- నగరంలో సదర్ ఉత్సవాలు రాష్ట్రానికే గర్వకారణం..
- ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : హైదరాబాద్ నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తాను గతంలోనే చెప్పానని సీఎం తెలిపారు. ఇక నుంచి ప్రతీ ఏటా సదర్ సమ్మేళనం అధికారికంగా నిర్వహించాలని.. ఇదే వేదిక నుంచి అధికారులకు ఆదేశాలిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ సదర్ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి తోపాటు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవుల పాత్ర కాదనలేనిదని, నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. సదర్ అంటే యాదవుల ఖదర్ అని, సదర్ సమ్మేళనాన్ని ప్రతీ గ్రామానికి తీసుకెళ్లాలని సూచించారు. యాదవులు రాకీయంగా ఎదగాలని అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపించామని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో యాదవులు, పశు సంపదను పెంచి పోషించారని, ఆనాడు మూసీ పరీవాహక ప్రాంతాల్లో యాదవులు పశుగ్రాసాన్ని పెంచుకునేవారని తెలిపారు.
మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవం కల్పిద్దామని, నగర అభివృద్ధికి యాదవులు అండగా నిలబడాలని కోరారు. ఏ శక్తులు అడ్డొచ్చినా నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ ది అని స్పష్టం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతవాసుల జీవన ప్రమాణాలను మెరుగు పరచబోతున్నామన్నారు. యాదవ సోదరులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
నాడు ముషీరాబాద్ లో అంజన్ కుమార్ యాదవ్ ను గెలిపించి ఉంటే.. మీవైపు నుంచి మంత్రిగా నిలబడేవారని అన్నారు. అంజన్ అన్న ఓడినా యాదవ సోదరులకు ప్రాధాన్యం ఉండాలని అనిల్ కు రాజ్యసభ ఇచ్చామని తెలిపారు. శ్రీకృష్ణుడు కూడా ధర్మం వైపు నిలబడ్డాడని, అందుకే కురుక్షేత్రంలో అధర్మం ఓడింది.. ధర్మం గెలిచిందని అన్నారు. యాదవులు కూడా ధర్మం వైపు నిలబడాలని, అధర్మాన్ని ఓడిద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.