అకుంఠిత దీక్ష‌తో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు..

సిద్ధిపేట జిల్లా విద్యార్థి ఘ‌న‌త‌

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: చదువుకు, ప్రతిభకు పేదరికం, సమస్యలు అడ్డురావని నిరూపిస్తూ ఒక  విద్యార్థి ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకున్నాడు.. సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన  దళిత విద్యార్థి నర్రా రాజ్ కుమార్ పట్టువొదలకుండా పోటీ పరీక్షలు రాసి 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.. 2019 లో మొట్టమొదట ప్రభుత్వ పంచాయతీ కార్యదర్శిగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే మరింత ఉన్నత ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివి మిషన్ భగీరథ పథకం అమలులో కీలకంగా వ్యవహరించే  అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాన్ని సాధించి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక పత్రం అందుకున్నాడు. హుస్నాబాద్ సబ్ డివిజన్ లో తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామంలో  చిరు ఉద్యోగి నర్రా రాజయ్య, లక్ష్మీ దంపతులకు పేద కుటుంబం లో జన్మించిన రాజ్ కుమార్ చిన్న తనం నుండే చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చే వాడు.. ప్రాథమిక విద్య పుల్లూరులోని నలంద విద్యాలయంలో పూర్తి చేసిన రాజ్ కుమార్..  8 నుంచి 10 వరకు సిద్దిపేట గాయత్రి విద్యాలయంలో చదివాడు. 10లో  మార్కుల ఆధారంగా హైదరాబాద్ నారాయణ జూనియర్ కళాశాలలో ఉచితంగా సీటు లభించింది. ఇంటర్ పూర్తయిన తరువాత ఎంసెట్  లో మంచి మార్కులు సాధించి బిటెక్ టికేర్  ఇంజినీరింగ్ కళాశాల లో జాయిన్ అయ్యాడు.. మంచి మార్కులతో బిటెక్ పూర్తి చేశాడు.. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాల వేటలో పడ్డ రాజ్ కుమార్ నిత్యం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ అందుకు సిద్ధమయ్యాడు. 2019లో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించాడు. ఆ ఉద్యోగం చేస్తూనే వీఆర్వో పరీక్ష రాసి  ఉద్యోగ బాధ్యతలు చేపట్టాడు.

 

కొండపాక మండల వీఆర్వోగా పనిచేస్తూనే 2021 లో గ్రూప్ 4 పరీక్ష రాసి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా మెదక్ జిల్లాలో ఉద్యోగం సాధించాడు. ఆ ఉద్యోగం చేస్తూనే మున్సిపల్ శాఖ లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ గా ఉద్యోగం సాధించాడు.. ఆ ఉద్యోగం చేస్తూనే 2022 లో అప్పటి ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం కోసం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జాబ్స్ కోసం వేసిన నోటిఫికేషన్  ద్వారా అప్లై చేసి అత్యుత్తమంగా ప్రిపేర్ అయి పరీక్ష రాశాడు.. 2023 జనవరి నెలలో ఫలితాలు వెలువడ్డాయి..అందులో ఉత్తీర్ణత సాధించి ఏఈఈ ఉద్యోగం సాధించాడు. ఇది రాజ్ కుమార్ వరుసగా సాధించిన ఆరవ ఉద్యోగం.. తల్లిదండ్రుల ప్రేరణ… చదువు చెప్పిన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో తాను ఈ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించానని రాజ్ కుమార్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు..భవిష్యత్ లో ఐఏఎస్ సాధించాలన్నదే తన లక్ష్యమని నర్రా రాజ్ కుమార్ తెలిపారు. పట్టుదలతో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నర్రా రాజ్ కుమార్ ను పలువురు అభినందించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page