సింగరేణికి భ్ర‌ష్టు ప‌ట్టించిన‌ కెసిఆర్

  • 65 వేల ఉద్యోగాలను 40వేల‌కు కుదించాడు.
  • 8 గనులు మోయించిన ఘ‌నుడు
  • కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 24 : తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనేక సభలు పెట్టి సింగరేణికి మేలు చేస్తానని నమ్మవలికిన కెసిఆర్, ఇచ్చిన అనేక హామీలను నిలుపు కోలేక పోయాడని, సింగరేణి సంస్థకు తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో లు 30 వేల కోట్ల బకాయి పడితే వాటిని చెల్లించ‌కుండా సింగరేణిని దివాలా తియించాడని  తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్ర‌సాద్ ఆరోపించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. 30 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నప్పటికీ  కార్మికులకు జీతాలు ఇవ్వడానికి ప్రతినెలా అప్పటి డైరెక్టర్ ఫైనాన్స్,ఇప్పటి చైర్మన్ బలరాం ప్రతినెల బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని అన్నారు. ఆ దుస్థితికి కారణం కేసీఆర్ నిర్లక్ష్యమేనని మండిప‌డ్డారు.  శ్రీరాంపూర్ లో 2018 లో ఆత్మీయ సమ్మేళనం పేరుతో  పెద్ద మీటింగ్ పెట్టి, సింగరేణికి ఒక రోజు సెలవు ప్రకటించి, బస్సుల ద్వారా కార్మికులను రప్పించి,  హామీలు ప్రకటించాడ‌ని, .కానీ ఒక్క‌టి కూడా అమలు చేయ‌లేద‌న్నారు. కార్మికులకు 10 వేల  కొత్త  క్వార్టర్లు  కడతానని చెప్పి విస్మ‌రించార‌ని అన్నారు. రామగుండంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ఊసే మ‌రిచాడ‌ని అన్నారు. కొత్తగనులు ప్రారంభించకపోగా ఉన్న గనులు ఎనిమిదింటినీ మూయించాడని, 65 వేల కార్మికుల సంఖ్యను 45000 కుదించాడ‌న్నారు.

సింగరేణి ద్వారాకారుణ్య నియామకంలో కరోనాతో మెడికల్ బోర్డు జరగకపోవడం వల్ల ,అనేకమంది వారసులకు  వ‌య‌సు మీరిపోయి వయోపరిమితి 35 నుంచి 40 ఏళ్ళకి పెంచాలని కార్మికులు మొత్తుకుంటే కేసీఆర్ ప‌ట్టించుకోలేద‌న్నారు. కాంగ్రెస్ వచ్చిన నెలల వ్యవధిలో ఆ హామీని అమ‌లు చేశామని చెప్పారు.కార్మికులు సరిహద్దులో సైనికులు లాంటి వారని, వారికి ఇన్ కంటాక్స్ నుంచి మినహాయింపు తెస్తానని చెప్పి అసెంబ్లీలో హడావిడి చేశాడు కానీ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 30 రోజుల్లోనే వారసత్వ ఉద్యోగాలకు వయోపరిమితి 35 నుంచి 40 ఏళ్ల‌కు పెంచిన‌ట్లు గుర్తుచేశారు.  రామగుండంలో సూపర్ స్పెషాలిటీ ద‌వాఖాన నిర్మించ‌నున్న‌ట్లు చెప్పారు. పెండింగ్లో ఉన్న 441 మంది డిపెండెంట్ లకు స్వయంగా సీఎం చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామ‌న్నారు.  సింగరేణి సంస్థ సుస్థిరత కోసం సోలార్ పవర్ ను విస్తరించడం జరుగుతుందని అన్నారు.  సింగరేణి సంస్థను నెట్ జీరో ఎనర్జీ కంపెనీగా మార్చడం కోసం కంపెనీ వ్యాప్తంగా 450 మెగా వాట్స్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఇది 2025 26 పూర్తి చేయాలని నిర్ణయించామ‌న్నారు. సింగరేణి అంతర్జాతీయ స్థాయికి చేర్చడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృతనిచ్చేయంతో ముందుకు పోతున్న తరుణంలో  పనిగట్టుకొని కార్మికులను అనవసరంగా రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవద్దని జ‌న‌క్ ప్ర‌సాద్‌ హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page