నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం
పర్యావరణ పరిరక్షణ అన్నది కేవలం నినాదంగా మారింది. దేశ రాజధాని దిల్లీ విషయమే తీసుకుంటే వాతావరణ కాలుష్యం అరికట్టే చర్యలు కానరావడం లేదు. కోర్టులు మొత్తుకుంటున్నా పట్టింపు లేదు. కాలుష్యం కారణంగా తాను వాకింగ్‌కు కూడా వెళ్లలేక పోతున్నానని సుప్రీం చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. ఎంతగాపరిస్థితి దిగజారిందో గుర్తించాలి. దిల్లీ కాలుష్యపరిస్థితిలో మార్పు కానరావడం లేదు. గాలి నాణ్యత పడిపోతున్నా పట్టించుకోవడం లేదు. పంట వ్యర్థాలను కాల్చకుండా కూడా అరికట్టడం లేదు. మానవాళికి చెట్లు చేసే మేలేమిటో తెలుసుకోవడానికి ఎవరూ గూగుల్‌ను ఆశ్రయించనవసరం లేదు. పర్యావరణవేత్తలు చెబితే తప్ప తెలియని వారెవరూ లేరు. చెట్ల ఉపయోగాల గురించి బడి చదువుల దగ్గరనుంచి గురువులు నూరిపోయడమే ఇందుకు కారణం. దురదృష్టమేమంటే అధికార పీఠాలపై ఉన్న నేతలు, ఉన్నతాధికార వర్గంలో పనిచేస్తున్నవారు ఏ బళ్లో చదువుకుని ఆ స్థాయికి ఎదిగారోగానీ… దేశంలో ‘అభివృద్ధి’ పేరు చెప్పి వృక్ష సంహారం జరగని రోజంటూ దేశంలో ఉండటం లేదు. చెట్లను కాపాడటానికి పర్యావరణ ఉద్యమకారులు చేయని పోరాటమంటూ లేదు. ప్రాణవాయువును అందిస్తున్న వృక్షజాలాన్ని ధ్వంసం చేయాలా అని ప్రశ్నిస్తున్నారు.
విభిన్న జాతుల పక్షుల్ని వీక్షించడానికి, తమ కెమెరాల్లో బంధించడానికి విహంగ ప్రేమికులు నిత్యం ప్రకృతి ఒడిలోకి వస్తారు. ప్రశాంతంగా స్వచ్ఛమైన వాయువు పీల్చి పునీతులు కావడానికి నగర వాసుల్లో అత్యధికులు ఎన్నుకునే పార్కులు, చెట్టు ఉన్నచోటే. ఇది లోపించడం వల్ల ఇటీవల దిల్లీ కాలుష్యం పీల్చలేనంతగా తయారయ్యింది. చెట్లనుంచి వీచే గాలిని ఆస్వాదిస్తూ వందలమంది సైక్లింగ్, జాగింగ్ చేస్తుంటారు. పాలకుల తీరు కారణంగా, నగాల వ్యాప్తి కారణంగా ముంబ్కెతో సహా మన మహానగరాలు కాంక్రీట్ జంగిల్స్‌గా మారుతున్నాయి. ఉపాధి దొరుకు తుందని పల్లెలు వీడి వస్తున్న వారితో పట్టణీకరణ పెరుగుతోంది. పట్టణీకరణ, పంటలు, పశువుల పెంపకానికి , కాగితాలు తయారు చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం 1 కోటి హెక్టార్లకు పైగా చెట్లను నరుకుతున్నారు. ఇది అటవీ నిర్మూలనకు కారణమవుతుంది. మరో అతిపెద్ద పర్యావరణ సమస్యలలో వాయుకాలుష్యం ఒకటి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 42 లక్షల నుండి 70 లక్షలు మంది మరణిస్తున్నారు. ప్రతీ పదిలో తొమ్మిది మంది అధిక స్థాయి కాలుష్య కారకాలను కలిగి ఉన్న గాలిని పీల్చుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. భూమిపై ఉన్న సముద్రామట్టం సంవత్సరానికి సగటున 3.2 మిమీ పెరుగుతున్నాయి.
ఈ శతాబ్దం చివరి నాటికి అవి దాదాపు 0.7 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పెరుగుదల సముద్ర తీరప్రాంతం ముంపునకు గురై అక్కడ నివాసముండే సుమారు 34 నుండి 48 కోట్ల ప్రజలు సురక్షితమైన ప్రాంతాలుకు వలస వెళ్ళడం కారణంగా వారు వెళ్ళే ప్రాంతాలలో జనాభా పెరగడమే కాకుండా, అక్కడ ఉండే వనరులు అధిక వినియోగానికి గురవుతాయి. ప్రతి గంటకు 300 ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో అడవులు నరికివేయబడుతున్నాయి. ఇలా కొనసాగితే 2030 నాటికి ఇప్పుడున్న అడవులలో 10% మాత్రమే కలిగి ఉండవచ్చు. రాబోయే 100 సంవత్సరాల లోపులోనే అడవులన్నీ నాశనమయ్యే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ విపరీతంగగా వాడకం పెరిగి అనేకం కాలుష్య కారకాలుగా తయారయ్యాయి. ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత నగరాలు 20 ఉంటే అందులో 15 మన నగరాలే. తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రపంచంలోని 15 నగరాల్లో మన వాటా 11. ఈ నగరాల వాతావరణంలో, ఇక్కడి తాగునీటిలో మృత్యువు దాగుందని నిపుణులు చాన్నాళ్లుగా చెబుతున్నారు. మానవాళి అభివృద్ధిలో పర్యావరణం కీలకపాత్ర పోషిస్తుంది. పర్యావరణం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. మన చుట్టూ జీవ, నిర్జీవ అంశాలన్నింటినీ పర్యావరణం అంటారు. పర్యావరణ ఆరోగ్యం అనేది ప్రజారోగ్యంలోని అతిపెద్ద రంగాలలో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ సమస్యల కారణంగా ప్రతి సంవత్సరం ఒక కోటి అరవై లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపితుంది. అంతేకాక వందకు మించి అనారోగ్యాలు నేరుగా పర్యావరణ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటాయని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా 155 దేశాలు తమ పౌరులకు జాతీయచట్టం లేదా అంతర్జాతీయ ఒప్పందాల మేరకు ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే హక్కును కలిగి ఉన్నా కూడా భూ,వాయు,జల, వాయు, రసాయన కాలుష్యాల లాంటి ‘‘పర్యావరణ ప్రమాదాల’’తో ఇరవై మూడు శాతం మరణాలు సంభవిస్తున్నాయని నివేదించడం గమనార్హం. నగర పౌరుల ఊపిరితిత్తుల్లోకి కొంచెం కొంచెంగా చొరబడుతున్న కాలుష్యం వారిని రోగగ్రస్తులుగా మారుస్తోంది. కేన్సర్, గుండె జబ్బులు వగైరాలకు కారణమవుతోంది. అనేకుల్లో అకాల వృధ్ధాప్యాన్ని కలిగిస్తోంది. వారిని పనిపాటలకు దూరం చేస్తోంది. ఇదంతా మన పాలకులకు ఆందోళన కలిగించాలి. దీన్ని సరిచేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి పురిగొల్పాలి. కాలనీలో చెట్లు పెంచాలి. ఉన్న చెట్లను తొలగించకతప్పదను కుంటే ఆ చెట్లను మరొకచోట పాతడానికి ప్రయత్నించాలి. ప్రపంచ అధ్యయన సంస్థలు చెబుతున్న వాస్తవాలను అమలు చేయాలి. ఇల్లు కట్టుకుందా మనో, ఉన్న ఇంటిని విస్తరించుకుందామనో ఎవరైనా తమ ఆవరణలో చెట్లు కొట్టాలంటే అందుకు అనుమతులు తీసుకోవడం అవసరం. కానీ తమకు అలాంటి నిబంధనలు వర్తించవన్నట్టు అధికార యంత్రాంగాలు ప్రవర్తిస్తున్నాయి. పాలకులే ఇలా చట్టాల్ని ధిక్కరించే స్థితికి దిగజారడం కారణంగా దేశంలో పర్యావరణం దెబ్బతింటోంది. ఇప్పటికైనా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.
-రేగటి నాగరాజు
-రేగటి నాగరాజు