ప్రొఫెసర్‌ సాయిబాబాకు ప్ర‌ముఖుల నివాళి

గొప్ప మేధావిని కోల్పోవడం బాధాకరమని వ్యాఖ్య
గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద పోలీసుల అనుమతి నిరాకరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 14 : ప్రముఖ విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, ప్రముఖ రచయితగా గుర్తింపు పొందిన సాయిబాబా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ కు సోమవారం మౌలాలి డివిజన్ జవహర్ నగర్ లోని శ్రీనివాస్ హైట్స్ లో ప్రొఫెసర్ జిఎన్. సాయిబాబా భౌతికకాయానికి పలువురు ప్ర‌ముఖులు అశ్రు నివాళులర్పించారు. దేశం గర్వించ దగ్గ గొప్ప మేధావిని కోల్పోవడం  బాధాకరమని పేర్కొన్నారు. మౌలాలిలో అయన నివాసానికి  అభిమానులు, పౌరసంఘాల కార్యకర్తలు, మానవ హక్కుల వేదిక నాయకులు  ప్రొఫెస‌ర్‌ సాయిబాబా ఆఖరి చూపున‌కు  భారీగా తరలివొచ్చారు,  దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. సమాజంలోని అంతరాలను, సామాజిక వివక్షను రాజ్యం  నైజాన్ని ప్రశ్నించినందుకు సాయిబాబా గొంతు నొక్కి కుట్రలు చేసి ఉఫా చట్టం ప్రయోగించింది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం. సాయిబాబా మరణానికి కేంద్రమే నైతిక బాధ్యత వహించాల‌ని ప‌లువురు డిమాండ్ చేశారు.  రాజ్య హింస పెరిగినప్పుడు సాయిబాబా అలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారని, రాజ్య వ్యవస్థ వ్యక్తులను చంపవచ్చు కానీ వారి ఆశయాలను చంపలేదు. అక్రమ కేసులు, నిర్బంధాలు ప్రయోగించి ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కాలని చూస్తున్న రాజ్యాన్ని ప్రజాస్వామికవాదులు, సామాజిక ఉద్యమ కార్యకర్తలు, వామపక్ష మేధావులు, ప్రజలందరూ ప్రశ్నించాలన్నారు. ప్రజా క్షేత్రంలో సమస్యల పరిష్కారం కోసం చేసే ఆందోళనలు, పోరాటాలే ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాకి నిజమైన నివాళులని తెలిపారు. ప్రొఫెస‌ర్‌ హరగోపాల్, ప్రొఫెస‌ర్ కోదండరాం, ప్రొఫెస‌ర్ మేల్కొటే ఇంకా పలువురు విద్యావంతులు సాయిబాబాకు  ఘ‌నంగా నివాళులు అర్పించారు. బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె టి రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు కేశవరావు  త‌దిత‌రులు కూడా శ్రద్ధాంజలి  ఘటించారు.

అమరవీరుల స్థూపం వద్ద నివాళికి అనుమతించ‌ని పోలీసులు
ప్రొఫెస‌ర్‌ సాయిబాబా భౌతిక కాయాన్ని ఆయన కోరిక మేరకు హాస్పిటల్ కు మధ్యాహ్నం అప్పగించారు.  అంతకు ముందు  హైద‌రాబాద్‌ గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ప్రొఫెసర్‌ సాయిబాబా పార్థివదేహానికి పలువురు నివాళులర్పించారు. సీపీఐ నేత నారాయణతో పాటు పలువురు వామపక్ష నేతలు అంజలి ఘటించారు. సాయిబాబా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. కామ్రేడ్‌ సాయిబాబా అమర్‌రహే, లాల్‌ సలాం, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. గన్‌పార్కు వద్ద 5 నిమిషాల సంతాప సమావేశం ఏర్పాటు చేస్తామని కుటుంబసభ్యులు, అభిమానులు కోరగా.. పోలీసులు నిరాకరించారు. సాయిబాబా పార్థివదేహాన్ని అంబులెన్స్‌లోనే ఉంచి నిర్వహిస్తామని చెప్పినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో సాయిబాబా అభిమానులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతం సాయిబాబా భౌతికకాయాన్ని మౌలాలిలోని ఆయన నివాసానికి తరలించారు. ఈ సంద‌ర్భంగా గన్‌పార్కు వద్ద సీపీఐ నేత నారాయణ మీడియాతో మాట్లాడుతూ పుస్తకాలు కాకుండా సమాజాన్ని చదివేవారు మేధావులని అన్నారు. సాయిబాబా అలాంటి వ్యక్తి అని కొనియాడారు. ఆయన మాట్లాడారు. సాయిబాబాను పదేళ్లు అన్యాయంగా జైల్లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. దోషి ఎవరో తేల్చాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాస్తామని నారాయణ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page