హైద‌రాబాద్ లో విద్యుత్ అంబులెన్స్‌..

విద్యుత్ సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణకు ప్ర‌త్యేక వాహ‌నాలు..
ప్రారంభించిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 21 : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అత్యవసర విద్యుత్ సేవల పునరుద్ధరణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలను  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సోమ‌వారం ప్రారంభించారు. అనంతరం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ..  దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిచేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక వాహనాలు అందుబాటులోకి తీసుకువొచ్చిన‌ట్లు తెలిపారు.గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేందుకు అంబులెన్స్ తరహాలో సెంట్రల్ బ్రేక్ డౌన్  విభాగాన్ని పటిష్టపరిచేందుకు అన్ని డివిజన్లలో ప్రత్యేక వాహనాలను తీసుకువస్తున్నామ‌ని తెలిపారు.. ఇవి 24 గంటల పాటు సేవ‌లందిస్తాయ‌ని చెప్పారు.  విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే వెంటనే అత్యవసర సేవల సిబ్బంది అందుబాటులోకి వస్తారని తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో 57 సబ్ డివిజన్లు ఉన్నాయి. ప్రదా డివిజన్ కు ఒక వాహనాన్ని కేటాయిస్తున్నాం. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా సేవలను విస్తరిస్తున్నాం. ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే తక్షణమే సిబ్బంది అవసరమైనా యంత్ర పరికరాలతో పూర్తిస్థాయిలో స్వల్ప వ్యవధిలోనే పునరుద్ధ‌రిస్తారు.  ప్రతీ వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్స్ సిబ్బంది అవసరమైన మెటీరియల్ తో 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారు.

ప్రతీ వాహనంలో థ‌ర్మో విజన్ కెమెరాలు, పవర్ రంపం మిషన్, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, కేబుల్స్ అవసరమైన అన్ని భద్రతా పరికరాలు.. సాధనాలతో ఈ వాహనం సిద్ధంగా ఉంటుంది. ఈ వాహనంలో ఎర్త్ రాడ్లు, హెల్మెట్ వంటి అన్ని భద్రతా పరికరాలు ఉంటాయి. వాహనాలు ట్రాన్స్ఫార్మర్లను లాగ గలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా సిబ్బంది వాటిని తక్కువ సమయంలో తరలించడానికి మార్చడానికి అవకాశం ఏర్పడుతుంది. టిజిఏఐఎంఎస్ యాప్ అత్యవసర ప్రదేశాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. సిబ్బంది అవసరమైన ప్రదేశానికి వేగంగా చేరుకోగ‌లుగుతారు.

ఈ వాహనాలను విద్యుత్ అంబులెన్సులు అని పిలవచ్చు. ఇవి ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీలను అత్యవసరంగా సరిదిద్దడానికి సహాయపడతాయి. తద్వారా వినియోగదారులకు వేగంగా, మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయిఈ వాహనాలు దిగ్విజయంగా సేవలు అందించాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాన‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. కార్యక్రమం  ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎండీలు ముషారఫ్ అలీ , వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page