రాష్ట్రంలో భారీ వర్షాలు పడి పంటల విస్తీర్ణం పెరిగినప్పటికీ రుణ పంపిణీ మాత్రం లక్ష్యాలకు అనుగుణంగా జరగడంలేదన్న విమర్శలు ఉన్నాయి. మే నుంచి సెప్టెంబరు వరకు వానకాలం పంటల రుణాలు ఇవ్వాల్సి ఉన్న ఆగస్టు చివరి నాటికి 50శాతం రుణాలను కూడా పంపిణీ చేయలేదని ఆరోపిస్తున్నారు. జూన్ నుంచి సెప్టెంబరులోపు వందశాతం పంట రుణాలను రైతులకు అందించాలని బ్యాంకుల వారీగా లక్ష్యాలను నిర్ణయించారు. అక్టోబర్ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు మాత్రం ఏ బ్యాంకు కూడా లక్ష్యాలను చేరుకోలేదు. సెప్టెంబరు నెలంతా రుణాలు పంపిణీ చేసిన 70శాతంలోపే పంట రుణాలు రైతులకు అందాయి. అయితే.. బ్యాంకుల ద్వారా రుణాలు అందకపోవడం వల్ల కొంతమంది రైతులు ఇతర మార్గాల్లో పంట రుణాలను తెచ్చుకుని పెట్టుబడి పెడుతున్నారు.
ఇకపోతే ఆరుతడి పంటలపై ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేస్తున్నా.. రైతులు వరికే మొగ్గు చూపుతున్నారు. వాణిజ్య పంటలు, సేంద్రియ పంటలకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనికితోడు కోతుల భయంతో ఎక్కువ మంది వరినే వేస్తున్నారు. అత్యధికంగా ఈ వానకాలంలో వరిసాగువైపు రైతులు మొగ్గుచూపారు. జూన్, జులై నెలలో వరినాట్లు పూర్తి చేశారు. ఆగస్టు నెలలో ఎక్కువగా ఈ పంటను వేశారు. ఆరుతడి పంటలు ముఖ్యంగా మొక్కజొన్న, సోయా ఎక్కువగా సాగుచేశారు. వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మొత్తంలో ఇతర పంటలను సాగుచేయలేదు.
వర్షాలు ఉండడం వల్ల ఈ వానకాలంలో వరిసాగు ఎక్కువగా జరిగినట్లు ఏఈవోలు నిర్వహించిన క్రాప్ బుకింగ్ సర్వేలో బయట పడిరది. ఈ వానకాలంలో అత్యధికంగా వరిసాగు రైతులు చేశారని అధికారులు తెలిపారు. నిజాంసాగర్, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులు ముందే నిండడంతో ఆయకట్టులో పంటల విస్తీర్ణం భారీగా పెరిగింది. అన్ని చెరువులు, కుంటలు నిండడంతో పంటల సాగు భారీగానే పెరిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా ఈ పంటల విస్తీర్ణం పెరిగింది. ఆరుతడి పంటలకన్నా వరిసాగునే ఎక్కువమంది రైతులు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పంటల విస్తీర్ణం భారీగా పెరిగినా రుణాల పంపిణీ మాత్రం అనుకున్నవిధంగా జరగలేదు.
అత్యధికంగా వర్షాలు పడడం, శ్రీరామ్‌సాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు నిండడం వల్ల భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. భారీ వర్షాలతో అన్ని చెరువులునిండడంతో సెప్టెంబరు మొదటి వారం వరకు ఆరుతడి పంటలతో పాటు వరిసాగును ఎక్కువమంది రైతులు చేశారు. ఆరుతడి పంటలకు అవకాశం లేకపోవడంతో రైతులు వరిసాగువైపే మొగ్గుచూపారు. ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో వరిసాగు కావడం వల్ల యంత్రాంగానికి సవాల్‌గానే మారనుంది. ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం పెరగడం వల్ల ధాన్యం కొనుగోలు భారీ మొత్తంలో ఏర్పాటు చేస్తే తప్ప కొనే పరిస్థితి లేదు.
-మారుపాక గోవర్ధన్ రెడ్డి