భిన్నత్వమే సృష్టి రహస్యం..

  • న్యూరోడైవ‌ర్స్‌ కళాకారుల ప్రతిభ అత్య‌ద్భుతం
  • ప్రత్యేకమైన కళాకారుల ప్ర‌ద‌ర్శ‌న క‌దిలించింది : గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వర్మ

హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలో న్యూరోడైవర్స్ (బుద్ధిమాంద్యం) కళాకారుల కళాకృతుల ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాలార్‌జంగ్ మ్యూజియం సహకారంతో “భిన్న స్వరాలు: అవధుల్లేని కళ” పేరుతో జరుగుతున్న ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బుద్ధి మాంద్యం ఉన్న కళాకారులకు చెందిన సుమారు 100 చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. భిన్నత్వం సృష్టి రహస్యమనీ, ఏకరూపత ఏ రంగంలోనూ ఆమోదయోగ్యం కాదని, వసుధైక‌క కుటుంబం అనే భారతీయ ఆదర్శాన్ని సాధించడానికి ఐక్యతే కీలకమన్నారు. మేధోపరంగా సవాళ్లు ఎదుర్కొనే కళాకారుల ప్రతిభ తనను కదిలించిందని, కళ అనుభూతికి చెందిన విషయమని, వివరించేది కాదని అన్నారు. ఇక్కడ ప్రదర్శించిన కళాకృతులు ప్రత్యేకమైన కళాకారుల్లోని దివ్య తేజస్సుకు నిదర్శనమని ఆయన అన్నారు.

సాలార్‌జంగ్ మ్యూజియం డైరెక్టర్ ఆశిష్ గోయల్ మాట్లాడుతూ… “వైవిధ్యం, సమానత్వం, సమ్మిళితత్వం మన మంత్రమ‌ని అన్నారు. మేధోపరంగా వైవిధ్యం కలిగిన కళాకారులు తమ కళలను, వారి ప్రత్యేక దృక్పథాలను ప్రజలకు తెలిపేందుకు ఈ ప్రదర్శన ఒక ముఖ్యమైన వేదికగా పనిచేస్తుంద‌న్నారు.  అంతేకాకుండా మన సమాజంలో సానుకూల మార్పును ప్రేరేపించే విషయంలో కళలకు ఉన్న సామర్థ్యానికి నిదర్శనంగా ఉంటుందని అన్నారు. ఆర్ట్ సాంక్చువరీ వ్యవస్థాపక ట్రస్టీ శాలినీగుప్తా మాట్లాడుతూ..సరిహద్దులను దాటి, అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచడానికి కళలకు ఉన్న పరివర్తన సామర్థ్యాన్ని దృఢంగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో.. ప్రముఖ గాయని దుర్గా జస్రాజ్, పద్మ అవార్డు గ్రహీత మహమ్మద్ అలీ బేగ్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ప్రదర్శించిన కళాఖండాలు, వాటిని తయారు చేసిన వారి వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను అతిథుల సమక్షంలో విడుదల చేశారు.

ఈనెల 27వ‌ర‌కు కొన‌సాగ‌నున్న‌ ప్ర‌ద‌ర్శ‌న‌
డాక్టర్ అతియా అంజాద్ రూపొందించిన ఈ క‌ళా ప్రదర్శన ఈ నెల 27 వరకు కొనసాగనుంది. ఇక్కడ పెయింటింగ్స్, డ్రాయింగ్స్, ఛాయాచిత్రాలు, డిజిటల్ కళారూపాలు, బంకమట్టి, ప్లాస్టిక్ నమూనాలతో సహా వివిధ రకాల కళాకృతులు సందర్శకుల కోసం అందుబాటులో ఉన్నాయి. ప్రతి కళాఖండం మేధోపర వైవిధ్యమైన కళాకారుల ప్రపంచాన్ని తెలియజేస్తుంది. ఈ కళాకారులు తమ కళాకృతుల ద్వారా వారికి సామాజికంగా ఉండే సంక్లిష్టతలను తెలియజేస్తూ కేవలం కళాత్మక విలువను తెలపటమే కాకుండా ఎందరికో ప్రేరణగా నిలుస్తారు. ప్రదర్శనలో పెయింటింగ్‌లు, డ్రాయింగ్‌లు, ఛాయాచిత్రాలు, డిజిటల్ ఆర్ట్, క్లే/ప్లాస్టిక్ మోడళ్లతో సహా భిన్న రకాల మాధ్యమాల్లో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page