(27 అక్టోబర్ ‘భారత పదాతిదళాల దినోత్సవం’ సందర్భంగా)
ఇండో చైనా, ఇండో పాక్ సరిహద్దుల్లో అనునిత్యం అలజడులు, చొరబాట్లు సర్వసాధారణం అయ్యాయి. చైనా ప్రభుత్వం భారత భుభాగంలోకి చొచ్చుకొని రావడంతో గతంలో రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ప్రత్యక్ష భయంకర పోరులో ఇరుపక్షాలు ప్రాణాలను కోల్పోవడం చూశాం. ఇలాంటి దేశ సరిహద్దుల రక్షణలో ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటూ ఆర్మీ దళాలు అద్వితీయ సేవలను అందిస్తూనే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి. మన భారత అత్యున్నత శిక్షణ పొందిన “భారత పదాతి దళాలు” లేదా “ఇండియన్ ఇన్‌ఫాంట్రీ” దేశం ఎదుర్కొనే ఏ పోరులోనైనా ముందుండి యుద్ధం/పోరాటం చేయడానికి సర్వవేళల సిద్ధంగా ఉంటాయి. స్వతంత్ర భారతదేశంలో అంతర్భాగమైన జమ్ము కాశ్మీర్‌లోకి చొరబడి (ఆపరేషన్ గుల్మార్గ్ పేరుతో) ఆక్రమించడానికి ప్రయత్నించిన లష్కర్ వేర్పాటువాదులతో కలిసిన పాకిస్థానీ బలగాలను తిప్పికొట్టడానికి 27 అక్టోబర్ 1947 రోజున ఢిల్లీ నుండి బయలుదేరిన మన ‘ప్రథమ సిక్ ఇన్‌ఫాంట్రీ (పదాతిదళాల) బటాలియన్’ జవానులు జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో అడుగిడి, అక్రమ చొరబాటుదారులను నిలువరించి కాశ్మీర్ లోయను విజయవంతంగా కాపాడగలిగింది. వీరి ధైర్యసాహసాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏట 27 అక్టోబర్‌న మన సైన్యం “భారత పదాతిదళాల దినోత్సవం” ఘనంగా నిర్వహిఒమచడం ఆనవాయితీగా మారింది.
క్వీన్ ఆఫ్ బ్యాటిల్:
దేశ సరిహద్దుల్లో దుర్మార్గపు ఆలోచనలు కలిగిన శత్రు దేశాలకు తమ సత్తా చాటుతూ బలమైన హెచ్చరికలు పంపిస్తున్న ఇన్‌ఫాంట్రీ సైనికుల వీరత్వ ప్రదర్శనల అపురూప ఘట్టానికి గుర్తుగా ప్రతియేటా 27 అక్టోబర్ రోజున ‘భారత పదాతిదళాల దినోత్సవం (ఇండియన్ ఇన్‌ఫాంట్రీ డే)’ దేశభక్తి భావనలతో పాటించడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత ధైర్యసాహసాలు గల భారత పదాతిదళ తలసేన సేవలను కొనియాడుతూ, దేశరక్షణ యజ్ఞంలో ప్రాణాలర్పించిన వీరజవానులకు ప్రతి భారతీయుడు శ్రద్ధాంజలి గటించడం సాంప్రదాయంగా వస్తున్నది. దేశం ఎదుర్కొన్న ప్రతి సరిహద్దు వివాదంలో భారత పదాతిదళాల అంకితభావం, త్యాగశీలత, ధైర్యసాహసాలు, నిస్వార్థ దేశభక్తి, దేశం పట్ల నిబద్ధతలు నిరుపమానమే కాదు అత్యంత ప్రశంసనీయం కూడా. భారత ఆర్మీలోని అతి పెద్ద పదాతిదళ విభాగాన్ని ‘క్వీన్ ఆఫ్ బ్యాటిల్ (యుద్ధ రాణి)’గా పిలుస్తారు. ఇన్‌ఫాంట్రీ సైనికులు యుద్ధ క్షేత్రంలో ముందు నడుస్తూ శత్రువులతో ప్రత్యక్షంగా పోరాడుతారు. ఈ వీరులు మిలటరీ వాహనాలను, మౌంట్లను ఇతర ఆయుధాలను వినియోగిస్తారు. ఇండియన్ ఆర్మీలో అతి ఎక్కువ ఆయుధాలను పదాతిదళాలు మాత్రమే వాడతాయి.
సర్వీస్ బిఫోర్ సెల్ఫ్:
01 ఏప్రిల్ 1895న ప్రారంభించబడిన ఇండియన్ ఆర్మీలో ప్రస్తుతం 1, 237, 117 సైనిక బలగాలు, 960,000 రిజర్వ్ సిబ్బందితో ప్రపంచంలోనే బలమైన తలసేనగా రూపొందింది. ‘సర్వీస్ బిఫోర్ సెల్ఫ్’ నినాదంతో దేశ రక్షణ, సరిహద్దు కాపలా, జాతీయ అంతర్గత భద్రత, ఏకత, విపత్తులో పౌరసేవల కల్పన లాంటి విధులను గత 128 ఏండ్లుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నది. పాకిస్థాన్‌తో నాలుగు, చైనాతో ఒక యుద్ధాన్ని ఎదుర్కొన్న భారత పదాతిదళాల వీరత్వం మనకు గర్వకారణంగా నిలిచింది. వీటితో పాటుగా ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ కాక్టస్, ఆపరేషన్ బ్రాస్‌టాక్స్, విదేశాల్లో ఐరాస పీస్‌కీపింగ్ మిషన్స్ లాంటి అనేక పరీక్షా సమయాల్లో మన ఇన్‌ఫాంట్రీ ముందుండి దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఏడు కమాండ్లుగా విభజించబడిన ఇండియన్ ఆర్మీలో ప్రత్యక్ష పోరాట విభాగాలుగా ఇన్‌ఫాంట్రి, మెఖనైజ్డ్ ఇన్‌ఫాంట్రి, సాయుధ దళాలు (ఆర్మర్డ్ కోర్)లు వస్తాయి. వీరికి తోడ్పాటు అందించేందుకు 4 సపోర్ట్, 10 సర్వీస్ విభాగాలు ఉన్నాయి. త్రివిధ దళాల్లో 80 శాతం సైనిక బలగాలు ఇండియన్ ఆర్మీలోనే ఉన్నాయి. ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద ఆర్మీగా (యూయస్, రష్యా, చైనాల తరువాత)) ఇండియన్ ఆర్మీకి పేరుంది.
భారత పదాతిదళాలు అత్యంత శక్తివంతం:
భారత పదాతిదళాలలో గోర్క రైఫిల్స్, గ్రెనడీర్స్, గార్డ్స్, బీహార్, పారాచూట్, పంజాబ్, మద్రాస్, మరాఠా, గార్వాల్ రైఫిల్స్, రాజ్‌పుతానా, ఝాట్, సిక్, డోగ్రా, సిక్ లైట్ ఇన్‌ఫాంట్రీ, కుమావున్, జమ్ముకశ్మీర్, అస్సాం, మహర్, నాగా, లఢక్ స్కౌట్స్, అరుణాచల్, రాస్ట్రీయ రైఫిల్స్, మెఖనైజ్డ్ లాంటి పలు రెజిమెంట్లు దేశ సరిహద్దులలో అవిశ్రాంత సేవలను అందిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ శక్తివంతమైన సేనలు ఉన్న దేశాలలో అమెరికా, రష్యా, చైనా, ఇండియా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకెలు వస్తాయి. భారత పదాతిదళాలలో అతి శక్తివంతమైన, ప్రమాదకర ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్లుగా పారాచూట్, రాజ్‌పూత్, బీహార్, గోర్క, కుమావున్‌లు పలు సందర్భాలలో నిరూపించుకున్నాయి. యుద్ధక్షేత్రంలో గెలుపు ఓటమిలను నిర్ణయించేది పదాతిదళాల క్రయాశీలతేయని గుర్తుంచుకోవాలి. యుద్ధభూమిలో ముందడుగు లేదా వెనకడుగు వేయాల్సింది ఇన్‌ఫాంట్రీ బలగాలు మాత్రమే. భారత పదాతిదళాలకు ఆధునిక యుద్ధ సామాగ్రి, కఠోర శిక్షణ, అధునాతన ఆయుధాలను అందించుటతో ప్రపంచంలోనే అత్యుత్తమ ఇన్‌ఫాంట్రీగా పేరు తెచ్చుకోగలిగింది.
భారత పదాతిదళాలు అందిస్తున్న సేవను గుర్తుచేసుకుంటూ, దేశరక్షణలో అమరత్వం పొందిన వీర జవానులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, అమరవీరుల కుటుంబాలకు చేయూతను, ధైర్యాన్ని ఇవ్వవలసిన కనీస బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని మరువరాదు. సైనికుల త్యాగాలే మనం అనుభవించే స్వేచ్ఛ, శాంతి అని మరువద్దు. దేశ సర్వతోముఖాభివృద్ధిలో కర్షకులు, సైనికులు ముందుంటారు. అందుకే జై జవాన్, జై కిసాన్, జై హింద్ అనే నినాదాలు నిత్యం వాడవాడలా ప్రతిధ్వనిస్తున్నాయి.
కెప్టెన్: డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037.