- అటవీ అనుమతుల్లో నిర్లక్ష్యం వొద్దు.
- మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : రాష్ట్ర ప్రగతికి జీవనాడులైన రహదారుల నిర్మాణం.. అటవీ అనుమతులు లేక ఆగిపోతే.. అది రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపుకు ఆటంకంగా మారుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సచివాలయంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఛాంబర్ లో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తో కలిసి అటవీ అనుమతులపై సమీక్ష సమావేశం జరిగింది. అటవీ అనుమతుల సాధనలో ఆలస్యంపై ఇద్దరు మంత్రులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా 7 రోడ్డు ప్రాజెక్టు పనులు, నాలుగేళ్లుగా 1 ప్రాజెక్టు, మూడేళ్లుగా 20 ప్రాజెక్టులు, గత సంవత్సర కాలంగా 31 ప్రాజెక్టులు అటవీ అనుమతులు లేక ఆగిపోయాయని వివరించారు. ప్రజల దైనందిన జీవితాలను ప్రభావితం చేసే ఇలాంటి రహదారులు అటవీ అనుమతులు లేక ఆగిపోవడం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఐదేండ్లుగా ఇన్ని అనుమతులు పెండింగ్ లో ఉంటే ఇరు శాఖల అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకంగా మారిందని విమర్శిచారు. ఇక నుంచైనా మరింత కృషి చేసి అటవీ అనుమతులు సాధించాలని తెలిపారు. అంతేకాదు, అటవీ అనుమతుల సాధనను పర్యవేక్షించేందుకు ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో ఎస్ఈ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమిస్తామని మంత్రి కొండా సురేఖకు తెలిపారు. కేంద్రం నుంచి అనేక రోడ్లకు అనుమతులు సాధించినప్పటికి అటవీ అనుమతులు లేక ఆగిపోవడంతో.. కొత్త రోడ్ల మంజూరు గురించి ఆడగడం ఇబ్బందిగా మారిందని.. రాష్ట్రానికి మరిన్ని జాతీయ రహదారులను మంజూరు చేయించాలంటే ముందు మంజూరైన రోడ్లను నిర్మించాల్సిన అవసరముందని కోమటిరెడ్డి తెలిపారు.
సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ.. డిఎఫ్ఓల స్థాయిలో ఉన్న 11 అటవీ అనుమతుల ఫైళ్ల ఆలస్యంపై అధికారులను ప్రశ్నించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ఫైళ్ల క్లియరెన్స్ లో జాప్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకున్న పరిచయాలతో రాష్ట్రానికి అనేక రోడ్లను మంజూరు చేయిస్తున్నారని.. అందుకు అనుగుణంగా అటవీ శాఖ నుంచి మరింత సహకారం అందించాల్సిన బాధ్యత మన భుజాలపైనే ఉందని అటవీ అధికారులకు సురేఖ సూచించారు. అటవీ అనుమతులను వేగంగా సాధించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా పర్యవేక్షణాధికారులను నియమించాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియల్ కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బీ అటవీ అనుమతులను కోఆర్డినేట్ చేసేందుకు అటవీ శాఖ నుంచి ఒక ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు..ఫైళ్ళ క్లియరెన్స్ ఆలస్యం కావడానికి గల కారణాలను డిఎఫ్ఓ ల నుంచి వివరణ తీసుకోవాలని పిసిసిఎఫ్ డోబ్రియాల్ ను ఆదేశించారు. తన కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న 4 రోడ్డు ప్రాజెక్టు పనులకు సంబంధించిన అటవీశాఖ అనుమతుల ఫైళ్లను ఈ రోజే క్లియర్ చేస్తానని ఆమే తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన రోడ్డు ప్రాజెక్టుల అటవీ అనుమతులను పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మరియు అటవీ శాఖ రీజినల్ ఆఫీసర్ త్రినాథరావు రాష్ట్రానికి సంబంధించిన అటవీ అనుమతుల ఫైళ్లను చిన్న చిన్న అంశాలపై వివరణలు అడుగుతూ కావాలని కాలయాపన చేయడం పట్ల సమావేశంలో ఇరువురు మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి జరుగుతుంటే అండగా నిలబడాల్సిందిపోయి.. ఇలా చిన్న చిన్న సాంకేతిక కారణాలతో ఫైళ్లను జాప్యం చేయడం తగదన్నారు. అంతకు ముందు ఉప్పల్ ఎలివేటేడ్ కారిడార్ పై జరిగిన సమీక్షలో డిసెంబర్ చివరికల్లా ఒక స్లాబ్ ను పూర్తి చేయాలని మోర్త్ ఆర్ ఓ కృష్ణప్రసాద్, ఎస్ఈ ధర్మారెడ్డికి సూచించారు.
సమావేశంలో పాల్గొన్న గాయత్రి యాజమాన్యం కూడా మంత్రి ఆదేశాలను పాటిస్తామని తెలిపారు. ఈ సమీక్షలో ఆర్ &బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, అటవీశాఖ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఆర్ &బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, ప్రత్యేక కార్యదర్శి రెవెన్యూ (డిజాస్టర్ మెనేజ్ మెంట్) హరీష్, పీసీసీఎఫ్ డోబ్రియాల్, ఈఎన్సీ, సీఈ లతో పాటు మోర్త్ ఆర్ఓ కృష్ణప్రసాద్, ఇతర అటవీ, ఆర్ &బీ, ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు పాల్గొన్నారు.