టపాసులకు ఆద్యులు చైనీయులు. క్రీ.పూ. 200 సం.లోనే వెదురు (బాంబూ) టపాకాయలు వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. దాన్ని చైనా బాషలో బాజు అంటారు. పేలుతున్న వెదురు అని అర్ధం. తుపాకి మందు కని పెట్టేంత వరకు వెదురు టపాసులనే చైనా వారు వాడేవారు. క్రీ.శ. 600ల ప్రాంతంలో చైనా వారు తుపాకి మందుని కనిపెట్టారు. గన్ పౌడర్ లేక బ్లాక్ పౌడర్ రసాయన ప్రేలుడు పదార్ధం. ఇది గంధకం, చార్కోల్, పోటాషియం నైట్రేట్ ల మిశ్రమం. దీన్ని సాల్ట్ పౌడర్ అంటారు. ఇది మండినప్పుడు 427 నుంచి 464డిగ్రీల ఉష్ణం వెలువడుతుంది. దీని తరువాత చేసేవారు అందుకే టపాసులకు బాజు పేరు స్దిరపడి పాయింది. క్రీ.శ. 900వ సం.లో చైనా నుండి టపాసులు ఇంగ్లాండు అరబ్బు దేశాలు, భారత దేశానికి చేరుకున్నాయి.
మనదేశంలో టపాకాయల పరిశ్రమ తమిళనాడులోని శివకాశిలో విస్తరించివుంది. దేశంలోని టపాకాయల ఉత్పత్తిలో 70% శివకాశిలోని 1000కి పైగా పరిశ్రమలలో తయారవు తున్నది. పరిశ్రమలలో పనిచేసే వారు ముఖ్యంగా పసిపిల్లలు. వారిలో 4 నుంచి 16 సం.లోపు వారు 30% మంది వున్నారు. అందులో 90% మంది ఆడ పిల్లలు, పేద పిల్లలు, వెనుకబడిన తరగతివారు. చేతులకు ఎలాంటి రక్షణ కవచాలు (గ్లౌజులు) లేకుండా ప్రమాదకర రసాయన పదార్థాలలో టపాసులు తయారు చేస్తున్నారు పిల్లలు. రసాయనాల వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులతో బాధ పడుతున్నారు. ప్రభుత్వ చట్టాలు ఎన్ని వున్నా పిల్లలు చేసే ఈ చాకిరీని అరికట్టలేక పోతున్నారు. 1991లో శివకాశిలో ఓ ఫ్యాకల్టీలో జరిగిన ప్రేలుడు వల్ల 39 మంది చనిపోయారు. 65 మంది గాయపడ్డారు. 2009, జూలైలో జరిగిన ప్రమాదంలో 40 మంది చనిపోయారు. ఆగస్టు 2011లో ఫ్యాక్టరీ ప్రమాదంలో 7 మంది చనిపోగా ఐదుగురు గాయపడ్డారు. సెప్టెంబర్ 2012 ప్రమాదంలో 40 మంది చనిపోగా 38 మంది గాయ పడ్డారు. ఇవి అధికారిక లెక్కలు కాగా, నిజానికి ఎక్కువగానే ప్రమాదాలు జరిగి వుంటాయి.
టపాకాయలు కాల్చడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం, రసాయన కాలుష్యం చాలా ఎక్కువగా వుంది. టపాసులు కాల్చినప్పుడు శబ్దం 140 డెసీబెల్స్ దాటుతోంది. ఆరోగ్య పరంగా శబ్దాలు 125 డెసిబెల్స్ దాట కూడదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టపాకాయల శబ్ద తీవ్రత 125 డెసిబెల్స్ దాట కూడదు. కానీ టపాకాయల తయారీ కంపెనీలు నియమాన్ని పాటించడం లేదు. ఈ శబ్దాల వల్ల తాత్కాలిక చెవుడు, శాశ్వత చెవుడు ఏర్పడు తున్నది. అధిక శబ్దం వల్ల వినికిడి సమస్యలు, రక్తపోటు, గుండెపోటు, నిద్రలేమి లాంటి సమస్యలు వస్తున్నాయి. ఎన్నో రకాల ప్రమాదాలు పొంచి వున్నాయి. టపాకాయలు కాల్చడంలో అగ్ని ప్రమాదాలు కోకొల్లలు. చేతిలో చిచ్చుబుడ్డి పేలడం, ఒళ్ళుకాలడం, బట్టలు కాలి పోవడం జరుగుతూనే వుంటాయి. చాలా మంది ఆ వెలుగు చూడలేక కళ్ళు పోగొట్టుకున్న సందర్భాలు అనేకం.
దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. టపాకాయలు కాల్చేటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదాలు సంభవిస్తాయి. బాణ సంచాలను ఇంటిలో కాల్చ కూడదు. ఇంటికి దూరంగా బహిరంగ ప్రదేశాలలో కాల్చడం వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. టపాకాయలు కొన్నిసార్లు అవి పేలకుండా ఆగిపోతాయి. వాటిని వెంటనే వెళ్లి పట్టుకోవడం లాంటివి చేయకూడదు. ముందుగా వాటిపై నీటిని పోయడం వల్ల వాటి నుంచి ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. టపాకాయలు కాల్చేటప్పుడు ముఖ్యంగా ఆల్కహాల్ శానిటైజర్ లను వాడి టపాకాయలను వెలిగించ కూడదు. శానిటైజర్ లకు తొందరగా మండే స్వభావం ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున దీపావళి రోజు శానిటైజర్ లను వాడక పోవడం మంచిది. టపాకాయలపై ఇచ్చిన సలహాలు సూచనలను ఖచ్చితంగా చదివి పాటించాలి. మంటలు అంటుకునే ప్రదేశాలు… కరెంటు తీగలు, ఎండు గడ్డి, పూరి గుడిసెలు ఉన్న ప్రదేశాలలో బాణా సంచాలు కాల్చ కూడదు. టపాకాయలను కాల్చి వాటిని అలాగే రోడ్డు మీద పడేయడం వల్ల ఆ దారి వెంట వెళ్లే వారికి వాటి నుంచి ప్రమాదం కలగవచ్చు. ఒక బకెట్లో ఇసుక పెట్టుకొని అందులో కాల్చిన కాకర పువ్వులను, టపాకాయలను వేయడం మంచిది.
బాణా సంచాలను కాల్చేటప్పుడు ముందస్తు జాగ్రత్తగా ఒక బకెట్ నిండా నీటిని పక్కన ఉంచుకోవాలి. చిన్నపిల్లలకు పెద్దవారే దగ్గరే ఉండి జాగ్రత్తగా టపాకాయలను కాల్పించాలి. వీలైనంత వరకు అందరూ కూడా కాటన్ దుస్తులను ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాణసంచా కాల్చిన తర్వాత పిల్లలు టపాకాయలను కాల్చిన చేతులతోనే ముక్కు, చెవులు, కళ్లను రుద్దుకుంటారు. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. గొంతులో నీళ్లు పోసుకుని గార్గిలింగ్ చేయాలి. గాయం అయితే దాని మీద పదిహేను నిమిషాల పాటు చన్నీరు, వేడి నీరు పోయరాదు. తర్వాత ధారగా పోయాలి లేదా నీటి కుళాయి కింద పెట్టాలి. గాయమైన అరగంట లోపల ఈ చికిత్స జరగాలి. ఇలా చేయడం వల్ల వేడి తగ్గిపోతుంది. కంటికి చువ్వలాంటిది తగిలి గాయం అయినప్పుడు వెంటనే చేత్తో కానీ కంటిని రుద్దుతారు. చాలా ప్రమాదం. గాయం తీవ్రత పెరగడానికి, గాయం విస్తరించ డానికి కారణం అవుతుంది. కంటికి వస్త్రంతో గట్టిగా కట్టు కట్టకూడదు. ఇలా చేస్తే కంట్లో గుచ్చుకున్న నలుసు మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గాయమైన కంటిని కప్పు లేదా షీల్డుతో కప్పి డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళాలి. రసాయనాలు కంట్లో పడితే కంటిని పరిశుభ్రమైన నీటితో కడగాలి. కంటిని రుద్దకుండా దోసిలితో నీటిని తీసుకుని కంటికి తగిలేటట్లు చేస్తూ శుభ్రం చేయాలి. టపాసుల వినియోగాన్ని తగ్గించాలి. అధిక శబ్దాలు వెలువరించే టపాసులు కాల్చకూడదు. టపాసులు పర్యావర ణానికి ప్రమాద కారకాలు. టపాసుల కోసం డబ్బు వృథా చేయవద్దు. వెలుగులు నింపే దీపాలతో దీపావళి చేసుకుందాం. పర్యావరణ పరిరక్షణ దీపావళిని జరుపుకుందాం.
-రామకిష్టయ్య సంగనభట్ల
9440595494