‘కథకుడు కాదలుచుకున్న “కాళోజీ” గారిని కవిత్వం రాయమని ప్రోత్సహించిన …’

గురు “రాఘవుడు”..

కాళోజీ నారాయణరావు గారు తమ మొదటి కథ “భూతదయ”ను అలనాటి “గోల్కొండ పత్రిక”కు పంపిస్తే అది 19 ఆగస్టు, 1937 లో ప్రచురితమైంది. 1942 లో కాళోజీ గారికి గార్లపాటి రాఘవరెడ్డి గారు పరిచయమయ్యారు. అప్పటికే కాళోజీ గారివి మూడు, నాలుగు కథలు ప్రచురింపబడ్డాయి. త్వరలోనే గార్లపాటి వారికి కాళోజీ ప్రియ శిష్యుడయ్యారు. కవిత్వం రాయమని కాళోజీని ప్రోత్సహించారు గురు రాఘవుడు. అదెట్లనిన, తెలుసు కుందాం కాళోజీ గారి మాటల్లోనే… “…మా గురువు గార్లపాటి రాఘవరెడ్డి గురించి చెప్పాలె. రాఘవరెడ్డి గారి కి 25 వ యేట భార్యావియోగం. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. మళ్ళీ పెళ్ళి చేసుకోలే. హన్మకొండలో మా ఇంటికి 300-400 గజాల దూరంలో సచ్చిదానంద ఆశ్రమం ఉండేది. ఏదో కేసు సందర్భంలో హనుమకొండ వచ్చినపుడు ఆశ్రమంలో వుండేవాడు.తర్వాత కొడుకులను తీసుకొని ఆశ్రమం చేరాడు. బిడ్డను మేనల్లుడి కిచ్చి పెండ్లి చేశాడు. రాఘవరెడ్డి గారిని అందరూ ‘రాగన్న’ అనెటోండ్లు.

ఆశ్రమంలో కొందరు పర్మినెంట్ గా ఉండెటోల్లు.ఆయన ప్రవర్తన, అలవాట్లు బాగుండేవి. కలుపుగోలు మనిషి. జగన్మిత్రుడనవచ్చు. నేను ఆయన్ను రాఘవరెడ్డి గారనో, రాగన్న అనో గాక “అయ్యవారు” అని పిలిచెటోన్ని. నా ద్వారా పరిచయమైనోళ్ళు అయ్యవారు అని అనేవారు. పాములపర్తి వేంకట నరసింహారావు, సదాశివరావు లు మాత్రం ఆయన్ను “గురూజీ” అని పిలిచేవారు. ఆశ్రమం ప్రక్క ఇల్లే ధూపాటి వేంకట రమణా చార్యుల వారిది. ఏ సందర్భంలోనో రాగన్నతో పరిచయం అయింది. నేను ఆయనను ఆశ్రమంలో కలిసెటోన్ని. నా కాయన గురు స్థానం. నేనప్పుడు కథలు రాసెటోన్ని. అయ్యగారు కవిత్వం రాయమంటే “ఆ ఛందస్సులు అన్నీ నాకు తలకాయ నొప్పి. నేను చదివింది తెలుగులో రెండో వాచకమేనాయె. నాకు కవిత్వమేమొస్తది” అంటే “అదేమంత గొప్ప” అని సిగరెట్ డబ్బా మూతిలో వుండే అంత కాగితం తీసుకొని దానిమీద అ,ఆ,ఐ,ఈ,అం, అః, హ -అట్ల నాలుగు ఐదు పంక్తుల యతి మైత్రి అక్షరాలు రాసిచ్చి “ఇగో యతి” అని నేర్పిండు దాని ప్రకారం రాస్తే ఎక్కడన్న తప్పితే సరి చేసెటోడు. కవిత్వాన్ని సవరించుటే కాదు నా దస్తూరీని కూడ సవరించెటోడు.

నా అక్షరాలు పడిపోయినట్లుంటై. ఆయన దస్తూరి ముత్యాల వలె వుంటది. తనకున్న కొద్దిపాటి వస్తువు లనే చక్కగా సదిరి పెట్టుకునే మనిషి. ఆయనకు అవ్యవస్థ గిట్టదు. కాగితాలైనా, పక్క బట్టలైనా చిందరవందరగా వుంటే భరించలేడు.సదురుకోమని చెప్పెటోడు.లేకుంటే తనే సదిరెటోడు. ఆ మహానుభావుడు మా ఇంటికొస్తే నేను అక్కడా ఇక్కడా రాసి పడేసిన కాగితాల్ని వెదికి తీసెటోడు. ఒక్కో సారి ఊరికి పోతే వాపస్ వచ్చి నాంక “అయ్యా, ఆ చెత్తంతా ఎక్కడ పెట్టినవ్?” అని అదంతా తీసుకొని రిసెర్చ్ చేసెటోడు. కవిత్వం విషయంల నాకు ఏ సందేహం వచ్చినా ఆయనకు చూపించి దిద్దించుకోవడం నా కలవాటు. యతి ప్రాసలు సరిచూడటం, మాటలే మైనా మార్చడం ఆయన పని.నా ఐడియా, అభిప్రాయం మారకుండా చూసెటోడు. ఏది రాసినా, “ఇదేంది? ఈ అభిప్రాయం బాగా లేదు” అని ఎన్నడూ అనకపోయేది. “నా గొడవ”కు వస్తే, మా గురువు గారు బ్రతికుండంగ రాసినవాటికీ ఆయన పోయినంక నేను రాసిన వాటికీ తేడా వున్నది. ఇప్పుడు వచన కవిత బాగా వస్తున్నది కదా.ఆయన పెట్టిన ఒరవడి ప్రకారం యతో, ప్రాసో, అంత్య ప్రాసో తప్పకుండా ఆ కవితలో వస్తది. ఒకవేళ ఒక మాట తప్పు పడ్డా మార్చేది లేదు. మార్చమని చెప్పే ఆ మహానుభావుడు లేడాయె…”

ఇదే తరహాలో కాళోజి గారినే కాకుండా పూర్వ ప్రధాన మంత్రి పీవీ గారి సాహిత్యాభిలాషను కూడ ప్రభావితం చేసిన గార్లపాటి రాఘవరెడ్డి గారి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. ఒక ‘గురువు’ – ‘లఘువులు’ కాని శిష్యులు ముగ్గురు గార్లపాటి రాఘవరెడ్డి గారు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృత భాషల్లో పాండిత్యము కలిగిన గొప్ప తాత్త్విక కవి. నిరాడంబరంగా సచ్చిదానంద ‘ఆశ్రమం లో తన జీవనం గడిపి 1966 లో పరమపదించారు. అహంకార రహిత సహజ సామాన్యత పరిఢవిల్లిన ఆత్మనివేదనను వేణుగోపాలకుడికి ఛందోమయంగా అతి మనోహరంగా నివేదించిన ఆయన ‘పరిదేవనము ‘ ఒక గొప్ప శతక కావ్యము. వీరి ఇతర రచనలు సావిత్రి (ఖండ కావ్యం), రతి విలాపం (ఖండ కావ్యం), గోపికా వల్లభ (అసంపూర్ణ శతకము). అను నిత్యం సత్యాన్వేషణ తప్ప యేమాత్రం కీర్తి కండూతి, ప్రచార పటాటోపం లేని ఆయన రచనలు, కావ్యాలు అముద్రితాలుగానే మిగిలిపోయాయి. అలనాటి కాకతీయ పత్రికలో (1948 -1956) ఆయన అనేక రచనలు ప్రచురిత మయ్యాయి.

కానీ పుస్తక రూపాన ప్రచురితం కాకపోవడం చింతించ వలసిన విషయం. విశ్వనాధ – గార్లపాటి: 1945 ప్రాంతాల్లో వరంగల్ వచ్చిన “కవి సామ్రాట్” శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారిని కాళోజీ గారి ఇంట్లో కాళోజీ గారి ప్రోద్బలంతో రాఘవరెడ్డి గారు కలవడం జరిగింది. విశ్వనాథ వారు అడిగినంతనే రాఘవరెడ్డి గారు తమ ‘పరిదేవనము’ కావ్యం నుండి ఒక పద్యం చదివారు. మొదటి పద్యానికి చకితులైన విశ్వనాథ వారు రెండవ పద్యానికి ఆనందంతో రాఘవరెడ్డి గారి ప్రక్కకు చేరారు.ఇక ముచ్చటగా మూడవ పద్యం చదవగానే రాఘవరెడ్డి గారినిని కౌగలించుకొని ‘ ఇక్కడ ఇంత మంచి కవులున్నారా!’ అని ఆనందాశృవులు తెచ్చుకున్నారట. అంతటి కవిరాజు విశ్వనాధవారు మెచ్చిన నిజమైన నిరాడంబర మూడు (తెలుగు, సంస్కృతం. హిందీ)భాషల కవి రాఘవ రెడ్డి గారు! ఇంతటి గొప్ప పండితుడిని ‘గురువు’గా కలిగిన అ ముగ్గురు ప్రియ శిష్యుల గురించి పేర్కొంటే రాఘవరెడ్డి గారి పాండిత్య ప్రతిభ యేమిటో మనకు తెలుస్తుంది. ఆ ముగ్గురూ మహా మహులే! లబ్ధ ప్రతిష్టులే!! తమ తమ రంగాలలో పేరెన్నిక గల వారే!!! మొదటి వారు – ఆయనకు అత్యంత ప్రియ శిష్యుడు శ్రీ కాళోజీ నారాయణ రావు గారు. ప్రజా క్షేత్రంలో తిరుగుతూ ప్రజల బాధల కన్నీటి గుర్తులను తన గొడవలుగా వినిపించి అన్యాయాన్ని ఎదిరించిన ‘కన్నీటి కవి’.

రెండవ వారు – మహా మేధావి, సాహిత్య దురంధరుడు, రాజకీయ చాణక్యుడు, పూర్వ ప్రధాన మంత్రి – శ్రీ పీ వీ నరసింహా రావు గారు. ఇక మూడవ వారు – ప్రఖ్యాత మార్క్సిస్టు తత్త్వవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పాములపర్తి సదాశివరావు గారు. “లఘువులు” కాని ఇంతటి విశిష్ఠ శిష్యులను కలిగిన ఆ ‘రాఘవుడు’ నిజమైన గురువుకు నిర్వచనం! ఐతే విచిత్రమేమిటంటే ఆ ముగ్గురు శిష్యులవీ మూడు భిన్న సిద్ధాంతాలు; మూడు విభిన్న దృక్పథాలు; మూడు వైవిధ్య జీవన విధానాలు… ఐనా ఆ ముగ్గురి మధ్య కొనసాగింది స్వార్థ బుద్ధిలేని కల్మష రాహిత్య ముత్యాల చెలిమీ, పగడాల మైత్రీ! దానికి కారణం ఆ గురుడి ఆలోచనా తరంగాల ప్రసరణ ప్రభావమంటే అతిశయోక్తి లేదు ప్రఖ్యాత హిందీ కవయిత్రి ‘మహా దేవి వర్మ ‘ ప్రభావం పీవీ పై ఎంతైనా వుంది. పీవీ కి మహా దేవి వర్మ కవితలపై ఆసక్తి కలిగించిన వారిద్దరు. ఒకరు గార్లపాటి రాఘవరెడ్డి గారైతే మరొకరు కాళోజీ రామేశ్వరరావు గారు. వీరు కాళోజీ నారాయణ రావు గారికి అన్నగారు మరియు ప్రఖ్యాత ఉర్దూ కవి. ఈ పెద కాళోజీ గారు ‘షాద్ కవి ‘ గా పేర్గాంచినారు. పీ వీ సాహిత్యావలోకనం, భావ ప్రకటనలను ఇనుమడింప జేసిన గురు రాఘవుడు: 1945లో పీవీ మొదటిసారిగా గార్లపాటి రాఘవరెడ్డి గారిని కలిసారు. ప్రఖ్యాత ఆంగ్ల కవి ‘థామస్ గ్రే’ రాసిన కవిత్వం ‘ఎలిజీ’ని పీవీ తెలుగు లోకి అనువాదం చేశాడు.

దాన్ని మిత్రుడు సదాశివుడికి వినిపింపగా గార్లపాటి రాఘవరెడ్డి గారు అదివరకే దానిని తెలుగులోకి అనువదించారని మిత్రుడు చెప్పగా ఇద్దరూ కలసి రాఘవరెడ్ది గారుండే ఆశ్రమానికి పోయి ఆయన్ను కలిసారు. ఆ విధంగా రాఘవరెడ్డి గారితో పరిచయం జరిగింది. రెడ్డి గారూ, పీవీ ఇద్దరూ తమ అనువాదాలను పరస్పరం చదివి వినిపించుకున్నారు. ఈ పరిచయం మూడు పువ్వులు ఆరు కాయలుగా పెరిగి పీవీ రాఘవరెడ్డి గారి శిష్యుడయ్యాడు. అంతకు ముందే రాఘవరెడ్డి ప్రియ శిష్యుడు కాళోజీ నారాయణ రావు. ఆయనకు తోడుగా పీవీ, సదాశివరావులు శిష్యరికం చేసిన గురువు రాఘవరెడ్డి గారు. పీవీ తరచూ ఆశ్రమానికి పోయి రాఘవ రెడ్డి గారితో కాలక్షేపం చేయడం మొదలు పెట్టారు. రాఘవరెడ్డిగారికి తిరుపతి వెంకట కవుల, ప్రబంధ కవుల, శతక కవుల వందలాది పద్యాలు కంఠస్థం. ఉభయుల మధ్య తిరుపతి వెంకట కవుల పద్యాలు, వెంకట పార్వతీశ్వర కవులు, దువ్వూరి రామిరెడ్డి, గుఱ్ఱం జాషువా, రాయప్రోలు సుబ్బారావు మున్నగు వారి కావ్య శిల్పంపై ఇష్టా గోష్టి సాగేది. అంతే కాదు రాఘవరెడ్డి గారు మను చరిత్ర, నైషధం లాంటి ప్రబంధాలు, కాళిదాసు, భవభూతి లాంటి కవుల శైలీ విన్యాసం పై పీవీ కి ఆసక్తి కలిగించారు. పీవీ ఆలోచనా విధానంపై రాఘవరెడ్డి గారి ప్రభావం గురించి పీవీ గారేమన్నారంటే – “భారతీయ సాహిత్య సాంప్రదాయం చదవడానికి నన్ను అమితంగా ప్రోత్సహించడమే కాకుండా స్వతంత్రంగా భావ వ్యక్తీకరణ చేయడానికి నాలో తపన పెంపొందించిన నా సాహిత్య గురువు, దివంగత శ్రీ గార్లపాటి రాఘవరెడ్డి గారికి నేను కృతజ్ఞున్ని” అని శ్రీ పీవీ గారే ఆయన ఆత్మకథలాంటి నవల ‘ది ఇన్ సైడర్’ (The Insider) లో పేర్కొన్నారు.

“ కాకతీయ కలగూర గంప”
శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి,
నిరంజన్ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page