు.

తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలర్పించిన 4,500 మంది యోధులను అందించినది కమ్యూనిస్టు పార్టీ కాదా..?  తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, అలాగే దేశంలోని అనేక ప్రాంతాల్లోని పేద ప్రజల కొరకు భూ పోరాటాలు, వెట్టిచాకిరి విముక్తి పోరాటాలు, కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించింది కమ్యూనిస్టులు కాదా? ఇంకా  దేశం కోసం, తెలంగాణ సమాజం కోసం సర్వస్వం త్యాగం చేసిన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్‌, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్యలాంటి యోధులను అందించింది కమ్యూనిస్టు పార్టీ కాదా..? దేశంలోని ప్రతి ప్రగతిగామి చట్టం రూపకల్పన కమ్యూనిస్టుల పోరాట ఫలితం కాదా? ల్యాండ్‌ సీలింగ్‌ లాంటి చట్టాల సాధన గానీ, ఎనిమిది గంటల పని హక్కు గానీ, అటవీ హక్కుల చట్టం గానీ, రైతాంగ చట్టాలు గానీ, విద్యావ్యవస్థలో మార్పులు గానీ, సాంస్కృతిక విప్లవాలు గానీ ఇవన్నీ కమ్యూనిస్టుల ద్వారానే కదా సాధ్యమైంది. తమ కవిత ద్వారా అగ్నిధార కురిపించిన దాశరథి కృష్ణమాచార్య, అలాగే ఆయన సొదరుడు దాశరథి రంగాచార్య, మాటలను తూటాలుగా పేర్చి నిప్పు కణికలు కురిపించి, సామాజిక విప్లవాగ్నిని రగిలించిన శ్రీశ్రీ, సామాన్యుడి వేదన, శోధనకు ప్రతీకగా నిలిచిన ఆరుద్ర లాంటి వారికి ప్రేరణ కల్పించింది కమ్యూనిజం కాదా…? ఏ తప్పు చేయనటువంటి వరవరరావు, సాయిబాబా లాంటి మేధావులను కూడా జైళ్లలో నిర్భందిస్తున్నారు. బెయిల్‌ వచ్చిన వరవరరావును కూడా బయిటికి రాకుండా ఇప్పటికీ అడ్డుకుంటున్నారు.

కేంద్ర విజిలెన్స్‌ సంస్థల ద్వారా ప్రొఫెసర్‌ హరగోపాల్‌, జర్నలిస్టు వేణుగోపాల్‌ లాంటి వారిపైన కూడా ఊపా చట్టాలను ప్రయోగిస్తూ నిర్భందాలకు గురి చేస్తున్నారు. రామకృష్ణ, గణపతి, గణేష్‌ ఇంకా అనేకమంది బాగా చదువుకున్న మేధావులు తమ కుటుంబాలను త్యాగం చేస్తూ అడవిబాటను ఎంచుకున్నారు. వారి మార్గం తప్పుకావొచ్చు. కానీ వారి ఆవేశం న్యాయమైనదే. ముక్కుపచ్చలారని రామకృష్ణ కుమారుడు మున్నాను కూడా ఇటీవలే ఎన్‌కౌంటర్‌ పేరుతో హతం చేశారు. కమ్యూనిస్టు పార్టీకి, నక్సల్స్‌కు విధానపరమైన విభేదాలున్నప్పటికీ, ప్రశ్నను అణిచివేయడం, ప్రశ్నించే వారిని మానవ హననం చేయడాన్ని కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.  సీపీఐ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నలమల్ల గిరిప్రసాద్‌ ఉన్న కాలంలో అక్రమ కేసులతో జైళ్లలో మగ్గుతూ, ఎటువంటి అండదండలు లేని వారిని విడిపించడం కోసం కామ్రేడ్‌ సురవరం సుధాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఒక లీగల్‌ సెల్‌ను, పౌరహక్కుల సంఘాన్ని ఏర్పాటు చేయడాన్ని గుర్తుచేస్తున్నాను.అమిత్‌ షా చెప్పినట్లుగా 2026 నాటికి మావోయిస్టులను గానీ, ప్రశ్నించే వారిని గానీ హతం చేయవొచ్చు.

కానీ, మనిషి అలోచనలు, భావాలు, ఆవేదనలు, ఆకలి బాధలు నిరంతరం ఉంటాయి. వాటినుంచే విప్లవాలు పుడుతాయి. కూలిపోయిన సమాజం నుంచి చైతన్య పోరాటాలు విలసిల్లుతాయి. సమాజం ఉన్నంత కాలం ప్రశ్న ఉంటుంది. ప్రజలలో భావాలుంటాయి. ప్రశ్న శాశ్వతం. భావాలను అణచలేరు. అంతిమంగా ప్రజలే విజేతలు. మావోయిస్టు సోదరులకు కూడా ఒక సూచన చేస్తున్నాను. నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా ప్రజా ప్రభుత్వం స్థాపించాలనే లక్ష్యంగా గల మీ హక్కును ప్రశ్నించలేము. కానీ ఒక సూచన. ప్రజలను సన్నద్ధం చేసి, చైతన్యపరచకుండా విప్లవబాటను ఎంచుకోవడం వల్ల త్యాగాలు వృథా గా మిగులుతాయి. అలాగే హింసకు ప్రతిహింసే సమాధానంగా ప్రభుత్వ రాజ్యహింసకు బలం చేకూర్చే విధంగా కోవర్టుల పేరుతో సామాన్యులను హతమార్చడం (ఇటీవలే రాధ అనే మహిళను కోవర్టు అనే పేరుతో హతమార్చారు), పోలీసు అధికారులు, క్రింది స్థాయి పోలీసులను హతమార్చడం వలన ప్రజా సానుభూతిని కోల్పోతున్నారు.  క్రింది స్థాయి పోలీసులు కూడా పేదవారే. ప్రజల సానుభూతిని కోల్పోకుండా మద్దతు పొందే విధంగా మన చర్యలు ఉండాలి. అలాగే  ప్రభుత్వ బలగాలు, సైన్యం, పోలీసులతో కూడిన రాజ్యంపై తిరుగుబాటు చేసే క్రమంలో మన ప్రజాబలాన్ని మనకున్న ప్రజాసైన్యం బలాన్ని కూడా అంచనా వేసుకోవాలి.

అందువలన లెనిన్‌ చూపిన మార్గం అనుసరించి ముందుగా ప్రజాశ్రేణులను, బలమైన ఉద్యమాలను రూపొందించుకోవలసిన అవసరముంది. ఓబీసీలు, దళితులు, గిరిజనులు, ఉద్యోగ, కార్మిక, అసంఘటిత, కనీస వేతనం పొందని కోట్లాది మందిలో రైతాంగం, వ్యవసాయ కూలీలులాంటి వర్గాల్లో పట్టును సాధించుకొని విప్లవ పరివర్తన సాధనకు కృషి చేయవలసిన అవసరముంది. ఆ సమయంలో పాలక వర్గాలు అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండటానికి అన్ని రకాల దమన చర్యలు, బల ప్రయోగం, హింస కొనసాగిస్తాయి. ఆధునిక టెక్నాలజి గూగుల్‌ శాటిలైట్‌ మ్యాప్స్‌, ఫోన్‌ సిగ్నల్స్‌, డ్రోన్స్‌ను ఉపయోగిస్తూ నిర్బంధాన్ని మరింత పెంచుతారు.మనకున్న సమ ప్రజా బలంతో వారి హింసను, బలప్రయోగాన్ని త్రిప్పికొట్టే తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకోవచ్చు. 1964లో కమ్యూనిస్టు ఉద్యమ చీలిక ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా దేశానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. కమ్యూనిస్టులందరూ కలవాల్సిన సమయం ఉత్పన్నమయింది. ఈ దేశంలో పేద ప్రజలు, అణగారిన వర్గాలు, మేధావులు, కమ్యూనిస్టుల ఏకీకరణకు ఎదురు చూస్తున్నారు. ఆ రోజు మరెంతో దూరంలేదని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page