కుటుంబ రాజకీయాలకు భారత రాజకీయ వ్యవస్థ మొత్తం ఆలవాలంగా ఉంటోంది. కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉండాలన్న కల సాకారం కావడం లేదు. కాంగ్రెస్‌లో కుటుంబ రాజకీయాలు పెనవేసుకు పోయాయి. అలాగే ప్రాంతీయ పార్టీల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. ఒక్క కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరూ రాజకీయాల్లో ఉండాలను కుంటున్నారు. తాజాగా ప్రియాంక వాధ్రా కూడా వయనాడ్ ద్వారా రాజకీయ అరంగేట్రం చేయడం చూస్తే ఇది మరోమారు స్పష్టం అవుతుంది. ఒక్కొక్కరు రెండమూడు చోట్లా పోటీ చేయడం, గెలిచాక మరొకరిని దింపడం వంటివన్నీ ఖజానాపై భారం పడేలా చేస్తున్నాయి. తొలుత ఒక్కచోటే పోటీ చేసేలా చట్టం రావాలి.
అలాగే కుటుంబంలో ఒక్కరికే రాజకీయ ప్రవేశం ఉండేలా చేయాలి. అప్పుడే దేశ ప్రజాస్వామ్యంలో ఇతరులకు చోటు దక్కుతుంది. రాజీవ్ కుటుంబంలో ఇప్పుడు మరొకరు అంటే ప్రియాంక రాకతో పార్టీ పూర్తిగా వారి గుప్పిట్లోకి వెళుతోంది. రేపు ఎక్కడో ఒకచోటు నుంచి రాబర్ట్ వాధ్రా కూడా రాజకీయ ప్రస్తానం మొదలవుతుంది. రాహుల్ ఇప్పటికే వయనాడ్ వదులుకోవడంతో ప్రియాంక ఎంటర్ అవుతున్నారు. రాహుల్ రాయబరేలిని దక్కించుకున్నారు. సోనియా రాజ్యసభలో ఉన్నారు. ఇంట్లో ఉన్న ముగ్గురూ ఎంపిలుగా ఉండబోతున్నారు. రాబర్ట్ కూడా వస్తే వారింట్లోనే నలుగురు అవుతారు.
ఇది ఎంతవరకు న్యాయమో ప్రజలు ఆలోచన చేయాలి. ఇలా కుటుంబంలోని అందరినీ చట్టసభలకు పంపితే వారికి దేశం పట్ల ఏమాత్రం బాధ్యత, చిత్తశుద్ది ఉంటుందో ప్రజలు ఆలోచించాలి. సోనియా కుటుంబంతో పాటు లాలూ ప్రసాద్ కుటుంబం, ఫరూక్ అబ్దుల్లా కుటుంబం, అమిత్ షా కుటుంబం, చంద్రబాబు కుటుంబం, కెసిఆర్ కుటుంబం, వెంకటస్వామి కుటుంబం.. కరుణానిధి కుటుంబం…ఇలా చెప్పు కుంటూ పోతే రాజకీయాల్లో అన్నీ కుటుంబాల అజమాయిషీలోకి వెళ్లాయి. వీరికి కుటుంబ అవసరాలు, స్వార్థం తప్ప ప్రజల గురించి ఆలోచన ఉండదు. భారత జనాభా 140 కోట్లకు చేరిన క్రమంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు అందుకే నెరవేరడం లేదు. పాలకులు ఎప్పుడూ వీరే కావడం, కొత్తవారికి అవకాశం లేకపోవడంతో మార్పులు కానరావడం లేదు. కుటుంబ పార్టీలు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయి. అందుకే పాలనలో కొందరే నిరంతరంగా ఉండే విధానం పోవాలి. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒక్కరినే నిరంతరంగా ఎన్నుకునే విధానం కూడా మంచిది కాదు. ఈ క్రమంలో రాజకీయాల్లో రొటేషన్ పద్దతి రావాలి. కుటుంబాలను దూరం పెట్టేలా సంస్కరణలు చేయాలి. ఒక్కరు ఒక్కచోటు నుంచే పోటీ చేయించగలగాలి. ఒక్కరికి రెండు పర్యాయాలు మించి అవకాశం లేకుండా చేయాలి. లేకుంటే వరుస పెట్టి వ్యాపారంలో లాగా అంతా రాజకీయాల్లో చేరి రాజకీయాలను, పాలనను వ్యాపారంగా మారుస్తున్నారు.
అమెరికా తరహాలో కేవలం రెండు పర్యాయాలు మాత్రమే ఎన్నికల్లో పోటీచేసే విధానం రావాలి. ఒక్కరే ఏళ్లతరబడి ఎంపిలుగా, ఎమ్మెల్యేలుగా ఉండకుండా రెండు టర్ముల కాలాన్ని గరిష్టంగా నిర్ణయించాలి. ఈ మేరకు రాజ్యాంగంలో సవరణలు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రియాంక రావడంతో మొత్తం సోనియా కుటుంబం పెత్తనంలోకి పార్టీ వెళ్లిపోయింది. ఖర్గే పేరుకే కాంగ్రెస్ అధ్యక్షుడు అని చెప్పాలి. లాలూ పార్టీ కావచ్చు, కెసిఆర్, కరుణానిధిల పార్టీలు కావచ్చు… వారే రాజ్యం ఏలుతున్నారు. రాజకీయాలను మారిస్తేనే యువతకు అవకాశం వస్తుంది. యువత రాజకీయల్లోకి వస్తే మార్పులు కూడా వస్తాయి. దేశం పురోగమిస్తుంది. అందుకే ఎన్నికల్లో పోటీ చేసేవారికి అర్హతలను కూడా నిర్ణయించాలి. ఇలా అర్హతలు లేకపోవడం వల్లనే స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందడం లేదు. కొందరే పాలకులుగా ఉంటూ.. ప్రజల ఆకాంక్షలను విస్మరిస్తున్నారు. అందుకే 75 ఏళ్ల స్వాతంత్య్రోత్సవంలో ఇంకా పేదలు పేదలుగానే ఉన్నారు. ఆకలి కోసం అలమటిస్తున్న వారు అలాగే ఉన్నారు. రాజకీయ నేతలు కూడా పేదల పేరు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు. ఇదంతా కూడా ప్రజలు కోరి తెచ్చుకున్న దౌర్భాగ్యంగా చూడాలి. మనం వేసే వోటు సక్రమంగా పనిచేస్తుందా లేదా అన్నది ప్రజలు ఆలోచన చేయాలి.
ఇలా రాజకీయ కుటుంబాలను మోయాల్సిన ఖర్మ మనకు లేదని గుర్తించాలి. కుటుంబ పార్టీలను దూరం పెట్టడం అలవాటు చేసుకోవాలి. వారికి వోటేయకుండా గట్టిగా నిలబడాలి. మన వోటును ఆయుధంగా చేసుకుని కుటుంబ సంక్షేమం కోసం పాటుపడే దగుల్బాజీ రాజకీయాలకు చరమగీతం పాడాలి. ప్రజలు పట్టించుకోని కారణంగా పాలకులు రాజకీయాలను వ్యాపారంగా మార్చుకుని, అధికారం చేతబట్టి శాసిస్తున్నారు. ప్రజలను వోటుబ్యాంకుగా తయారుచేసుకుని వారిని మభ్యపెట్టడం అలవర్చుకున్నారు. ఎన్నికల అక్రమాల్లో ఆరితేరిన నేతలంతా పాలకులుగా పెత్తనం చెలాయిస్తున్నారు. వోట్లను కొనుగోలు చేయడం ఎలాగో నేర్చుకున్నారు. తమకు అనుకూలమైన ఎన్నికల అధికారులను, పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకుని ఓట్లను వేయించుకుని ఎన్నికవుతున్నారు.
ఈ విధానం పోవాలంటే ఎన్నికల్లో భారీ సంస్కరణలు రావాలి. ఒక్కరే నిరంతరంగా పదవిని పట్టుకుని ఉండే పద్దతికి స్వస్తి పలకాలి. కుటుంబాల నుంచి ఒక్కరికే ఛాన్స్ అన్నది రావాలి. ఎంపి, లేదా ఎమ్మెల్యేగా గెలిచిన వారు రెండు టర్మ్‌లకు మించి పనిచేయకుండా చట్టబద్ద విధానం అమల్లోకి తీసుకుని రావాలి. జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నది కేవలం ఓటమికి భయపడే అని ప్రజలు గుర్తించాలి. తరచూ ఎన్నికలు దేశ ఖజానాను దోచేస్తున్నాయి. జమిలి ఎన్నికలకు నిలబడ్డ బిజెపి, ఇలాంటి సంస్కరణ లను కూడా తేవాలి. కుటుంబ పార్టీలను దూరం పెట్టాలి. లేదా కుటుంబంలో ఒక్కరే రాజకీయాలకు అర్హులుగా చేయాలి. అప్పుడే మార్పు వస్తుంది. అప్పుడే ఇంటిల్లిపాదీ రాజకీయాల్లో చేరి ప్రజల నెత్తిన కూర్చునే ఖర్మ తప్పుతుంది. ప్రజాస్వామ్యం బలపడుతుంది.
-కల్లూరి రామకృష్ణా రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్
సెల్ : 9502728827