నిత్య నిర్బంధ వేధింపులకు బలైన ప్రొ.సాయిబాబా

 ‌రాజ్యమా సిగ్గుపడూ..! నువ్వు బలితీసుకున్నది ఒక మానవతావాదిని. ప్రొ.సాయిబాబాను భౌతికంగా లేకుండా చేయగలిగావు, కానీ ఆయన స్ఫూర్తిని చంపే శక్తి నీకుందా.! సోక్రటీస్‌ ‌దగ్గర నుండి అంటోనియో గ్రాంసీ, ఆ తర్వాత ఎందరో ప్రజా మేధావులను, ఉద్యమకారులను చంపగలిగావు కానీ వాళ్ల దారిని చెరిపేయగలిగావా.! అది మీ వల్ల అవుతుందా.! చరిత్ర ఏం చెబుతుందో తెలియదా.! అంతిమ యుద్ధంలో ప్రజలే విజేతలు. సాయిబాబా గారి ఆలోచనలు,పోరాట స్పూర్తి, మొక్కవోని ధైర్యం,ఆ తెగింపు పౌర సమాజం ముందు ఉంచిపోయారు. తోటి మనిషి గురించి, ప్రకృతి గురించి ఆలోచించే, ఆరాటపడే మనుషులు ఉన్నంతవరకు సాయిబాబా బతికే ఉంటారు.మీరు నిలబెట్టిన ఎవరెస్టు శిఖరమంత పోరాట స్పూర్తిని, ఆర్తిని, ఆదివాసి పోరాట గరిమను ఎత్తిపడుతూనే ఉంటాం. సాయిబాబా కు కన్నీటి జోహార్లు.

దిల్లీ యూనివర్సిటీ కి చెందిన మేధావి ప్రొఫెసర్‌ సాయిబాబాను రాజ్యం బలి తీసుకుందనడంలో ఏలాంటి సందేహం లేదు.తన మేదస్సుతో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ సామాజిక, రాజకీయ చైతన్యాన్ని కలిగిన ప్రొఫెసర్‌ పై రాజ్యం కక్ష గట్టింది. బలహీనమైన ఆ శరీరం, దృఢమైన ఆలోచనలతో పాలకులను పరిగెత్తించింది. అతని ఆలోచనలు ప్రజలకు ప్రయోజనకరమని, పాలకులకు ప్రమాదమని సంఫ్‌ు పరివార్‌ శక్తులు పసిగట్టి అంతమొందించడానికి కుట్రలకు తెరలేపాయి.

భారత దేశంలో హిందుత్వ ఫాసిస్టు శక్తులు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ పై హక్కులపై నిత్య నిర్బంధం పెరిగిపోయింది. అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న హక్కుల కార్యకర్తలను, హేతువాదులను, లౌకిక శక్తులను,ప్రజాస్వామిక శక్తులను,కవులను, రచయితలను, కళాకారులను, ప్రశ్నించే గొంతుకలను, ఉద్యమ కారులను టార్గెట్‌గా చేసుకొని నిర్బంధాలను ప్రయోగిస్తూ ఏ కారణాలు లేకుండా కారాగారాలలో బంధిస్తూ వస్తున్నారు.ఆ కోవకు చెందిన ప్రథమ శ్రేణి హక్కుల కార్యకర్త ప్రొఫెసర్‌ సాయిబాబా. అనేక సామాజిక రాజకీయ ఉద్యమాలకు వారధిగా నిలిచిన ప్రొఫెసర్‌ సాయిబాబా ను చూసిన ప్రభుత్వానికి అభద్రతాభావం నెలకొన్నది. అతనికి ఉన్న 90 శాతం అంగవైకల్యం ఈ దేశానికి ప్రమాదకరం కాదు కాని,అతనికున్న మెదడే పాలకులకు ప్రమాదకరమని ఈ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ చెప్పడం ఈ దేశ ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఫాసిస్టు శక్తులు అనుసరించిన విధానాల వల్ల దాదాపు దశాబ్ద కాలం పాటు అక్రమ నిర్బంధానికి గురై మానసికంగా, శారీరకంగా కుంగిపోయారు.సాయిబాబా విడుదల కోసం దేశవ్యాప్తంగా కవులు రచయితలు మేధావులు మానవ హక్కుల కార్యకర్తలు సామాజిక కార్యకర్తలు గొంతెత్తి నినదించారు.

శరీరంలో ని అనేక రకాల అవయవాలు దెబ్బతింటున్నా ఈ దేశ న్యాయవ్యవస్థలు  గాని,పాలకులు  గాని కనికరించలేదు.అనేకమార్లు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించారు.అనారోగ్య కారణాల రీత్యా గృహ నిర్భంధానికి పరిమితం చేయాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించారు.తన కన్నతల్లి మరణించినప్పుడు కళ్లారా  చూసుకోవడానికి కూడా ఈ న్యాయవ్యవస్థ సాయిబాబా కు పేరోల్‌ అవకాశం కల్పించలేదు. పదేళ్ల తర్వాత అనేక సంఘర్షణ ల మధ్య,పోరాటాల మధ్య నిర్దోషిగా విడుదల చేసారు.ఈ పదేళ్ల కాలంలో అనేక రకాల ఆనారోగ్య సమస్యలకు గురయ్యారు.శారీరక వికలాంగుడైన సాయిబాబాకు జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సింది పోయి పాలకులు కక్షపూరితంగా వ్యవహరించి ఒంటరిగా నాగాపూర్‌ జైళ్లో ని అండా సెల్‌ లో బంధించారు.సరైన వైద్యం అందించలేదు,కనీసం జైల్లో తన గది వెలుపలి వాతావరణాన్ని కూడా చూడనివ్వలేదు.మానవ శరీరాన్ని కి అవసరమైన సూర్యరశ్మిని కూడా తాకనివ్వలేదు. అక్కడ ఉన్న ఖైదీల తో మాట్లాడనివ్వలేదు. అంగవైకల్యం గల ఆ మానవతామూర్తిని కారాగారంలో క్రూర జంతువు కంటే హీనంగా నిర్భందించారు. కోవిడ్‌ సమయంలో కూడా సరైన వైద్యాన్ని అందించలేదు.మెరుగైనటువంటి వైద్యం ప్రభుత్వం అందించి ఉంటే సాయిబాబాకు పదుల రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తి ఉండేవి కాదు.రాజ్యం కరుడుగట్టిన ధోరణి వల్లే సాయిబాబా సమాజానికి దూరమయ్యారు.

ఆలిండియా పీపుల్స్‌ రెసిస్టెన్స్‌ ఫోరమ్‌ నుండి మొదలు కొని, అనేక వేదిక ల ద్వారా కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు రాజ్య అణిచివేతకు నిరసనగా అనేక రాష్ట్రాలలో సభలు,సమావేశాలు నిర్వహించారు.దండకారణ్యంలో జరుగుతున్న హింసాకాండను తీవ్రంగా వ్యతిరేకించారు.ఆదివాసులపైనగాని,మావోయిస్టుల పైగాని రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించి  రాజ్యం రాజ్యహింసకు ఎక్కడ పాల్పడినా సాయిబాబా తనకున్న భావజాలాన్ని సభలలో సమావేశాలలో భావ ప్రకటన ద్వారా వ్యక్తీకరించారు.జల్‌ జంగల్‌ జమీన్‌ కోసం పోరాడుతున్న ఆదివాసులను సాయుధ బలగాలు నిరంతరం అణిచి వేస్తున్న అనేక సందర్భాలలో సాయిబాబా ఆదివాసుల పక్షాన నిలబడ్డారు. గ్రీన్‌ హంట్‌ పేరుతో రాజ్యం కార్పొరేట్‌ శక్తులకు ప్రోత్సాహన్ని అందిస్తున్నప్పుడు ఆదివాసుల పక్షాన ధిక్కార  స్వరమై నిలిచాడు ప్రొఫెసర్‌ సాయిబాబా. సమాజంలో దోపిడీకి గురైన దళితుల,కార్మికుల,కర్షకుల, స్త్రీల,మైనార్టీ అణగారిన వర్గాల పక్షాన హక్కుల కోసం పోరాడారు.

ఈ దేశ సహజ వనరులను పాలకులు అప్పనంగా పెట్టుబడిదారులకు అప్పజెప్పుతుంటే వాటిని కాపాడుకోవడానికి అనేక చర్చావేదికలు నిర్వహించి ఆదివాసి గిరిజన తండాలలో చైతన్యాన్ని తీసుకొచ్చాడు. ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం విప్లవాత్మకమైన ప్రజా ప్రతిఘటన పోరాట భావాలను వ్యక్తీకరించిన మహోన్నతమైన వ్యక్తి సాయిబాబా.1997 లోనే వరంగల్‌ డిక్లరేషన్‌ ద్వారా ప్రజాస్వామిక తెలంగాణను ఆకాంక్షించిన మేధావి.

పాలకులు తమ దగ్గర ఉన్న ఈడీలను, సిబిఐలను,ఉఫా లాంటి నల్ల చట్టాలను ప్రయోగించి అనేక మందిని లోబరుచుకుంటున్న ఈ కాలంలో రాజ్యం ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా సాయిబాబా తన చివరి  వరకు తను నమ్మిన సిద్ధాంతమైన మార్క్స్‌ మావో ఆలోచనలకు అనుగునంగా తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించారు. ఒక తెలుగు ఇంటర్వ్యూలో సాయిబాబాను అడిగిన ప్రశ్న ‘మిమ్ములని ఆదివాసుల హక్కుల గురించి మాట్లాడినందుకే పదేండ్లు జైలులో పెట్టారు కదా, మీరు ఇప్పుడు మళ్లీ ఆదివాసుల గురించే మాట్లాడుతున్నారెందుకు.? అన్నప్పుడు సాయిబాబా చెప్పిన సమాధానం ‘‘నాగరికుడు అనుకుంటున్న మనిషి అభాగ్యులైన ఆదివాసుల గురించి మాట్లాడక పోతే ఆ నాగరికతకే అర్థం లేదు’’ భౌతికంగా భారతీయ సమాజాన్ని విడిచి వెళ్లిన నేరం, న్యాయం, శిక్ష అన్ని హింసే పునాదిగా నడిచే రాజ్యం చేతుల్లో ఆయుధాలైనప్పుడు,సమాజపు అట్టడుగు మనుషుల గొంతుకయ్యే మానవతావాదులందరు నిర్బంధించ బడుతారు, హత్యలు చేయబడుతారు.ఈ హత్యలన్ని చీకటి రాజ్యం లో ‘రాజ్యాంగబద్ధంగానే’ జరుగుతునే ఉంటాయి. చీమూ, నెత్తురులేని మనుషులు మౌనంగా వీటికి అంగీకారం తెలుపుతుంటారు.

అంతర్జాతీయ వేదికలపై డెమోక్రసీ పేరుతో ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ పేరు తో అనేక చర్చా వేదికలలో పాల్గొంటున్న ఈ దేశ పాలకులు మేధావి ఐన శారీరక వైకల్యం కలిగిన సాయిబాబా హక్కులు గుర్తుకు రాలేదా.! రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌  మనుమలైన  అనిల్‌ తేల్‌ తుంబుడే,ప్రకాష్‌ అంబేడ్కర్‌ లను కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాల క్రింద దేశ ద్రోహులు గా రాజ్యం చిత్రీకరించింది. అంతర్జాతీయ సంస్థల వేదికల పైన హక్కుల గురించి మాట్లాడే ఈ ఫాసిస్ట్‌   పాలకులకు తమ దేశంలోని మేధావుల,రచయితల,ప్రశ్నించే గొంతుకల హక్కులను కాపాడవలిసిన బాధ్యత లేదా.!

రాజ్యమా సిగ్గుపడూ.! నువ్వు బలితీసుకున్నది ఒక మానవతావాదిని. ప్రొ.సాయిబాబా ను భౌతికంగా లేకుండా చేయగలిగావు, కానీ ఆయన స్ఫూర్తిని చంపే శక్తి నీకుందా.! సోక్రటీస్‌ దగ్గర నుండి అంటోనియో గ్రాంసీ, ఆ తర్వాత ఎందరో ప్రజా మేధావులను, ఉద్యమకారులను చంపగలిగావు కానీ వాళ్ల దారిని చెరిపేయగలిగావా.! అది మీ వల్ల అవుతుందా.! చరిత్ర ఏం చెబుతుందో తెలియదా.! అంతిమ యుద్ధంలో ప్రజలే విజేతలు. సాయిబాబా గారి ఆలోచనలు,పోరాట స్పూర్తి, మొక్కవోని ధైర్యం,ఆ తెగింపు పౌర సమాజం ముంధు ఉంచిపోయారు. తోటి మనిషి గురించి, ప్రకృతి గురించి ఆలోచించే, ఆరాటపడే మనుషులు ఉన్నంతవరకు సాయిబాబా బతికే ఉంటారు.మీరు నిలబెట్టిన ఎవరెస్టు శిఖరమంత పోరాట స్పూర్తి ని,ఆర్తిని,ఆదివాసి పోరాట గరిమను ఎత్తిపడుతూనే ఉంటాం.సాయిబాబా కు కన్నీటి జోహార్లు.
-పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page